'కాంగ్రెస్‌- టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట'

హైదరాబాద్, 29 నవంబర్‌ 2012: ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఎండిసికి ఇచ్చిన ఓబుళాపురం మైనింగ్ లీజును కాదని, టిడిపి నాయకుల ప్రాపకం కోసం వారి అస్మదీయులకు మైనింగ్‌ లీజు కట్టబెట్టడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ఎపి మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని మేలురకం ఇనుపఖనిజం ఉన్న 45 ఎకరాల గనులను దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 2004లో కేటాయించారన్నారు. అయితే అందులోని 18 హెక్టార్లను టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్‌కు అత్యంత సన్నిహితుడు సురేంద్రబాబు సంస్థ ఎస్ఆర్ మినరల్స్‌కు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు  చేయడాన్ని పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్‌ - టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఆరోపించింది. ఎస్ఆర్ మినరల్స్‌కు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసును తక్షణమే ఉపసంహరించుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జి. గుర్నాథరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ - టిడిపి కుమ్మక్కు రాజకీయాలను తూర్పారపట్టారు. ఓబుళాపురం ఇనుప గనులను వివాదంగా మార్చి వెనుకబడిన రాయలసీమలో అతి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ - టిడిపిలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు అక్కడి విలువైన ఇనుపఖనిజం నిల్వలను ఆ ప్రైవేటు సంస్థకు అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నాయని శోభా నాగిరెడ్డి విమర్శించారు.

నిజానికి అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని మైనింగ్‌ లీజును ఓఎంసీ సంస్థకు బదలాయించింది చంద్రబాబు ప్రభుత్వమే అనే శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. కానీ తర్వాత వైయస్‌ఆర్‌ జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మించి, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ముందుకు వచ్చిన ఒఎంసికి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చట్టబద్ధంగా తక్కువ నాణ్యత గల ఇనుప ఖనిజం ఉన్న45 ఎకరాలను లీజుకు కేటాయించారని వివరించారు. అయితే, దానిని రద్దు చేసే వరకూ చంద్రబాబు నానా యాగీ చేశారన్నారు. దీనితో బ్రహ్మణి సంస్థ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయిందన్నారు. వైయస్‌ తనయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, సిబిఐ విచారణల పేరుతో పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ సంస్థకు ఫారెస్టు క్లియరెన్సు ఇవ్వాల్సింది ప్రభుత్వమే అయితే, ఆ పని చేయకుండా మైనింగ్‌ ప్రారంభించలేదని అనుమతిని రద్దు చేయడం ఎంతవరకూ సబబు అని నిలదీశారు. రాష్ట్రంలోకి పెట్టుబడిదారులను రానివ్వకుండా చంద్రబాబు చేశారని ఆరోపించారు.

ఎకరా రూ. 3 కోట్ల విలువైన మొత్తం 850 ఎకరాల భూములను అతి చౌకగా ప్రైవేటు సంస్థకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కట్టబెట్టిన చంద్రబాబుపై విచారణ చేయించని ప్రభుత్వం శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఆగమేఘాల మీద దర్యాప్తు చేయించడాన్ని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా తమకేమీ కాదంటూ ఇటీవల సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారని, ఆ ధీమా ఆయనకు చంద్రబాబు ఇచ్చిందే అని తెలిపారు. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అర్హత లేదని పైకి చెప్పే చంద్రబాబు లోలోపల దానికి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పైపెచ్చు అవిశ్వాసం పెట్టేది లేదని కచ్చితంగా చెబుతున్నారన్నారు. ప్రజల కోసమైతే అవిశ్వాసం పెడతామని చెప్పే బాబు దృష్టిలో వారికి ఎలాంటి బాధలూ లేవనా అని శోభా నిలదీశారు. ప్రజలకు కష్టాలు లేకపోతే ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని జైలులో బంధించి కాంగ్రెస్‌ - టిడిపిలు రాక్షసానందం పొందుతున్నాయని శోభా నాగిరెడ్డి విమర్శించారు. జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా అడ్డుపడుతున్నాయన్నారు.

ఈ ప్రభుత్వం త్వరలోనే దివాళా తీయనున్నదని వైయస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. బ్రహ్మణి స్టీల్‌ను రానివ్వకుండా చేసిన ప్రభుత్వం ఎస్‌ఆర్‌ మినరల్సుకు దాన్ని కట్టబెట్టడం సరికాదని మరో ఎమ్మెల్యే జి. గుర్నాథరెడ్డి నిప్పులు చెరిగారు. టిడిపికి నాయకులకు చెందిన ఎస్‌ఆర్ మినరల్సు ద్వారా అత్యంత విలువైన ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్సుకు సరఫరా చేయడానికే ఈ డ్రామా ఆడుతున్నదన్నారు. 'నిజానికి ఏపీఎండీసీ ద్వారానే ఖనిజాన్ని నేరుగా విశాఖ ప్లాంటుకు సరఫరా చేయించవచ్చు. లేదంటే విశాఖ ప్లాంటుకే మైనింగ్ లీజును ఇవ్వవచ్చు. కానీ వీటన్నింటినీ కాదని టీడీపీ సన్నిహితుని సంస్థకే కట్టబెట్టజూడటంలో తెర వెనక పెద్ద తతంగమే జరుగుతోంది’ అని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ - టిడిపిల కుట్రలు, పన్నాగాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది కాంగ్రెస్‌ పాలనే కాదన్నారు. చంద్రబాబు నాయుడి దర్శకత్వంలో అది నడుస్తోందని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

Back to Top