ఇదిఎమైన ధర్మమా చంద్రన్న

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల 29 వాటర్ ప్లాంట్లు సీజ్
ముందస్తు నోటీసులు లేకుండానే సీజ్ చేసిన అధికారులు
నిబంధనలు పాటించలేదంటూ బుకాయింపు
అదే రీతిలో నడుస్తున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడని వైనం


ధర్మవరం: వైఎస్సార్‌సీపీ నాయకులు, మద్దతుదారులను దెబ్బ తీయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పని చేస్తున్నారు.  చౌక ధరల దుకాణాలు, ఇతరత్రా ప్రభుత్వ పథకాలను నిర్వహిస్తున్న వారందరినీ అకారణంగా తొలగిస్తూ ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి కన్ను వాటర్ ప్లాంట్లపై పడింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు సంబంధించిన ప్లాంట్లన్నింటినీ సోమవారం అధికారులతో సీజ్ చేయించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తక్కువ ధరకే శుద్ధి జలాలను అందజేయాలన్న తలంపుతో నాలుగేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం పట్టణంలో ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. కేవలం రూ.2కే 20 లీటర్ల వాటర్ క్యాన్ అందించే వారు. ఆ ప్లాంట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా తక్కువ ధరకు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారుు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత   ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట కొన్ని వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే అదే పద్ధతిలో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నందున ప్రజలు వాటిని పెద్దగా ఆదరించలేదు. దీంతో ముందున్న వాటిని మూసేస్తే కొత్తవి ఏర్పాటు చేయవచ్చనే కక్షతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు చెందిన 29 వాటర్ ప్లాంట్లను సీజ్ చేయించారు.

నోటీస్ లేదు.. సమాచారం లేదు..

వాస్తవానికి ఏదైనా ఆస్తిని సీజ్ చేయడానికి మున్సిపల్ అధికారులు తొలుత వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. కానీ ముందస్తు సమాచారం, నోటీసు జారీ చేయకుండానే మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకులను వెంటేసుకుని వెళ్లి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే.. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లను నడపడం లేదని చెబుతున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వాటిని సీజ్ చేశారని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

పచ్చరంగు ఉంటే ఓకే..

ఇదిలా ఉంటే టీడీపీ నేతలకు చెందిన వాటర్ ప్లాంట్లు, వైఎస్సార్‌సీపీ మద్దతు దారులకు చెందిన వాటర్ ప్లాంట్లు పక్కపక్కనే ఉన్నా వారు నడిపిన రీతిలోనే వీరూ నడుపుతున్నా.. అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చాలా రోజులుగా ఉన్న పాంట్లలో కొన్నింటిని టీడీపీ నేతలు కొని పచ్చ రంగు వేశారు. అధికారులు వాటి దరిదాపులకు కూడా వెళ్లక పోవడం చర్చనీయూంశమైంది. రామ్‌నగర్, యర్రగుంట సర్కిల్‌లో నడుస్తున్న ప్లాంట్లకు నీటిని మున్సిపాలిటీ నుంచే తీసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌ను సాక్షి వివరణ కోరగా.. ‘వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయి.. అందుకే సీజ్ చేశామ’ని తెలిపారు. టీడీపీ నాయకులు నడుపుతున్న వాటర్ ప్లాంట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయూ.. అని అడిగితే నిబంధనలకు అగుణంగా లేకపోతే నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తామని చెప్పారు.
Back to Top