న్యూఇయర్‌ వేడుకలకు వైయస్‌ఆర్‌సిపి దూరం

హైదరాబాద్‌, 30 డిసెంబర్‌ 2012: కొత్త సంవత్సరం (2013) వేడుకలకు దూరంగా ఉండాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్ణయించింది. ‌వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అక్రమంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించినందుకు నిరసనగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు, కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ సెల్‌ అధ్యక్షుడు బి.జనక్‌ ప్రసాద్ ఆదివారం‌ ప్రకటించారు.

సిబిఐని అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం టిడిపి పావుగా వాడుకొని, శ్రీ జగన్‌పై పలుమార్లు చార్జిషీట్లు వేయిస్తున్నాయని మేకపాటి, బాజిరెడ్డి, సోమయాజులు, జనక్‌ ప్రసాద్‌ నిప్పులు చెరిగారు. తమ రాజకీయ స్వార్థం కోసం జననేత శ్రీ జగన్‌ను జనం నుంచి దూరంగా ఉంచేందుకు ఆ రెండు పార్టీలు చేస్తున్న కుట్రలకు నిరసనగా పార్టీ శ్రేణులు నూతన సంవత్సరం వేడుకలను బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీ జగన్‌ విడుదల కోరుతూ ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణను మరింత ఉధృతం చేయాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలను వారు కోరారు. స్వతంత్ర దర్యాప్తు సంస్ధ సిబిఐ కూడా తన విధులను పక్కన పెట్టేసి తనను శాసిస్తున్న రాజకీయ పార్టీల మెప్పు కోసం అవి చెప్పినట్టల్లా ఆడుతోందని దుయ్యబట్టారు.

వివాదాస్పదం అయిన 26 ప్రభుత్వ జిఓల విషయంలో శ్రీ జగన్‌ 52వ ప్రతివాది అయినప్పటికీ తమ రాజకీయ బాస్‌ల మెప్పు పొందేందుకే ప్రథమ నిందితునిగా చూపించేందుకు సిబిఐ తాపత్రయ పడుతోందని వారు ఆరోపించారు. నిజానికి ఆ జిఓలపై సంతకాలు చేసిన అసలు దోషులను అరెస్టు చేయకుండా సిబిఐ కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని వైయస్‌ఆర్‌సిపి నాయకులు విమర్శించారు. ఆ జిఓలు చట్టబద్ధమైనవే అని సుప్రీంకోర్టుకు విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వాస్తవ విరుద్ధంగా ఉందని వారంతా నిప్పులు చెరిగారు.

సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సిబిఐ కోర్టులో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ వి‌చారణకు వచ్చినప్పుడల్లా సిబిఐ సమర్పించిన దర్యాప్తు వివరాల్లో ఎలాంటి కొత్తదనం లేదని మేకపాటి, సోమయాజులు, గోవర్ధన్, జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. సిబిఐ చెప్పిన వివరాలన్నీ అంతకు ముందే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు ప్రకటించిన,‌ కడప లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలే అని వారు వివరించారు. అసలు సిబిఐ పనిచేస్తున్న తీరే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ చేస్తున్నదంతా మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయంగా పన్నిన కుట్ర తప్ప మరేమీ కాదని వారు ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పట్ల జరుగుతున్న వివక్షపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయానికి ప్రతీకగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఆదివారం వరకూ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ‌'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో జగన్‌కు మద్దతుగా తమ సంతకాలు చేశారని వారు వివరించారు. కోటి సంతకాలు పూర్తయిన తరువాత ఒక లేఖతో పాటు మెమోరాండంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సమర్పించనున్నట్లు తెలిపారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ఏడు నెలలైనప్పటికీ బెయిలు కూడా ఇవ్వకుండా నిర్బంధించినందుకు నిరసనగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు నూతన సంవత్సరం వేడుకలను దూరంగా ఉండి బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యుడు కె. శివకుమార్ కూడా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top