రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం

హైదరాబాద్, 28 జూలై 2013:

ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలు ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కించపరుస్తున్నారని, మన రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ, గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాళ్ళు ఏం చేస్తున్నారో.. మన రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారో అర్థం కావడం లేదన్నారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ వివరాలు తెలిపేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ పరిణామాలపై మీ స్పందన ఏమిటన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.

మన రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దలు ఎన్ని ముక్కలు చేస్తారో, ఎంత చిన్నాభిన్నం చేస్తారో అనే విషయంపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని మేకపాటి చెప్పారు. తీరా వాళ్ళు ఏం చేస్తారనేది కూడా అర్థం కావడంలేదన్నారు. రకరకాల వార్తలు లీక్‌ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎంతగా కించపరుస్తున్నారో మొదటి నుంచీ తాము చెబుతూనే ఉన్నామన్నారు. చూద్దాం.. ఇంకా ఏం చేస్తారో, ఎలా చేస్తారో అని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సరైన నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పి ఉండాల్సిందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. మీడియా ద్వారానే తనకు ఆ విషయం వింటున్నానన్నారు. బహుశా.. నిజమా? రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఆ వార్తను పత్రికలో చూశామే కాని అధికారిక ప్రకటన ఏదీ లేదు కదా అన్నారు. రాష్ట్ర విభజన అంశం అన్ని ప్రాంతాల్లోనూ తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికీ అన్యాయం జరగదని, అందరికీ న్యాయమే జరుగుతుందన్నారు. అలాంటి అపోహలన్నీ తొలగిపోతాయని మేకపాటి మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Back to Top