జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే దొంగదెబ్బ

హైదరాబాద్‌, 24 నవంబర్‌ 2012: రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని ప్రభుత్వం సిబిఐని పావుగా వాడుకొని వేధింపులకు పాల్పడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించాలన్న దురుద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయకుండా నాటకం ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం జగన్‌ను జైలుకు పంపించాలన్న కుత్సితమైన కుట్రను అమలు చేసేందుకు ముందుగా మంత్రి మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేసిందని దుయ్యబట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన, దానితో కుమ్మక్కయిన చంద్రబాబునాయుడి తీరుపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో ఎక్కడైనా క్విడ్‌ ప్రొ కో అంటూ జరుతున్నదంటే అది కాంగ్రెస్‌ - టిడిపిల మధ్యనే అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు కూడా పాల్గొన్నారు.

మోపిదేవిని బలిపశువును చేశారు:
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏ తప్పు చేయలేదని ఇప్పుడు చెబుతున్న ఈ ప్రభుత్వం ఆనాడు మోపిదేవి వెంకట రమణను బలిపశువుగా వాడుకుందన్నారు. జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించాలన్న ఉద్దేశంతోనే ముందుగా మోపిదేవిని అరెస్టు చేయించిందని కొణతాల ఆరోపించారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న కీలకమైన నిర్ణయాలపై కొణతాల ప్రధానంగా ప్రస్తావించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సిబిఐ ప్రాసిక్యూషన్‌ను తిరస్కరించడం, ఆయన రాజీనామాను కూడా ఆమోదించకపోవడంపై ఆయన నిలదీశారు. ఇదే కేసుకు సంబంధించి మరో బీసీ మంత్రి మోపిదేవి వెంకట రమణ విషయంలో ఒక న్యాయం, ధర్మాన విషయంలో మరో న్యాయాన్ని ఎలా పాటిస్తారని నిలదీశారు.

ధర్మాన తప్పు చేయకపోతే అప్పుడే కౌంటర్‌ ఎందుకు వేయలేదు:
నిజానికి 26 జీఓల విషయంలో తప్పులు చేయలేదని, కేబినెట్ చట్టబద్ధంగా జారీ చేసినవని, ఆ నిర్ణయాలను అమలు చేసిన ధర్మాన దోషి కారంటూ నిన్నటి మంత్రివర్గ సమావేశం స్పష్టం చేసిన విషయాన్ని కొణతాల ప్రస్తావించారు. అవే జీఓల ద్వారా వైయస్‌ హయాంలో లబ్ధి పొందిన వారు క్విడ్‌ ప్రొ కో కింద జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనడాన్ని ఆయన నిలదీశారు. ఆ జీఓలు చట్టబద్ధమైనవైతే జగన్‌ను ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ రాష్ట్రంలోనే కాక దేశంలో ఒక సంచలనాత్మకమైన విధంగా జగన్మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసుల్లో వేలాది కోట్ల రూపాయల అక్రమంగా, కొంతమందికి చట్టానికి అతీతంగా కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు, అందుకు ప్రత్యామ్నాయంగా వారు జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు టిడిపి, కాంగ్రెస్‌ కలిపి కోర్టులో వేశాయి. కోర్టులో సుమారు 8 నెలల పాటు కేసు నడిచింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రథమ ముద్దాయిగా ఉన్నారని, జగన్‌ పేరు 52వ వ్యక్తిగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నట్లు ఆ జీఓలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని కొణతాల ప్రశ్నించారు.

మరణించిన వ్యక్తిపై బురద చల్లుతారా?:
చనిపోయిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టడానికి సాహసం చేయడాన్ని కోణతాల ప్రశ్నించారు. బహుశా మరణించిన వ్యక్తిని ముద్దాయిగా చూపించడం బహుశా ఈ దేశంలో ఇదే ప్రథమం కావచ్చన్నారు. ఏ తప్పూ చేయలేదని ఇప్పుడు ధర్మాన విషయంలో చెబుతున్న కేబినెట్‌ కేవలం జగన్‌ పట్ల కక్షతోనే ఇంతకు ముందే కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. అప్పుడే ఈ విషయం చెబితే జగన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి అలా తాత్సారం చేసిందని ఆరోపించారు. జగన్‌ను జనం నుంచి దూరం చేస్తే తమకు నీరాజనాలు పలుకుతారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తే అది తప్పన్నారు. దీన్ని ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో మన రాష్ట్ర ప్రజలు స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్‌ వాళ్ళు తమకు సౌకర్యంగా ఉండేలా ఏది చేసేందుకైనా సిద్ధమని కొణతాల ఆరోపించారు. కోర్టులో కౌంటర్‌ వేస్తే క్విడ్ ప్రొ కో అనే సమస్యే ఉండదని, క్విడ్‌ ప్రొ కో లేనప్పుడు జగన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉండదనే ఇంత దారుణానికి పాల్పడ్డారన్నారు. అరెస్టు చేసి జైలులో పెట్టకపోతే జగన్మోహన్‌రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతారని, తమ రాజకీయ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్న భయంతోనే ఈ కుట్రను కాంగ్రెస్‌, టిడిపిలు రచించాయన్నారు.

