జననేత పార్టీ వైయస్‌ఆర్‌ సిపికే ప్రజాదరణ

నాయుడుపేట (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు), 29 సెప్టెంబర్‌ 2012: జననేత జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌‌ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఎప్పటికీ ఆదరణ కొనసాగుతూనే ఉంటుందని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో విలీనం కావాల్సిన అవసరం తమ పార్టీకి లేదేని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాయుడుపేటలోని పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు‌డు వేణుంబాక విజయశేఖ‌ర్ రెడ్డి కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

విలీనంపై కొందరు కావాలని పనిగట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నారని రాజమోహన్‌రెడ్డి ‌ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ లోపాయికారి పొత్తు కుదుర్చుకోవడం వల్లనే చంద్రబాబు నాయుడి ఆటలు సాగుతున్నాయని అన్నారు. ప్రజల్లో తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న విశేష ఆదరణను చూచి ఓర్వలేకే ఆయనపై కుట్ర పన్ని అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని ఆరోపించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా వైయస్‌ఆర్ ఆశయాలను సాధించేందుకు జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యమన్నారు. ఆయనపై కాంగ్రెస్ పెద్దలు పన్నిన కుట్రలు, కుతంత్రాలు పటాపంచలై త్వరలోనే విడుదలవుతారని ‌ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని రాజమోహన్‌రెడ్డి తెలిపారు.‌
Back to Top