కనీస మానవత్వం లేని కిరణ్ ప్రభుత్వం

హైదరాబాద్, 7 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న విపరీతమైన ఇబ్బందులను ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి పరిష్కరించలేక పోగా అహంకారంతో వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో‌ ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. కరెంట్ చార్జీలు తగ్గించాలని ప్రతిపక్షం ఆందోళన చేస్తూంటే ‌కిరణ్‌కుమార్‌రెడ్డి ఎగతాళిగా మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల దీక్షలు, ఆందోళనలు సిఎంకు నవ్వులాటగా కనిపిస్తున్నాయా? అని నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షలు విరమించినా విద్యు‌త్‌పై తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.కనీస మానవత్వం లేకుండా కిరణ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆదివారం ఉదయం 8.30 గంటలకు కరెంట్‌ సత్యాగ్రహం దీక్ష విరమించారని కొణతాల రామకృష్ణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోందని అన్నారు. దొడ్డిదారిన వచ్చిన నాయకులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. సిఎం కిరణ్కు కుర్చీ కాపాడుకోవడానికే సమయం సరిపో‌తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యు‌త్ సంక్షోభం వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించిందని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు, నాయకులకు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారన్నారు. దొడ్డిదారిన ఎవరో నియమిస్తే అధికారం అనుభవిస్తున్న వారికి ప్రజల పట్ల సానుభూతి ఎందుకు ఉంటుందన్నారు. ఏ ప్రభుత్వమూ నూరుశాతం సమస్యలను పరిష్కరిస్తుందని తాము అనుకోవడంలేదన్నారు. కానీ కనీస మానవత్వంతో, సానుభూతితో, చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విపక్షాలు చేపట్టిన విద్యు‌త్ ఆందోళనలపై ఈ ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తోందని ‌కొణతాల ఆరోపించారు. ప్రభుత్వానికి ఏమాత్రం ముందు చూ‌పూ లేదని రామకృష్ణ విమర్శించారు. ఎలాంటి అవసరాలు వస్తాయనే దానిపై దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. భవిస్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలన్న ధోరణే కిరణ్‌ ప్రభుత్వంలో కొరవడిందని ఆరోపించారు. పదవీ కాలాన్ని ఏ రకంగా పూర్తిచేసుకోవవాలి... ఏ విధంగా కుర్చీని కాపాడుకోవాలని, ఢిల్లీ ప్రయాణాలకే కిరణ్‌ సమయం సరిపోతోందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. కరెంటు కష్టాల్లో ఉన్న ప్రజలకు త్వరలోనే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం నుంచి గాని, అధికారుల నుంచి గాని ఒక్క సానుభూతి మాట కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

విద్యుత్‌ చార్జీలు పెంచినందుకు ప్రజలెవ్వరూ ఇబ్బంది పడడంలేదని, ఒక్క ఎకరా ఎండిపోలేదు, ఏ పరిశ్రమా మూతపడడంలేదు, ఎవరి ఉద్యోగాలూ పోవడంలేదు, రాజీవ్‌ యువకిరణాల ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, ఏ ఒక్కరూ ఆందోళన చెందడంలేదని అసెంబ్లీ సమావేశాల్లో గానీ, ఇతరత్రా సందర్భాల్లో గాని కిరణ్‌కుమార్‌ రెడ్డి చెబుతున్న మాటలను కొణతాల తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన ప్రకటనల ద్వారా ప్రభుత్వం అహంకార ధోరణి కనిపిస్తున్నది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ. 5,400 కోట్ల భారం ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం ఉందని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని, దాని నిష్పత్తిలో సౌకర్యాలు పెరగలేదన్నారు.

అసలు విద్యుత్‌ వినియోగం జరిగితేనే కదా బిల్లులు కట్టేదని కొణతాల నిలదీశారు. పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో విద్యుత్‌ వాడకం తగ్గిందన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చెప్పిన తీరు సిఎం కిరణ్‌లో ఏ కోశానా కనిపించడంలేదన్నారు. అహంకారంతోనే కిరణ్‌ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. విద్యుత్‌ చార్జీలు, సర్‌చార్జీల పేరుతో సంవత్సరానికి పదేసి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన కిరణ్‌ వేస్తున్నారని కొణతాల దుయ్యబట్టారు. పెంచిన బిల్లులను రైతులు, చేనేత కార్మికులు, పేదలు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. చేనేత కార్మికులకు 15 వేలు, 20 వేలు బిల్లులు వేస్తే ఏ విధంగ కట్టగలరని ప్రశ్నించారు. విద్యుత్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే రీతిలో ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.

మహానేత వైయస్‌ కాలానికి ఇప్పటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు కూడా అంతకన్నా మెరుగ్గా లేవన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు లేవన్నారు. గ్యాస్‌ ఉత్పత్తి కూడా తగ్గిందన్నారు. గ్యాస్‌ ఉత్పత్తి తగ్గించిన సంస్థలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. వీటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల పనితీరు ఆరిపోయే ముందు దీపం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుందన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిసారీ రోడ్డు మీదకు రారని, సమయం వచ్చినప్పుడు ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారని కొణతాల రామకృష్ణ హెచ్చరించారు. ఏ‌ ప్రయోజనం కల్గించినా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపైనే అభిమానంతో ఉన్నారని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేస్తారని, ఇంకెందుకు చేయాలన్న అహంకార ధోరణి ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందని ఆయన విమర్శించారు. మానవతా దృక్పథం ఈ ప్రభుత్వానికి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

కరెంట్‌ సత్యాగ్రహాన్ని విరమించినా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తుందన్నారు. ఈ క్రమంలో 9వ తేదీన రాష్ట్ర బంద్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా బ్యాలట్‌ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక తదుపరి ఏమి చేయాలన్న దానిపై మరోసారి ఆలోచింని నిర్ణయం తీసుకుంటామన్నారు. కరెంట్‌ సత్యాగ్రహానికి మద్దతు తెలిపిన వామపక్షాలు, దీక్షా శిబిరం వద్దకు వచ్చి శ్రీమతి విజయమ్మకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కొణతాల ధన్యవాదాలు చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వం తీరు చూస్తే 'చంద్రబాబు నాయుడు పాలన 2వ భాగం' లా ఉందని కొణతాల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, కరెంట్‌ లేకపోయినా రాజశేఖరరెడ్డి కారణం అని చెబుతుండడాన్ని ఆయన ఖండించారు. టిడిపి హయాంలో 1993లో 23 స్వల్ప కాలిక ‌జెస్టేషన్ ప్రాజెక్టులకు సంతకాలు పెట్టి అనుమతులిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుల విస్తృతికి టిడిపి ఎంపీలు ఎంతమందికి ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. ఇన్ని తప్పులూ చంద్రబాబు నాయుడు చేసి‌ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైయస్ మీద నెపాలు నెడుతున్నారన్నారు. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని, మంచి ప్రజా ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఎన్టీఆర్ ఫోటోతో సంబంధం లేదు:
ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ ఫోటోతో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి సంబంధం లేదని ఒక ప్రశ్నకు కొణతాల రామకృష్ణ బదులిచ్చారు. ‌యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న పురంధేశ్వరి ఎన్టీఆర్ ఫోటోతో ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హీరో బాలకృష్ణకు కొణతాల ఈ సందర్భంగా సూచించారు.
Back to Top