విజయమ్మ దీక్షపై కాంగ్రెస్, టిడిపి కుట్ర

హైదరాబాద్, 24 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ చే‌పట్టిన సమరదీక్షను కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్ని భగ్నం చేశాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధి‌కార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

శ్రీమతి విజయమ్మ దీక్షా శిబిరంపై శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేసి వ్యవహరించిన తీరు పట్ల జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరదీక్షతో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీమతి విజయమ్మను‌ అంబులెన్సులో కాకుండా పోలీసు వ్యాన్లో తీసుకువెళ్లడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీమతి విజయమ్మను ఆసుపత్రికి తరలించేందుకు ముందుగా  అంబులెన్సును ఎందుకు సిద్ధం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కు అయి శ్రీమతి విజయమ్మ దీక్షను భగ్నం చేశాయని ఆయన నిప్పులు చెరిగారు.

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం కోసం ఒక్క వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ మాత్రమే పోరాడుతోందని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిగతా పార్టీలు గోడ మీది పిల్లివాటంలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన మహా ఉద్యమం భావిస్తున్నామని జూపూడి ప్రభాకరరావు అభివర్ణించారు.

ప్రజలతోటి మమేకమై ఉన్న పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాల అనంతరం రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో సామాన్య ప్రజలు కదిలిన తీరును జూపూడి ప్రశంసించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విధానాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్, టిడిపిలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భవించినప్పటి నుంచీ పోరాడుతూనే ఉందన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరిగినా సహించేది లేదని చెబుతూ వచ్చిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ దిక్కున్నచోట చెప్పుకోండనే ధోరణిలో విభజన ప్రకటన చేసిందని జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. కాంగ్రెస్‌ తీరు తమ పార్టీనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రంగా ఆశ్చర్యపరిచిందన్నారు.

పార్టీలు, నాయకులు వచ్చినా రాకపోయినా ప్రజలే ఆందోళనలు చేస్తున్నారని జూపూడి తెలిపారు. తమ ఆందోళనకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నాయకత్వం వహిస్తోందని, మిగతా పార్టీలు గోడ మీది పిల్లుల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్, టిడిపిలను దూరం పెట్టాయన్నారు.

శ్రీమతి విజయమ్మ గుంటూరులోనే ఉంటే సీమాంధ్ర ప్రాంతం మొత్తం కదిలి వస్తుందన్న భయంతో ఆమెను దూరంగా తరలించి ప్రభుత్వం కుంట్ర చేసిందని ఆయన ఆరోపించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలా మరణించారో ఈ రోజుకూ ప్రభుత్వం నిర్ధరించలేకపోయిన విషయాన్ని జూపూడి ప్రస్తావించారు. శ్రీమతి విజయమ్మకు కిడ్నీలు పాడవుతున్నాయని ఆయన తెలిపారు. సుగర్‌, బిపి స్థాయిలు పడిపోతున్నా, మెదడుకు నష్టం కలిగే ప్రమాదం ఉన్నా శ్రీమతి విజయమ్మ సమన్యాయం కోసం నిరాహార దీక్షను ఎంచుకున్నారన్నారు. ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజానీకానికి చేతనైతే కేంద్ర నుంచి ఒక సమాధానం చెప్పించాలని కిరణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర ప్రజల గోడు వినకుండా నిరంకుశంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు ఉండబోదని జూపూడి హెచ్చరించారు. శ్రీమతి విజయమ్మ దీక్షను ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. ఆమె దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషంగా లభిస్తున్న మద్దతును ఆయన ప్రస్తావించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్టీలు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టంచేశారు. అయితే.. ఇంతకన్నా పెద్ద నిర్ణయాన్నే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకోబోతున్నదని జూపూడి చెప్పారు.

ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రాంతం వారి తరఫున ఉద్యమాలకు ముందుంటామని పార్టీ ప్లీనరీలో తెలిపిందన్నారు. ఓట్ల కోసమో, సీట్ల కోసమో విభజన నెపంతో ఒక ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ పప్పులు ఉడకనివ్వం అని జూపూడి హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమాజం నిద్రపోతున్న వేళ దొంగల మాదిరిగా పోలీసులు శ్రీమతి విజయమ్మ దీక్షా శిబిరంలోకి చొరబడడమేమిటని జూపూడి ప్రశ్నించారు. మహానేత సతీమణి అని కూడా చూడకుండా రెక్క పట్టుకుని లేపి, కార్యకర్తలను వేదిక మీది నుంచి నెట్టేసి, తెలుగు తెలియని, పరిస్థితిని అర్థం చేసుకోలేని పోలీసులతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వం విధానం అనుకుంటే ప్రజలు సహించబోరన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగానే సీమాంధ్ర ప్రజలు ఈ రోజు బంద్‌ పాటిస్తున్నారని తెలిపారు. బంద్‌లో పాల్గొంటున్న ఆందోళకారులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

చెయ్యని నేరానికి జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి పెద్ద నిర్ణయం తీసుకుని తన తరఫున శ్రీమతి విజయమ్మను సమరదీక్ష దీక్ష చేయమంటే ఆమె దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం అని జూపూడి నిప్పులు చెరిగారు. సెక్రటేరియట్‌లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యోగులు మధ్యలో పోలీసులను పెట్టుకుని నిరసన చేస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, పోలీసులు ఏకమైపోయి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులను గురిపెట్టి జైలుకు పంపాలని, నిరనసలు తెలియజేయకుండా ఉంచాలని చూస్తే ప్రజలు సహించబోరన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందన్నారు. లాఠీలు, తూటాలు, జైళ్ళు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు కొత్త కాదన్నారు.

శ్రీమతి విజయమ్మ దీక్షను భగ్నం చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే కాలం చెల్లబోతున్నదని జూపూడి హెచ్చరించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తుందన్నారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తే సహించబోదన్నారు. ప్రజా ఉద్యమాలకు అగ్రభాగాన నిలబడుతుందన్నారు. ప్రజాస్వామ్య వాదులారా మాట్లాడాల్సిన సమయంలో నోరు విప్పండి అని జూపూడి పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ జోలికి వస్తే ప్రజలు ఉవ్వెత్తున లేచి ఉద్యమిస్తారని, కాంగ్రెస్, టిడిపిలు, చోద్యం చూస్తున్న వారందరికీ బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మాటిమాటికీ మాట మారుస్తున్న తనను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసి, తన్నుతారన్న భయంతోనే చంద్రబాబు నాయుడు తన బస్సుయాత్రను వాయిదా వేసుకుని పారిపోయారని జూపూడి ఎద్దేవా చేశారు.

Back to Top