కిరణ్‌ నోట బాబు స్క్రిప్టు!

హైదరాబాద్, 23 మే 2013:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు సిగ్గు లేకుండా ఆయననే విమర్శించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్రంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విస్తృత సమావేశంలో ఆ పార్టీ నాయకులు, సిఎం కిరణ్ సొంత ‌బాజా బాగా మోగించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ‌విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక్కమాట కూడా అనలేదని, ప్రజల పక్షాన పనిచేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై మాత్రం పనిగట్టుకుని విమర్శలు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు - రామోజీరావు- రాధాకృష్ణ అక్రమ సంబంధంతో ఏర్పాటైన పత్రికలు తప్ప మరో పత్రిక ఉండకూడదన్నదే వారి దురుద్దేశం అన్నారు. కిరణ్‌, బొత్సకు చానళ్ళు, పత్రికలు ఏర్పాటు చేసే నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి మీడియా పుట్టిందన్నారు.

విస్తృత సమావేశంలో కిరణ్‌ ఏమి మాట్లాడారో అదే సమయంలో చంద్రబాబు
ప్రెస్‌మీట్‌లోనూ అదే మాట్లాడారన్నారు. చంద్రబాబు రాసిన స్క్రిప్టును
కిరణ్‌రెడ్డి చదివారా? లేక కిరణ్‌ రాసిన స్క్రిప్టును చంద్రబాబు చదివారా?
అని గట్టు ప్రశ్నించారు. కిరణ్‌, చంద్రబాబు ఒకే సమయంలో ఒకే అంశాలు
మాట్లాడడం వెనుక కీలకం ఏమిటన్నారు. లేదా వీరిద్దరికీ స్క్రిప్టు రామోజీరావు
రాసి పంపారా? అని ప్రశ్నించారు. కిరణ్‌రెడ్డి, చంద్రబాబు చిలకపలుకులు
పలికారన్నారు. ఆ పలుకులు పలికించింది ఎవరో తేలాలని గట్టు అన్నారు.

సాక్షి పత్రికపై వారి అక్కసంతా వెళ్ళగక్కారని గట్టు ధ్వజమెత్తారు. సాక్షిని ఒక విష పుత్రికగా అభివర్ణించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్న రెండు పత్రికలను పూర్తిగా వెనకేసుకు వచ్చి, సాక్షిని మాత్రం విషపుత్రికగా ఆరోపించడమేమిటన్నారు. చెల్లెలి పిల్లల్ని పాశవికంగా చంపించిన కంసుడి మాదిరిగా చంద్రబాబు నాయుడు ఇతర పత్రికలన్నింటినీ మూయించేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఎంతగా ధ్వంసం చేసినా నూరు శాతం ఆధిపత్యం చెలాయిస్తున్న యెల్లో మీడియా ఆయనకు సానుకూలంగా వార్తలు రాసిన వైనాన్ని గుర్తుచేశారు. యెల్లో మీడియా పూర్తిగా చంద్రబాబు భజన చేస్తోందన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి పత్రిక పుట్టిందని ఆయన అన్నారు.

సాక్షి పుట్టుకతోనే అత్యంత ప్రజాభిమానం పొందిన పత్రిక అన్నారు. పాఠకులు, సర్క్యులేషన్‌ విషయాల్లో దేశంలోనే టాప్‌ టెన్‌లో సాక్షి ఉన్నదన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన కుంభకోణాలను సాక్షి బయటపెట్టిందన్నారు. కరెంటు ఉద్యమం సమయంలో చంద్రబాబు పాపాలను జనం దృష్టికి తీసుకువెళ్ళిందన్నారు. తిన్నది అరగక, తిండి ఎక్కువై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యెల్లో పత్రికలు రాస్తే అది తప్పు అని రైతుల పక్షాన సాక్షి పత్రిక నిలబడిందన్నారు. సాక్షి విషపత్రికా లేక అమృత పత్రికా అనేది ప్రజలే తేలుస్తారని గట్టు వ్యాఖ్యానించారు.

నాలుగేళ్ళలోనే సిఎం, బొత్సలకు వార్తా చానళ్లు కొనేంత డబ్బులు ఎలా వచ్చాయని చంద్రబాబు నాయుడు ఎందుకు అడగడంలేదని గట్టు ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది అన్న మంత్రి ఆనం మానసిక ఉన్మాది అని గట్టు దుయ్యబట్టారు.‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ హయాంలో ఆనం సోదరులు పిల్లుల్లాగా తిరిగారని గుర్తు చేశారు. సిఎం మారితే పదవి కోసం కిరణ్‌ను అంతకన్నా హీనంగా తిట్టగల ఆనం రామనారాయణరెడ్డిది నాలుక కాదు తాటిమట్ట అని గట్టు నిప్పులు చెరిగారు.

ఆనం రామనారాయణరెడ్డి మానసిక ఉన్మాదిలా మాట్లాడుతున్నారని గట్టు నిప్పులు చెరిగారు.‌ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి వస్తే ఆయన ముందు నిలబడగల ధైర్యం వారికి ఉందా? అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. ప్రజలే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయుధం అన్నారు. ప్రజలే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

వీకెండ్‌ పొలిటీషియన్‌ లోకేష్‌ కూడా సాక్షి లాంటి పత్రికలను మూసేయాలని వ్యాఖ్యానించడాన్ని గట్టు తప్పుపట్టారు. ఆదివారాలు మాత్రమే రాజకీయాలు చేసే లోకేష్‌ జనంలోకి రాని వ్యక్తి అని, తెల్ల బాతు లాంటి వాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అన్నా హజారేతో పోల్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. హీనచరిత్ర ఉన్న చంద్రబాబు వళ్ళంతా విషమే అన్నారు. కిరణ్, బొత్స, చంద్రబాబు రహస్య ప్రదేశంలో చర్చించుకుని చెప్పిన మాటల్లా ఉన్నాయన్నారు. అందుకే కాంగ్రెస్‌, టిడిపి వేర్వేరు కాదని ఒక్కటే అని స్పష్టం అవుతోందని గట్టు ఆరోపించారు.

పెద్ద నోట్లు తెచ్చిందే చంద్రబాబు: గట్టు
ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల కారణంగానే అవినీతి పెరిగిపోయిందన్న చంద్రబాబు మాటలను తిప్పికొట్టారు. రాజకీయాలను డబ్బుమయం చేసిన చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడడం తగదన్నారు. ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచి రూ.500, రూ.1000 నోట్లను తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. స్టాంపుల కుంభకోణం, దొంగనోట్ల ముద్రణలో టిడిపి వారే అరెస్టయిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు టిడిపి నేతల నుంచే రికవరీ అయ్యాయని అన్నారు. అలాంటి చంద్రబాబు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, లోకేష్, ఆనం నాలుక కోయాలన్న కోపంలో ప్రజలున్నారని గట్టు రామచంద్రరావు చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top