జగన్‌ జపం లేకుండా బాబుకు గడవదు

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేరు ఎత్తకుండా, వైయస్‌ఆర్‌సిపి జపం చేయకుండా చంద్రబాబుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదేమో అని వైయస్‌ఆర్‌సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రెండు సార్లు అధికారానికి దూరమై, మూడవసారి కూడా అధికారం అందే అవకాశాలు కనిపించకపోవడంతో చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయవ్యవస్థపై తమకు అపారమైన గౌరవం ఉందని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుట్రచేసి అక్రమంగా 8 నెలలుగా జైలులో నిర్బంధించినా న్యాయస్థానాల్లోనే పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనందువల్లే చంద్రబాబు తనపై వచ్చిన కేసులపై 'స్టే'లు తెచ్చుకున్నారని విమర్శించారు. శోభా నాగిరెడ్డి బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వ్యవస్థలను భ్రష్టు పట్టించింది మీరే బాబూ:
వ్యవస్థలను వినియోగించుకోవడంలో, నమ్మకద్రోహం చేయడంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబంతటి నిపుణులు ఇంకెవరూ లేరని శోభా నాగిరెడ్డి తూర్పారపట్టారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించిందీ చంద్రబాబే అని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయనకు పిల్లనిచ్చిన మామ, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్వయంగా ప్రకటించారని ప్రస్తావించారు. మనుషులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు, ములాయం సింగ్ సిద్ధహస్తులని ఎం.పి. జయప్రద చెప్పిన మాటలను తాను పత్రికలలో చూశానని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత తన బాధ్యతను వదిలిపెట్టి శ్రీ జగన్‌ మీద, వైయస్‌ఆర్‌ సిపి మీద ఆరోపణలు చేయడాన్ని శోభా నాగిరెడ్డి ఖండించారు. శ్రీ జగన్‌ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారంటూ చంద్రబాబు తన పాదయాత్రలో ఆరోపించడాన్ని ఆమె తూర్పారపట్టారు. శ్రీ జగన్‌కు బెయిల్‌ వస్తుందనుకున్న సమయంలో ఒక రోజు ముందుగా తన ఎంపీలను చిదంబరం వద్దకు పంపించి అడ్డుపడ్డారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీతో వైయస్‌ఆర్‌సిపి కలుస్తుందని, దానికి సహకార ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని శోభా నాగిరెడ్డి తిప్పికొట్టారు. కుట్ర చేసి ఎనిమిది నెలలుగా జైలులో ఉంచి, ఇబ్బందులు పెడుతున్నందుకు తాము కలుస్తామనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు.‌ కాంగ్రెస్‌లో కలవాలనుకుంటే వైయస్‌ఆర్‌సిపి అధినేత జైలులో ఎందుకు ఉంటారని, ఇబ్బందులు పడతారని ఆమె ప్రశ్నించారు. జైలులో ఉండి కష్టాలు అనుభవిస్తున్న శ్రీ జగన్‌ కాంగ్రెస్‌తో కలుస్తారా? లేక మైనార్టీలో పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా భుజం కాస్తున్న చంద్రబాబు ఆ పార్టీతో అంటకాగుతున్నారా అనేది అందరికీ స్పష్టంగా తెలుస్తోందన్నారు.

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెట్టినప్పుడు 18 మంది సభ్యులున్న వైయస్‌ఆర్‌సిపి మద్దతుగా ఓటు వేసిన విషయాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానానికి తాము అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిసినప్పటికీ చంద్రబాబు రెండు గంటలపాటు తీర్మానంపై మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని దూషించిన వైనాన్ని ఆమె ఉటంకించారు. అయినా తాము ప్రజల పక్షాన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేశామని చెప్పారు. కాంగ్రెస్‌తో వైయస్‌ఆర్‌సిపి కలిసిపోతుందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. జనం పక్షాన నిలబడేది ఎప్పటికీ వైయస్‌ఆర్‌సిపియే అని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు.

నిర్దోషినని మీకు మీరే ఎలా చెప్పుకుంటారు?:
చంద్రబాబుకు ఏ కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని ఆమె నిలదీశారు. తాను నిర్దోషినని తనకు తానే చంద్రబాబు మీడియా ముందు చెప్పుకోవడాన్ని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టాలంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడే లేడంటూ ఆ పార్టీ నాయకులు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో చెబుతున్నారని ప్రస్తావించిన శోభా నాగిరెడ్డి.. ఈ మాటలు చూస్తే ఎవరు ఎవరికి మద్దతుగా ఉన్నారో స్పష్టం అవుతున్నదన్నారు.

మీకింక సొంత మీడియా ఎందుకు?:
సొంత పత్రికను, చానల్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన పద్నాలుగేళ్ళుగా తనకు రాలేదని, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి సొమ్ముతో వాటిని పెట్టుకున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను శోభా నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. అరడజనుకు పైగా బినామీ మీడియా సంస్థలు మిమ్మల్ని భూజాన వేసుకుని మోస్తుండగా ఇంకా మీకు సొంత సంస్థలు ఎందుకు చంద్రబాబూ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ పత్రికలు, చానళ్లు బాబు వేసే ప్రతి అడుగును సవివరంగా చూపిస్తున్నాయని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న తాపత్రయం ఆయనకన్నా ఆ మీడియాకే ఎక్కువగా ఉందన్నారు. 

నలుగురు సహకార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై శోభానాగిరెడ్డి స్పందిస్తూ.. వారంతా చంద్రబాబు పేనల్‌కు చెందిన వాళ్ళని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టిడిపిలు రెండూ తమకు సమానమైన ప్రధాన రాజకీయ ప్రత్యర్థులని ఆమె ప్రకటించారు.
Back to Top