కాంగ్రెస్ మంటలకు చంద్రబాబు ఆజ్యం

హైదరాబాద్, 1 ఆగస్టు 2013 :

మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మంటలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోస్తున్నారని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు రాష్ట్రం గురించి కాకుండా.. రాజధాని అంశంపై మాత్రమే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు తీరును జూపూడి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు మౌనానికి అర్ధమేమిటని ఆయన ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో వెల్లడించాలని ‌జూపూడి డిమాండ్ చేశారు.‌

తెలంగాణ ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక తండ్రి పాత్ర పోషించాలని, ఇరు వర్గాలకూ న్యాయం చేయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్లీనరీలో‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటకు ఇప్పటికీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని జూపూడి చెప్పారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద 2004లో ఒకలా 2009లో మరోలా టిడిపి విధానాలను మార్చుకున్నారని జూపూడి తెలిపారు. అవకాశవాదంలోకి వెళ్ళిపోయి, ఈ రాష్ట్రం, ప్రజలు, వారి మనోభావాలు తనకేమీ పట్టవని, తాను చెప్పిందే వినాలన్న ధోరణిలో చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను చెప్పిందే ప్రజల మనోభావం అవుతుందన్న దృక్పథంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడడం సరికాదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆ సమావేశంలో చంద్రబాబు ముఖ కవళికలను చూసిన ప్రజలు సుస్పష్టంగా అర్థం చేసుకున్నారన్నారు. తానేదో తానా మహాసభల్లో మాట్లాడుతున్నట్లు 'తెలుగువారు ఎక్కడున్న సర్దుకుపోవాలి, గౌరవించుకోవాలి' అనడం, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెప్పిన తీరులో చెప్పారన్నారు. తాను ఒక రాజకీయ నాయకుడి మాట్లాడుతున్నానన్న స్పృహే చంద్రబాబుకు లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏది చెబితే అదే వినడానికి ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆడుతున్న విభజన నాటకంలో చంద్రబాబు ప్రధాన పాత్రధారి అని హిందుస్తాన్‌ టైమ్సు చెప్పిన విధానాన్ని చూస్తే ఆయన కాంగ్రెస్‌ నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నారని స్పష్టం అవుతోందని జూపూడి వెల్లడించారు. టిడిపి 30 ఏళ్ళుగా ఆత్మగౌరవ నినాదంతో నడుస్తుంటే.. రాష్ట్రం మీద ఒక నిర్ణయం చేయాల్సి వస్తే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్లుగా రెండు ప్రాంతాల ప్రజలను పిలిపించి మాట్లా‌డి, ఒప్పించమని కాంగ్రెస్‌ నాయకులకు ధైర్యంగా చెప్పలేకపోయారని నిలదీశారు. సమైక్యాంధ్ర పోరాటంలోకి గాని, జరిగిన ఉద్యమాల్లోకి కాని వెళ్ళవద్దని టిడిపి నాయకులకు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారని ప్రశ్నించారు. విజన్‌ 20- 20 అని టిడిపి చెబితే నిజమే అనుకున్నామని కానీ విభజన విషయంలో సీమాంధ్రులను కనీసం సంప్రతించకుండా టిడిపి కూడా భాగస్వామి అయిందని జూపూడి విమర్శించారు.

ఇరు ప్రాంతాల ప్రజలను గౌరవించే విధంగా నిర్ణయం చెప్పాలని విలువలకు కట్టుబడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీగా డిమాండ్‌ చేసిందని జూపూడి తెలిపారు. ఆ మాటను కూడా చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. రగులుతున్న సీమాంధ్రలో ఆందోళనలు ఆపమని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. ఒక రోజు స్టేట్సుమన్‌గా అంతకు ముందు ఒక సిఇఒగా, రేపు ఒక రాజకీయ నాయకుడిగా ఇన్ని పాత్రలు చేయడానికి చంద్రబాబు ఏమన్నా శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నారా? లేక లోక కల్యాణానికి వచ్చిన అవతార పురుషుడు అనుకున్నారా? అని ఎద్దేవా చేశారు. అయితే.. చంద్రబాబును 420 గానే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా గోపీచంద్‌ నవల 'అసమర్థుని జీవయాత్ర'లో రాసిన విధంగా తన ఆలోచనలను ప్రజల మీద రుద్దే నాయకుడిగా మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఒక పార్టీని నడపే వ్యక్తి గాని, నాయకుడు గానీ ఈ విధంగా ఉండరని అన్నారు. ‌ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఎందుకు నిరంతరం టచ్‌లో ఉన్నారని జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి టిఆర్ఎస్‌ విధానాలను అంగీకరించి పొత్తుకు వెళ్ళలేదని, ఆ రోజు ఎన్నికల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన ఆవశ్యకత చంద్రబాబుకు లేదా? అన్నారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం రూ. 5 లక్షల కోట్ల ప్యాకేజ్‌ కావాలంటూ చంద్రబాబు ఇంత దారుణంగా అడుగుతారని ప్రజలు భావించలేదన్నారు. ప్యాకేజిల వెనకాల చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారో అర్థం కావడంలేదన్నారు. కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తమ మనోభావాలను ఒక ప్యాకేజితో తీసిపడేసే విధంగా మాట్లాడుతున్నారా? అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.

ఒక ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని విడగొడుతున్న కాంగ్రెస్‌ పార్టీని సమాధానం చెప్పేంత వరకూ ప్రజలు నిలదీస్తారని జూపూడి హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధిష్టానంతో తమకు సంబంధం లేదని సీమాంధ్ర కాంగ్రెస్‌ మంత్రులు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. బలమైన నాయకుడిగా ఎదుగుతున్న శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కుట్ర పన్ని జైలులో పెట్టి, ఎన్నికలకు వెళ్లి, ఈ రాష్ట్రాన్ని చీల్చే దిశగా వెళ్లారని జూపూడి దుమ్మెత్తిపోశారు. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి న్యాయం చేయకుండా వెళుతున్న తీరు సరికాదన్నారు.‌ ముందుగానే కాంగ్రెస్‌ ధోరణిని గ్రహించిన వైయస్ఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకులుగా ఐదు రోజులు ముందుగా రాజీనామాలు సమర్పించారని పేర్కొన్నారు.

దుప్పట్లో దూరి ముఖానికి ముసుగేసుకున్న తీరులో టిడిపి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని జూపూడి నిప్పులు చెరిగారు. చీకట్లో చిదంబరంతోటి, అర్ధరాత్రి మరొకరితో వేకువజామున ఇంకొకరితో కలుస్తూ.. సంప్రతిస్తున్న చంద్రబాబు వైఖరిని హిందుస్తాన్‌ టైమ్సు వెల్లడించిందన్నారు. చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేకలేకపోతున్నారని, నిజాలను ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చీల్చే విధానం ఇదేనా అన్నారు. తెర వెనుక మాట్లాడుకోవడమే తమ విజన్‌ అనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. బలిదానాలు జరగడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అంగీకరించబోదన్నారు. విలువలతో కూడిన సంప్రదాయాలను రాష్ట్రానికి అందించాలని కోరారు. రాజకీయాలంటేనే కుట్రలు, కుతంత్రాలు అనే విధంగా టిడిపి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు కచ్చితంగా ఖండిస్తారన్నారు. ప్రజల తరఫున వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలబడుతుందని జూపూడి ప్రభాకరరావు స్పష్టంచేశారు.

Back to Top