ఇడుపులపాయకు 'జనం సంతకం' పత్రాలు

హైదరాబాద్‌, 26 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై సిబిఐ అక్రమ కేసులు పెట్టి వేధించడానికి నిరసనగా తమ పార్టీ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. జననేత శ్రీ జగన్‌ను జనంలో ఉండనివ్వకుండా జైలులో ఉంచే చర్యలు చేపట్టి సిబిఐ పక్షపాతంగా వ్యవహరించడానికి నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చిందన్నారు. అయితే, తమ పార్టీ ఇచ్చిన సమయంలోగానే ప్రజలు రెండు కోట్ల సంతకాలు చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ సంతకాలను సిడిల రూపంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో ఢిల్లీ తీసుకువెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేశారని తెలిపారు. పార్టీ సేకరించిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' పత్రాలను ఇడుపులపాయలోని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద భద్రపరచనున్నట్లు గట్టు వెల్లడించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన రెండు కోట్ల సంతకాల పత్రాలను ఈ నెల 29వ తేదీ ఉదయం వాహనంలో తీసుకువెళ్ళి సాయంత్రానికి ఇడుపులపాయ చేరుస్తామని గట్టు రామచంద్రరావు తెలిపారు. అక్కడ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ వాటిని 30వ తేదీన స్వీకరించి వైయస్‌ఆర్‌ ఘాట్‌లో భద్రపరుస్తారని చెప్పారు. కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గట్టు తెలిపారు.
Back to Top