'మహిళలకు రక్షణ కల్పించండి'

హైదరాబాద్, 23 ఏప్రిల్‌ 2013: మహిళలపై లైంగిక వేధింపుల్లో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అత్తింటి వేధింపుల్లో రెండవ స్థానంలో ఉందని, మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, హత్యలు ఏటికేడు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. వరకట్న వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, మోసాలలో దేశంలోనే మన రాష్ట్రం తొలి ఐదు స్థానాల్లో ఉందని గణాంకాలు చెబుతున్నాయని విచారం వ్యక్తంచేసింది. మహిళలపై రోజు రోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, దురాగతాల నుంచి రక్షణ కల్పించాలని పార్టీ మహిళా విభాగం మంగళవారంనాడు రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డికి ఒక లేఖ రాసింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 70 శాతం మంది మహిళలే అని, ఇప్పటికైనా మహిళలపై అఘాయిత్యాలు ఆగిపోయేలా చర్యలు చేపట్టాలని విజ్క్షప్తి చేసింది.

మహిళలకు ఎక్కడా భద్రత లేని దుస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం కన్వీనర్‌ కొల్లి నిర్మలా కుమారి డిజిపికి రాసిన లేఖలో విచారం వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని, మహిళలకు భరోసా కల్పించాలని ఆ లేఖలో డిజిపికి విజ్ఞప్తి చేశారు. మహిళలకే కాకుండా ఐదారేళ్ళ పసిపాపలకు కూడా భద్రత కరవై అకృత్యాలు నిత్యకృత్యమైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్త్రీని ఆటబొమ్మగా చూస్తున్నారని, ఇళ్ళల్లో గృహ హింస, బయట లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయని ఆ లేఖలో పార్టీ మహిళా విభాగం విచారం వ్యక్తంచేసింది. మొన్నటి నిర్భయ నుంచి నిన్నటి ఐదేళ్ళ గుడియా లాంటి చిన్నారి వరకూ దేశంలో ఎన్నెన్నో దారుణాలు యధేచ్ఛగా జరిగిపోతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. లోపం ఎక్కడ ఉందని, మహిళలపై నేరాలు జరిగినప్పుడు పోలీస్‌ యంత్రాంగం ఎందుకు అలక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం నిలదీసింది.

దేశ రాజధానీ నగరం ఢిల్లీ 'రేప్‌ కేపిటల్'‌గా మారిపోయిందని, రాష్ట్రంలోనూ సామూహిక అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు ఆగడం లేదని పార్టీ మహిళా విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోకూడదని విజ్ఞప్తి చేసింది. కనీసం ఇప్పటికైనా స్పందించి మహిళల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఇలాంటి దారుణాలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరింది. వరుస దాడులతో తల్లడిల్లిపోతున్న మహిళాలోకానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, పోలీసు యంత్రాంగంపైనా ఉందని డిజిపికి రాసిన లేఖలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం పేర్కొంది.

డిజిపికి రాసిన లేఖలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం డిమాండ్లు ఇవీ..:
- ప్రతి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు‌ చేయాలని, పోలీస్ రిక్రూ‌ట్‌మెంట్‌లో 25 శాతం మహిళలను నియమించాలి.
- మహిళలపై దాడులను ఆరికట్టడానికి రాష్ట్ర మహిళా కమిషన్‌ను పునరుద్ధరించాలి.
- అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
- ప్రసార మాధ్యమాల్లో అశ్లీలతను అరికట్టాలి.
-‌ మహిళల కోసం ప్రత్యేకంగా ఫాస్టు ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిజిపికి రాసిన లేఖలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం రాసిన లేఖలో డిమాండ్‌ చేసింది.
Back to Top