జనం పక్షాన పోరాడే ఒకే ఒక్కడు

హైదరాబాద్, 25 ఆగస్టు 2013:

జనం మధ్యన లేకపోయినప్పటికీ, జైలులో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడగలిగిన చిత్తశుద్ధి ఒక్క శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని చెప్పడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గర్వపడుతోందని అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. జైలు గోడలు గాని, పోలీసు నిర్బంధం గాని, బెదిరింపులు గాని ఏవైనా మనిషిని ఆపగలుగుతాయేమో గాని మనసును ఆపలేవని అన్నారు. చిత్తశుద్ధితో, స్పష్టంగా, ధైర్యంగా, పట్టుదలగా ఒక సమస్య మీద స్పష్టంగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రజలంతా అభినందిస్తున్నారని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం చాలా మంది ఉద్యమాలు చేశారని, పార్లమెంటులో తమ వాణిని వినిపించడానికి, స్పందింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కానీ, శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఒకే ఒక్కడు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ... తర అభిప్రాయాన్ని స్పష్టంగా స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. శ్రీ జగన్‌ దీక్ష చేయడానికి కేసీఆర్, హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అంబటి వ్యాఖ్యానించారు.

సమన్యాయం కోరుతూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుంటూరులో ఈ నెల 19న ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను శనివారం ఉదయం శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు విరమించారని అంబటి తెలిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించి ఉంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని మీడియాలో వచ్చిన తరువాత పత్రికలు కాని, కొన్ని చానెళ్ళు గాని విషప్రచారం చేయడం ప్రారంభించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలులోనే శ్రీ జగన్‌ నిరాహార దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దైపోతాయని, నిబంధనలు వర్తించవని, ఆయనను మరో జైలుకు తరలిస్తారని తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. సమైక్య వాదాన్ని, పోరాటాన్ని మెచ్చుకోవాలసిన వారు కూడా దూషించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అన్నారు.

సమైక్య రాష్ట్రం అంటూ చాలా మంది సీమాంధ్రలో నిరాహార దీక్షలు చేస్తున్నారని, శ్రీమతి విజయమ్మ దీక్ష చేస్తుంటే.. పోటీగా టిడిపి నాయకులూ నిరాహారదీక్షలు చేశారని అయితే, తమ నాయకుడి చంద్రబాబు అభిప్రాయం చెప్పడానికి మాత్రం వెనుకా ముందూ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం మధ్య నిరంతరం ఉన్న నాయకుడని టిడిపి వారు చెప్పుకుంటున్నారని అలాంటి నాయకుడు తలపెట్టిన బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిందని ఎద్దేవా చేశారు. నిత్యం జనం మధ్యనే ఉండి జనం సమస్యల కోసం పోరాడుతున్నాను, పాదయాత్ర చేశానని చెప్పుకునే చంద్రబాబు కూడా స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో టిడిపి నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

అయితే, జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ జరుగుతున్న అన్యాయంపై కోట్లాది మంది గొంతులను వినిపించేందుకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేస్తుంటే.. జైలు నిబంధనలు అంగీకరించవంటూ దుష్ప్రచారం చేయడాన్ని అంబటి తూర్పారపట్టారు. జైలులోనే కాదు బయట కూడా నిరవధిక సమ్మె చేయడానికి గాని, నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి గాని నిబంధనలు అంగీకరించవు అన్నారు. ఆమరణ దీక్ష చేసుకోవచ్చని ప్రభుత్వాలు ఎప్పుడైనా అవకాశం ఇచ్చిన సందర్భాన్ని మనం చూడలేదన్నారు. నిరాహార దీక్ష కొత్తగా వచ్చిన ఆయుధం కాదన్నారు. ఒక సమస్య మీద చిత్తశుద్ధితో మనలను మనం శిక్షించుకుంటూ, ఆహారం తీసుకోకుండా పోరాడే హక్కు స్వాతంత్ర్య పోరాటంలోనే జాతిపిత మహాత్మా గాంధీ మనకు ఇచ్చిన ఆయుధం నిరాహార దీక్ష అన్నారు. జైలులోనే ఉండి మహాత్మా గాంధీ ఐదు సార్లు నిరాహార దీక్ష చేసిన వైనాన్ని అంబటి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తారని అంబటి స్పష్టంచేశారు. ఇంతకు వివిధ సమస్యలపై శ్రీ జగన్‌ రెండు రోజుల దీక్ష, ఐదు రోజుల దీక్షలు చేసిన వ్యక్తి అన్నారు. పదహారు మాసాలు జైలులో ఉన్నప్పటికీ కూడా ప్రజల కష్టాలు, నష్టాలు, మనోభావాలు తెలుసుకుని నిరాహార దీక్షకు ఉపక్రమించారని అంబటి పేర్కొన్నారు. శ్రీ జగన్‌ దీక్షకు ప్రజలందరి మద్దతు, ముఖ్యంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, సమైక్య వాదులు సంఘీభావం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

సమన్యాయం చేయాలంటూ శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, మరి కొద్ది రోజుల్లో శ్రీమతి షర్మిల బస్సు యాత్ర చేయబోతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని అంబటి తెలిపారు. జైలులో శ్రీ జగన్, మరో పక్కన శ్రీమతి విజయమ్మ, ఇంకో పక్కన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ కుమార్తె శ్రీమతి షర్మిల పోరాటబాటలో ముందుకు వెళుతుండడాన్ని పార్టీ చాలా గొప్పగా భావిస్తున్నదన్నారు.

కాని, టిడిపి నాయకులు పార్లమెంటులో ఒక మాట, బయట మరో మాట చెబుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబు అభిప్రాయం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలది ఒక మాట ఆ పార్టీ అధ్యక్షుడిది మరో మాట అని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన జూలై 25 వ తేదీనే టిడిపి ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కేవలం సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో గొడవ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముందు సీట్లోనే కూర్చునే సోనియా దగ్గర కాకుండా స్పీకర్‌ వద్దకు వెళ్ళి గొడవ చేయడంలో ఔచిత్యం ఏముందని అంబటి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీలోని ఉన్నత స్థాయి కమిటీ సిడబ్ల్యుసి నిర్ణయాన్ని అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తే.. ఇక సమన్యాయం జరిగినట్లు ఎలా భావిస్తారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు అంబటి జవాబిచ్చారు. సమన్యాయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకి చేతకాలేదు కాబట్టి రాష్ట్రాన్ని యథాతథంగా అంటే సమైక్యంగా ఉంచాలనే తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకునే బలం కాంగ్రెస్‌ పార్టీకి ఉందా? కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలోనే ఏకాభిప్రాయం తీసుకురాలేని కాంగ్రెస్‌ను ఇతర పార్టీలు నిలదీస్తే ఏం సమాధానం చెబుతుంది? అని అంబటి మరో మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులిచ్చారు.

Back to Top