ఆపదలో ఉన్న గర్భిణికి రక్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డ కోన రఘుపతి గుంటూరు: హడావుడిగా జనాలకు దండాలు పెడుతూ వెళ్లిపోయే నాయకులాంటివాడు కాదు ఆ ఎమ్మెల్యే.. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఓ మహిళకు వైద్యం చేయడంలో వైద్యులు చూపిన అలసత్వాన్ని ప్రశ్నించాడు. కేవలం రక్తం లేదన్న కారణంగా వేరు ఆసుపత్రికి తరలించడమేంటని వారిని నిలదీశాడు. అవసరముంటే నా రక్తం ఇస్తా..! వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి అంటూ పెద్దమనసుతో ముందుకు వచ్చాడు. ఆయన దాతృత్వం ఓ గర్భిణి నిండుప్రాణాన్ని నిలిపింది. వివరాల్లోకి వెళితే... వెఎస్‌ఆర్‌సీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు. అక్కడ పేదలకు సౌకర్యాలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవాలన్నది ఆయన పర్యటన ఉద్దేశం.. అదే సమయంలో అక్కడ అన్నమణి గర్భిణికి అత్యవసరంగా శస్త్రచికిత్స కోసం ఆమె బంధువులు తీసుకువచ్చారు. కానీ వైద్యులు ఆమెకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ ఆసుపత్రిలో అందుబాటులో లేదని వెంటనే గుంటూరు తరలించాలని బంధువులకు ఉచిత సలహా పడేశారు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఎమ్మెల్యే కోన వెంటనే స్పందించారు. విషయమేంటో కనుక్కున్నారు. రక్తం లేకపోతే ఆపరేషన్ చేయమని ఎలా వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నా రక్తం ఇస్తా వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండని ముందుకు వచ్చాడు. ఎమ్మెల్యే దాతృత్వంతో తమ తప్పు తెలుసుకున్న వైద్యులు వేరే బ్లడ్‌బ్యాంకు నుంచి వెంటనే రక్తం తెప్పించి గర్భిణికి ఆపరేషన్ పూర్తి చేశారు. ఎమ్మెల్యే చూపిన చొరవ, దాతృత్వం ఒక గర్భిణి ప్రాణాలు కాపాడటంతో పలువురు ఆయన్ను అభినందించారు.<br/>