మా లేఖ సారాంశాన్ని వక్రీకరిస్తున్నారు

హైదరాబాద్, 4 సెప్టెంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి కేంద్రాన్ని నిర్ద్వంద్వంగా డిమాండ్‌ చేస్తున్నామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకు ముఖం చెల్లని పరిస్థితి ఉందన్నారు. కొన్ని పత్రికలు కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విషప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రానికి పార్టీ ఇచ్చిన లేఖలోని సారాంశాన్ని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు తాము వివరణ ఇస్తున్నా తమ ధోరణిని ఆ పార్టీలు, పత్రికలు కొనసాగిస్తున్నాయని నిప్పులు చెరిగారు. నిద్రపోయే వారిని లేపి చెప్పవచ్చు.. మేలుకుని ఉన్నవారితో మాట్లాడవచ్చు.. కానీ నిద్ర నటిస్తున్న వారితో మాట్లాడడం కొద్ది కష్టమైన విషయమే అన్నారు. సమస్యకు పరిష్కారం న్యాయమూ, ఆమోదయోగ్యంగా ఉండేలా చేయాలన్నామని, అలా చేయలేనప్పుడు యధాతథ స్థితిని కొనసాగించమన్నాం అన్నారు. షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము అందజేసిన లేఖలోని సారాంశాన్ని ఆయన చదివి వినిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు.

జూలై 30వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్ర హోం శాఖ కేబినెట్‌ నోట్‌ తయారుచేస్తామని షిండే పత్రికా ముఖంగా ప్రకటించడం ఒంటెత్తు పోకడకు నిదర్శనం అని మైసూరారెడ్డి విమర్శించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్ షిండే తీరు చూస్తే ఒంటెత్తు పోకడలోనే పోతున్నారు గాని న్యాయం గురించి ఆలోచించే పరిస్థితి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రతిపాదనలతో ముందుకు రావడం లేదన్నారు. ఆయన ధోరణిలో ఆయన చేస్తున్నారు కాబట్టి మేం మరోసారి ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందన్నారు.‌ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలనేది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమతం అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్ర విభజన కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ బ్లాంక్‌ చెక్కు లాంటి లేఖ ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రాజకీయం వల్లే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు.

'ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా సర్వాధికారాలూ కేంద్రానికి ఉన్నాయి. అయినా.. మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలూ, అన్ని సమస్యలూ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యను ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నాం' అంటూ కేంద్రానికి రాసిన లేఖలోని ప్రధానాంశాన్ని చదివి వినిపించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించలేని పక్షంలో రాష్ట్రంలో యధాతథ స్థితిని కొనసాగించాలని చెప్పామన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామాలు ఇచ్చిన వైనాన్ని మైసూరా గుర్తుచేశారు. తరువాత పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేశారన్నారు. అయినా, షిండే కమిటీకి ఈ విషయాలు సోకుతున్నట్లు లేదన్నారు. దాని కంటికి కనిపిస్తున్నట్లు లేదన్నారు. ఒంటెత్తు పోకడలు పోతున్నారు కనుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ మరోమారు డిమాండ్‌ చేస్తోందన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే మిగతా పార్టీలు ముందుగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిలు స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామాలు చేసి, వాటి విధానం ఏమిటో స్పష్టంగా ప్రకటిస్తే బాగుంటుందని మైసూరారెడ్డి సూచించారు. పత్రికలు, ప్రజలను అయోమయంలో పడేస్తూ.. ఊరికే విమర్శించడం తగదని హితవు పలికారు. అది ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేక తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అంతేకాని సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న దాఖలాలు విమర్శించే పార్టీల్లో లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రం విడిపోతే నదీజలాల సమస్య పరిష్కారం చాలా జటిలంగా మారిపోతుందని మైసూరారెడ్డి ప్రస్తావించారు. మిగులు జలాల మీద ఆధారపడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బిసి ప్రాజెక్టులు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భీమా ప్రాజెక్టు సమస్య కూడా డెల్టాతో ముడిపడి ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు కూడా మిగులు జలాలపైనే ఆధారపడి నిర్మించినవని గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ కూడా ఇలాంటి ప్రాజెక్టే అన్నారు. వీటన్నింటినీ పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా పోతోందని విమర్శించారు. ఇతర పార్టీలను విమర్శించే వారు ముందుగా తమ పార్టీల నాయకత్వాలతో మాట్లాడుకుని విధానాలు మార్పించుకుంటే మేలన్నారు. ఇతరుల వైపు ఒక వేసు చూపిస్తున్నప్పుడు మీ వైపే నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని మైసూరారెడ్డి సూచించారు. మీ కంటిలో ఉన్న దూలాన్ని విడిచిపెట్టి ఎదుటివారి కంటిలోని నలుసు కోసం వెతకవద్దని హితవు పలికారు. చంద్రబాబు తాను రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top