కాంగ్రెస్, టీడీపీల కుట్ర మళ్లీ బయటపడింది

హైదరాబాద్, 3 డిసెంబర్ 2012:

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోని 12వ క్లాజు మీద ఓటింగ్ పెట్టి కుమ్మక్కు రాజకీయాలను తెలుగుదేశ పార్టీ మరోసారి బయటపెట్టిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విప్ జారీ చేయకుండా కేవలం 26 మంది ఎమ్మెల్యేలు శాసన సభలో ఉన్నప్పుడు ఓటింగ్ నిర్వహించాలని కోరడం చూస్తే టీడీపీ రాజకీయ కుట్ర స్పష్టమవుతోందని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ ఆడిన డ్రామాలను ఎస్సీ, ఎస్టీలు అర్థం చేసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏకగ్రీవంగా ఆమోదం పొందే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయ కుట్ర చేశారని ఆరోపించింది.

     అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్ని కట్రలు, కుతంత్రాలు పన్నినా ఎస్సీ, ఎస్టీలు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని మరచిపోలేరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూ రావు, కె. శ్రీనివాసులు, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్య ప్రకాష్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చివరి నిమిషంలో ఓటింగ్ పెట్టినప్పటికీ దళితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఓటు వేశామని నేతలు చెప్పారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలోని దళిత, గిరిజనులు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారని గొల్ల బాబూ రావు అన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలో అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇపుడు 'మరో ప్రజా ప్రస్థానం' పేరుతో పాదయాత్ర చేపట్టిన మహానేత తనయ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కూడా వారు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఆపద సమయాల్లో ఆదుకున్న మహానేత లేడని శ్రీమతి షర్మిల పాదయాత్రలో దళిత, గిరిజనులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దళితుల ఆదరణ చూసి పాలక, ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బాబూరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పిన మాటలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.  

     ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు విమర్శించారు. ఏకాభిప్రాయంతో ఆమోదం పొందే బిల్లుపై ఓటింగ్ పెట్టడం కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దళిత, గిరిజనులకు అన్ని విభాగాల్లో సంతృప్త స్థాయిలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీల డ్రామాలకు ప్రజలు గుణపాఠం చెపుతారని కె. శ్రీనివాసులు హెచ్చరించారు.

చీకటి దినం

ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికపై శాసన సభలో ఓటింగ్ పెట్టి కాంగ్రెస్, టీడీపీలు కపట ప్రేమను బయట పెట్టాయని మాజీ మంత్రి మారెప్ప విమర్శించారు. ఓటింగ్ జరిగిన ఆదివారం రోజును చీకటి దినంగా భావిస్తున్నామని అన్నారు. మొదటి నుంచి ఎస్సీలను చంద్రబాబు నాయుడు మోసగిస్తూ వస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విప్ జారీ చేయకుండా నాటకాలాడారని ఆయన విమర్శించారు.

     రాష్ట్రంలో నోడల్ వ్యవస్థను తీసుకు వచ్చింది మహానేత అని మారెప్ప అన్నారు. ఆయన హయాంలోనే 20 లక్షల ఎకరాల భూములను దళితులకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడంపై మారెప్ప మండి పడ్డారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చట్టం తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లో నిధుల మళ్లింపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు, క్లాజులు లేవని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా ప్రకాష్ రావు అన్నారు.

మెస్ చార్జీల పెంపుపై హర్షం

     రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఉద్యమాలు, ఆందోళనల వల్లే ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని గొల్ల బాబూ రావు అన్నారు. మెస్ చార్జీలు పెంచడంతోపాటు విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్స్ చార్జీలు కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top