ఈ ప్రభుత్వాన్నెందుకు మోస్తున్నావు బాబూ?

హైదరాబాద్, 13 నవంబర్ 2013:

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మో‌యాల్సిన బాధ్యత చంద్రబాబు ‌నాయుడు ఎందుకు తీసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యవాదినని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 18 ఏళ్ల మీ రాజకీయ అనుభవం ఏమైంది? తెలంగాణకు మద్దతుగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకునే దమ్ముందా? కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం)కు మీ విధానం ఇది అని ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? అని జూపూడి ప్రశ్నించారు. సోనియా దర్శకత్వంలోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జీఓఎంకు వెళ్ళిందన్న వితండవాదాన్ని ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీసుకురావడాన్ని జూపూడి తప్పుపట్టారు.

రాష్ట్రాన్ని విభజించే హక్కు ఢిల్లీలోని పెద్దలకు గాని, రాష్ట్రంలోని పాలక ప్రతిపక్షాలకు గాని లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారని జూపూడి తెలిపారు. ఈ రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదని జీఓఎంకు అవసరమైతే రెండు చీవాట్టు పెట్టి అయినా చెబుతామని ఆ రోజునే ఆయన అన్నారన్నారు. ఆ క్రమంలోనే జీఓఎంకు మూడు పేజీల లేఖ కూడా రాశామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఆలోచనను, సమైక్య శంఖారావంలో చెప్పిన అభిప్రాయాన్ని ఈ రోజు ఉదయం జరిగిన జీఓఎం భేటిలో పార్టీ ప్రతినిధులు మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు తెలిపారన్నారు. రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూస్తామని చెప్పడానికే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు ఈ రోజు జీఓఎం సమావేశానికి వెళ్ళారని జూపూడి స్పష్టం చేశారు.

చంద్రబాబు ముమ్మాటికీ విభజనవాదేనని జూపూడి ప్రభాకరరావు అన్నారు. ఏనాటికీ చంద్రబాబు సమైక్యవాది కాలేరన్నారు. సమైక్యవాదం కోసం నిలబడిన శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జూపూడి అన్నారు. విభజన వాదం ఉన్నప్పటికీ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎక్కడైనా ఒక్క ఉద్యమం జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇది కావాలని రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కసారైనా పాదయాత్ర గాని, ధర్నా కానీ చేశారా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఆయన సమైక్య నినాదం, పరిపాలన అలాంటివి అన్నారు. మహానేత వెళ్ళిపోగానే కాంగ్రెస్, టీడీపీలు సహకరించుకుని రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశాయని దుమ్మెత్తిపోశారు. ఎమ్మార్‌ ప్రాపర్టీలు, ఐఎంజీ కేసులు, సీబీఐ దాడులను తప్పించుకోవడానికి సోనియాతో ఒప్పందం చేసుకుని చంద్రబాబు కాదా ఈ ప్రభుత్వాన్ని మోసిందని జూపూడి ప్రశ్నించారు. చంద్రబాబు కొబ్బరికాయ సిద్ధాంతం ఏమిటో అర్థం కావడంలేదన్నారు.

చేతకాని ప్రధాని అన్న చంద్రబాబు నాయుడు ఆ ప్రధానికే ఎందుకు లేఖ రాశారని జూపూడి ప్రశ్నించారు. ప్రజలు ఉద్యమిస్తుంటే.. వారి పక్షాన ఎందుకు నిలబడలేకపోయారన్నారు. మూడు నెలలుగా తీవ్ర ఆందోళనతో ఉద్యమిస్తున్న ప్రజలకు మద్దతుగా ఒక్క బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించగలిగారా? అని నిలదీశారు. సోనియా గాంధీ స్క్రిప్టును చంద్రబాబు తీసుకుంటారేమో గాని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీసుకోరన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీని సమావేశపరచమని చంద్రబాబు ఎందుకు గవర్నర్‌కు అడగలేకపోయారన్నారు. సమైక్యం మీద నమ్మకం లేదు కనుకే చంద్రబాబు నాలుగైదు లక్షల కోట్లు అడిగారన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు గాని, తాహతు గాని, అధికారం గాని చంద్రబాబుకు లేవని జూపూడి నిప్పులు చెరిగారు.

Back to Top