లక్ష్మణ్‌ బాపూజీ మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 21 సెప్టెంబర్‌ 2012: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మతీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాపూజీ కుటుంబ సభ్యులకు శుక్రవారంనాడు ఆమె తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

1952లో నాన్‌ ముల్కి ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో బాపూజీ క్రియాశీలక పాత్ర పోషించారని విజయమ్మ అన్నారు. తెలంగాణ ప్రజల ఆర్థిక, రాజకీయ ప్రగతి కోసం బాపూజీ అహర్నిశలు తపించారని పేర్కొన్నారు. తుదిశ్వాస విడిచేవరకూ తెలంగాణ ప్రజల బాగు కోరుకున్నారని, బాపూజీ మరణం తీరని లోటు అని ఆమె అన్నారు.


కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన బాపూజీ హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటున్నారు. బాపూజీకి బ్రెయిన్ స్ట్రో‌క్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915లో సెప్టెంబ‌ర్ 27న లక్ష్మణ్ బాపూజీ ‌జన్మించారు. స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. క్విట్‌ ఇండియా, నాన్‌ముల్కీ ఆందోళనల్లో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో మంత్రిపదవిని వదులుకున్నారు. బాపూజీ ఇటీవల నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు.
Back to Top