మంత్రి 'ఆనం'నే ఉరితీయాలి

హైదరాబాద్, 13 ఏప్రిల్‌ 2013: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. అందుకే శ్రీ జగన్‌ను ఉరితీయాలంటూ ఆనం రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టింది. ఆనం మదాన్ని పిసిసి చీఫ్‌ బొత్స, మంత్రి పార్థసారథి ప్రోత్సహిస్తున్నారని అగ్గి మీద గుగ్గిలం అయింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు శనివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌, టిడిపిలు, ఆనం, బొత్స, పార్థసారథిలపై అగ్ని తూటాలు పేల్చారు. శ్రీ జగన్‌ను భౌతికంగా ఏమిచేస్తారో అనే భయం తమకు పట్టుకుందన్నారు. కాంగ్రెస్‌ కుట్రలో టిడిపికి ప్రమేయం ఉందని ఆయన అన్నారు. ఉరి తీయాల్సి వస్తే ముందుగా ఆనంనే ఉరి తీయాలని అన్నారు.

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బయటికి వస్తే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్, టిడిపిలు కొత్త కుట్రకు తెరతీశాయని గట్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు పలు  అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. 'వివాదాస్పద 26 జిఓలు సక్రమమైనవే అని మంత్రులు చెప్పారు. ప్రభుత్వం కూడా అదే స్పష్టంచేసింది. ఇప్పుడు అవే జిఓల విషయంలో ఆనం చేసిన వ్యాఖ్యలు పూర్తి రాజ్యాంగ విరుద్ధం' అని గట్టు అన్నారు. సాక్షులను ప్రభావితం చేయడానికే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. కేబినెట్‌ నిర్ణయాలను ధిక్కరించిన మంత్రి ఆనంను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని గట్టు డిమాండ్‌ చేశారు. లేదా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలని సలహా ఇచ్చారు.

మంత్రి ఆనం మాటలతో మహానేత వైయస్‌ కుటుంబాన్ని హతమార్చాలన్న కుట్ర బయటపడుతోందని గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. శ్రీ జగన్‌ను ఆనాడు పోలీస్‌ జీప్‌లో కోర్టుకు తీసుకురావడం, యావజ్జీవ శిక్ష వేయాలంటూ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడడం, ఇప్పుడు ఉరితీయాలంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడంలో పెద్ద కుట్రే ఉందని గట్టు తీవ్రంగా స్పందించారు.

జనాదరణను చూసి ఓర్వలేకే.. :
శ్రీ జగన్‌కు రాష్ట్రంలో ప్రజాదరణ పెరగడాన్ని చూసి సహించలేక కాంగ్రెస్‌, టిడిపిలు మహానేత వైయస్‌ కుటుంబంపై నీచమైన కుట్రలు పన్నుతున్నాయని గట్టు ఆరోపించారు. జనం నుంచి ఆ కుటుంబాన్ని దూరం చేయాలనే దుర్బుద్ధి మంత్రి ఆనం వ్యాఖ్యల ద్వారా బయటపెట్టారన్నారు. శ్రీ జగన్‌ను జైలులోనే ఉంచి తమ పబ్బం గడుపుకోవాలన్నది కాంగ్రెస్, టిడిపిల కుట్ర అన్నారు. ఆ రెండు పార్టీలూ ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్‌ వెంటే జనం ఉంటారని గట్టు ధీమాగా చెప్పారు. ఆ వివాదాస్పద జిఓలపై మంత్రుల చేత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బలవంతంగా సంతకాలు చేయించారని చెప్పడానికి మంత్రి ఆనంకు మూడు సంవత్సరాల ఏడు నెలల పది రోజులు పట్టిందని గట్టు ఎద్దేవా చేశారు.

మంత్రులను భయపెట్టేందుకు ఆనం కుట్ర :
సాక్షులను ప్రభావితం చేస్తారని శ్రీ జగన్‌ను సిబిఐ జైలులో పెట్టిందని, వివాదాస్పద జిఓలపై సంతకాలు చేసిన ఆ ఆరుగురు మంత్రులను ప్రభావితం చేయడానికే, భయపెట్టి శ్రీ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడించడానికే ఆనం ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గట్టు ఆరోపించారు. అసలు ఆ జిఓలకు శ్రీ జగన్‌కు సంబంధం ఏమిటని ఆయన నిలదీశారు. జిఓలు తప్పు అయితే కేబినెట్‌ను ఉరితీయాలని ఆనం డిమాండ్‌ చేస్తారా? అని గట్టు ప్రశ్నించారు. ఆనం సోదరులు పగటి వేషగాళ్ళు, శాడిస్టులు అని ఆయన విమర్శలు సంధించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ సతీమణి శ్రీమతి విజయమ్మను బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో అవమానిస్తూ మాట్లాడతారన్నారు.‌ సిఎం కిరణ్‌ను బెదరించేందుకే బొత్స చానల్ ను కొన్నారా? లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు చానళ్ళు కొనలేదా? అని నిలదీశారు.

బాబుకూ రాజభోగాలు రుచిచూపించండి:
జైలులో శ్రీ జగన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను గట్టు తీవ్రంగా తిప్పికొట్టారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును కూడా జైలుకు పంపితే అంతకన్నా ఎక్కువ భోగాలు అనుభవిస్తారు కదా ఎద్దేవా చేశారు. జైలులో రాజభోగాలు ఉంటే చంద్రబాబునాయుడు జైలుకు పోకుండా కాంగ్రెస్‌ పెద్దల కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎందుకు కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎఫ్‌డిఐలపై ఓటింగ్‌ సందర్భంగా, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలోనూ కాంగ్రెస్‌కు ఎందుకు అనుకూలంగా వ్యవహరించారని నిలదీశారు. శ్రీ జగన్‌ పిటిషన్‌ వేసిన ప్రతిసారీ, లేదా ఆయనకు బెయిల్‌ వస్తుందనుకున్న ప్రతిసారీ కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయి ఇలాంటి ఏదో ఒక రాద్దాంతం చేస్తూనే ఉన్నాయని గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు.

నారాయణా నేరం ఒప్పుకుంటావా?:
జైలులో ఉన్న శ్రీ జగన్‌ను నేరస్తుడంటూ మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యలను గట్టు తీవ్రంగా ఖండించారు. జైలుకు వెళ్ళినందుకే శ్రీ జగన్‌ దోషి అయితే 2003 కరెంటు ఉద్యమం సందర్భంగా హైదర్‌గూడలో ఒక బస్సును దగ్ధం చేశారంటూ చంద్రబాబు నాయుడు నారాయణపై కేసు పెట్టి జైలులో పెట్టించారు. అంటే అప్పుడు తాను కూడా నేరం చేశానని నారాయణ ఒప్పుకుంటారా? అని గట్టు సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ నాయకుల మాటలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఒక్కటై పోటీ చేయడం కోసం కొత్త పొత్తులకేమైనా తెరలేచిందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు.
Back to Top