కేంద్రానికి 'పాలసీ పెరా‌లసిస్'

‌హైదరాబాద్, 26 ఫిబ్రవరి 2013: కేంద్ర ప్రభుత్వానికి 'పాలసీ పెరాలసిస్'‌, 'పెర్ఫార్మెన్సు పెరాలసిస్' వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. పవన్‌ కుమార్‌ బన్సల్‌ పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ నిరుపేదలకు, మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని వ్యాఖ్యానించింది. ఈసారి జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున, 33 మంది ఎంపీలను ఇచ్చిన మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించినవారికి కేంద్రం నిరాశే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అత్యధిక కాంగ్రెస్‌ ఎంపీలను ఇచ్చిన మన రాష్ట్రానికి ఈసారి కూడా అన్యాయమే జరిగిందని పేర్కొంది. రైల్వే సహాయ మంత్రి పదవి మన రాష్ట్ర వ్యక్తి చేతిలో ఉన్నా లాభం లేకపోయిందని, రైల్వే మంత్రి బడ్జెట్ ప్రకటనలో వాస్తవాలు లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు, కార్మిక విభాగం అధ్యక్షుడు బి. జనక్‌ప్రసాద్‌ మంగళవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైల్వే బడ్జెట్‌పై విమర్శలు సంధించారు. బన్సల్ రైల్వే బడ్జెట్‌లో సామా‌న్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, ఇక కొత్త ప్రతిపాదనలు ఎప్పుడు పూర్తిచేస్తారని వారు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

పన్నెండవ పంచవర్ష ప్రణాళికా కాలం రూ. 95 వేల కోట్లు నష్టాల్లో ఉందని ప్రభుత్వం చెబుతోందని ఇక ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తవుతాయని సోమయాజులు నిలదీశారు. ప్రణాళికలకే నిధులు తక్కువ ఉంటే కొత్త ప్రాజెక్టులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రైల్వే బడ్జెట్లలో ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల్లో కనీసం 10 శాతం కూడా పూర్తిచేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1951 నుంచి బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండేదన్నారు. చార్జీలు పెంచినా, సౌకర్యాలు ప్రకటించినా రైల్వే బడ్జెట్‌లోనే జరిగేదన్నారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం‌ రైల్వే బడ్జెట్‌కు ముందే చార్జీలు పెంచి అపహాస్యం చేసిందన్నారు. ఇంతకు ముందటి రైల్వే బడ్జెట్‌లలో మన రాష్ట్రానికి సంబంధించి 1991లో కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఆ హామీ ఏమయిపోయిందన్నారు. మన రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లలో చేస్తున్న కేటాయిస్తున్న ప్రాజెక్టులే తక్కువ అని వాటిలో 10 శాతం కూడా అమలు చేయడంలేదన్నారు.

కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు ఒకటి, అతి తక్కువ దూరం ఉన్న తిరుపతి నుంచి పాండిచ్చేరికి మరొకటి, తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు వయా విశాఖపట్నం కొత్త రైళ్ళను మాత్రమే రాష్ట్రానికి కేటాయించడాన్ని సోమయాజలు తప్పుపట్టారు. అసలు రైల్వే బడ్జెట్‌లో చేసే ప్రకటనలే అబద్ధాలని ఎద్దేవా చేశారు. రైల్వే రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయడం వల్ల చార్జీలు పెరుగుతాయి తప్ప ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ వల్ల జరుగుతున్నది ఇదే అని సోమయాజులు ప్రస్తావించారు.

'డైనమిక్‌ ఫ్యుయల్‌ అడ్జెస్టుమెంట్‌ కాంపొనెంట్‌' పేరిట 5 శాతం చార్జీలు పెంచాలని రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించడాన్ని జనక్‌ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఐదు శాతం పెంచడం అంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రయాణికులపై భారం పడనున్నదని జనక్‌ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రగతి దృష్ట్యా ఇలాంటి నిర్ణయం మంచిది కాదని ఆయన అన్నారు. రైలును గతంలో 'పొగ బండి' అనే వారని, ఇప్పుడది 'పగ బండి'లా మారిపోయిందని అభివర్ణించారు. చేపట్టిన ప్రాజెక్టులకు టైం బౌండ్‌ లేకపోయిందన్నారు. నెల రోజుల క్రితమే 21 శాతం రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై రూ. 6,600 కోట్ల ఆర్థిక భారం వేసిందన్నారు. రైళ్ళలో జరిగే దొంగతనాలను నివారించే పరిస్థితి లేదన్నారు. రైలులో ప్రయాణిస్తున్న వారు అనారోగ్యానికి గురైనా, చివరికి గర్భిణికి ఆరోగ్య సమస్య ఎదురైనా చికిత్స చేసే దిక్కులేని స్థితి నెలకొన్నదని జనక్‌ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన కేటరింగ్‌ సదుపాయం లేదని, రైల్వే స్టేషన్లలో మంచినీరు దొరకని స్థితి ఉందని, కొనుక్కొని తాగాల్సి వస్తోందన్నారు. రైళ్ళలో పరిశుభ్రత ఉండదన్నారు. గుత్తాధిపత్యం చెలాయిస్తున్న రైల్వే శాఖ రైళ్ళను లాభాపేక్షతో నడిపితే ఇక ప్రజలేం కావాలని ఆయన నిలదీశారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టరని, పాత లైన్ల పైనే రైళ్ళను నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

బడ్జెట్‌కు నెల రోజుల ముందే రైల్వే చార్జీలు పెంచేసిన కేంద్రప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన విలువేమిటని, ఎంపిలకు గౌరవం ఏదని నిప్పులు చెరిగారు. ఈ రైల్వే బడ్జెట్‌ ప్రజలకు ఆశాజనకంగా లేకపోగా అశనిపాతంలా ఉందని దుయ్యబట్టారు. రిజర్వేషన్‌ లేని బోగీలు ఒక్కో రైలుకు కేవలం రెండు మాత్రమే వేయడాన్ని తప్పుపట్టారు. గతంలో ప్రకటించిన రైళ్ళు ఇప్పటికింకా పట్టాలు ఎక్కకపోతే పార్లమెంటును కాంగ్రెస్‌ పార్టీ అవమానించడం కాదా అని జనక్‌ప్రసాద్‌ నిలదీశారు.
Back to Top