ఆ 27 నిమిషాల సంభాషణ ఏమైంది? :
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదం అనే కుట్రలో బలైపోయారన్నది రాష్ట్రంలోను, దేశంలోనూ ప్రజలకు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిందని కొణతాల అన్నారు. డిజిసిఏ దర్యాప్తు నివేదికను నిన్నే కేబినెట్‌లో బహిర్గతం చేసి ఉండవచ్చు. దాన్ని సారాంసాన్ని ఇంకా తాము చదవలేదన్నారు. అయితే, ఆ నివేదికలో నిజాలు బయట పడతాయని తాము అనుకోవడం లేదన్నారు. హెలికాప్టర్‌లో ఉండే వాయిస్‌ బాక్సులో 27 నిమిషాల నిడివిలో ఎలాంటి సమాచారం లేకుండా పోయిందన్నారు. కీలకంగా మారిన ఆ 27 నిమిషాల సంభాషణ ఏమైందన్నది ఇంతవరకూ వెల్లడి కాలేదన్నారు. ఆ 27 నిమిషాల్లో హెలికాప్టర్‌లో జరిగిన సంభాషణలు తెలియాల్సి ఉందన్నారు. వాతావరణం బాగాలేదు వెనక్కి వెళ్ళిపోదాం, లేదా కర్నూల్‌లో ల్యాండ్‌ అవుదామని కో పైలట్‌ చేసిన సూచనలను పైలట్‌ మొండిగా తిరస్కరించిన సంభాషణలో వాయిస్‌ బాక్సులు రికార్డయి ఉన్న విషయాన్ని కొణతాల పేర్కొన్నారు. పైలట్‌ అలా మొండిగా ఎందుకు వ్యవహరించాడన్న అంశంపైన ఈ ప్రభుత్వం సిటింగ్‌ జడ్జి చేత విచారణ చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. వైయస్‌పైన ఏమాత్రం అభిమానం ఉన్నా ప్రభుత్వం దీనిపై సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

రైతులపై బాబుకు కొత్తగా ప్రేమ పుట్టుకు వచ్చింది:
చంద్రయాన్‌ చేస్తున్న చంద్రబాబు చాలా హామీలు ఇస్తున్నారని, పాదయాత్ర సందర్భంగా ఇప్పుడే ఆయనకు ఇవన్నీ తెలిసి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, మహిళలపై కొత్తగా ప్రేమ పుట్టుకువచ్చిందని కొణతాల ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీలు, ఉచిత విద్యుత్‌, ఉచిత వడ్డీలు లాంటివేమీ గుర్తుకు రాని చంద్రబాబు ఇప్పుడు అధికారం ఇస్తే అవన్నీ చేస్తానంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రుణ మాఫీలు చేయించింది ఎవరన్నది చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగడం ప్రతిపక్ష నాయకుడిగా తానే అది చేయించినట్లు చెప్పుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అంత సమర్థుడు అని నమ్మిన ప్రజలు ఆయనను ప్రతిపక్ష నాయకుడిగానే ఉంచారని ఎద్దేవా చేశారు. రెండోసారి కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ఉంచారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మళ్ళీ కేంద్రంతో మాట్లాడి రుణాలు మాఫీ చేయిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు కాటకాలతో వ్యవసాయ ఉత్పత్తులు దారుణంగా పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో రుణాలు మాఫీ చేయాలంటూ కేంద్రానికి ఆయన ఒక్క ఉత్తరం రాశారా? అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు అన్నీ మరిచిపోతారని, విద్యార్థుల వద్దకు వెళ్ళి ఫీజు రీయింబర్సుమెంటు తానే ప్రారంభించానంటారని, విద్యుత్ కూడా తానే ఉచితంగా ఇవ్వాలనుకున్నానని చెబుతారని, మళ్ళీ ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటారన్నారు. అసలు చంద్రబాబుకు దీనిపై ఒక విధానం అంటూ లేదా అని నిలదీశారు. ఓట్ల కోసమే చంద్రబాబు ఇలాంటి చీప్‌ ట్రిక్సు ప్లే చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జనంలో విశ్వాసం లేదని, అందుకే ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారన్నారు. కాంగ్రెస్‌పార్టీని ఢీకొని ఎన్టీఆర్‌ టిడిపిని స్థాపిస్తే ఇప్పుడు అదే పార్టీకి చంద్రబాబు కొమ్ముకాయడం ఏమిటని నిలదీశారు. అలాంటి చంద్రబాబుకు విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు మైండ్‌సెట్‌ మార్చుకోకపోతే జనం మళ్ళీ తప్పకుండా గుణపాఠం చెప్పక తప్పదని కొణతాల హెచ్చరించారు. ప్రజలను తప్పుదారి పట్టించి, అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు భవిష్యత్‌ అగమ్య గోచరంగా ఉందని, అందుకే ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మైండ్‌ సెట్‌ మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదన్నారు.

రుణ మాఫీపై చంద్రబాబు సంతకం ఎలా చేస్తారు?:
ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు రుణ మాఫీపై సంతకం ఎలా చేస్తారని, ఆయన ఏమైనా కేంద్ర ఆర్థిక మంత్రా అని వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ప్రశ్నిస్తే, మీరెప్పుడైనా ఎన్నికల్లో గెలిచారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని పార్టీ సలహాదారు సోమయాజులు నిలదీశారు. రుణ మాఫీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అన్నారు.  2008 - 09 సంవత్సరంలో వచ్చిన రుణ మాఫీ కేంద్రప్రభుత్వం చేసిందన్నారు. అది రాజశేఖరరెడ్డి చేసింది కాదన్నారు. రుణ మాఫీ ఒక జిల్లాకో, రాష్ట్రానికి సంబంధించినది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి కాదని, కేవలం ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు రుణాలు ఎలా మాఫీ చేస్తారని సోమయాజులు వివరణ ఇచ్చారు. ఎందుకు అబద్ధాలు చెబుతారని అడిగిన విజయమ్మ, షర్మిలను సంస్కారం లేకుండా మాట్లాడితే చంద్రబాబుకే మంచిది కాదన్నారు.
Back to Top