ఎమర్జెన్సీని తలపిస్తున్న సిబిఐ తీరు

హైదరాబాద్‌, 24 జనవరి 2013: సిబిఐ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నట్లు ఉందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నిప్పులు చెరిగింది. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌ను గురువారంనాడు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సిబిఐపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మ సిబిఐని తూర్పారపట్టారు. కాంగ్రెస్ పార్టీ,‌ సిబిఐ కలిసి శ్రీ జగన్‌ను జైలులో ఉంచేందుకు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. ఈ రోజున శ్రీ జగన్‌కు బెయిల్‌ వస్తుందని వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూశామన్నారు. అయితే, ఆయనకు బెయిల్‌ తిరస్కరించడం దురదృష్టకరమని పద్మ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై ఎందుకు విచారణ చేయదు?:
ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సిబిఐ చెబుతోందని, అలాంటప్పుడు ప్రభుత్వ పాత్రపై ఎందుకు విచారణ చేయడం లేదని వాసిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనకు ప్రభుత్వం సహకరించడంలేదని ‌శ్రీ జగన్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టుకు సిబిఐ చెప్పిన విషయం తెలిసిందే. సిబిఐ తీరు దారుణంగా ఉందని, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. సిబిఐ తన తీరును ఇలాగే కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో తీవ్రంగా ఎండగడతామని పద్మ హెచ్చరించారు.

అలా చెప్పేందుకు సిబిఐకి సిగ్గు లేదా?:
శ్రీ జగన్మోహన్‌రెడ్డి కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడంలేదని బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా సిబిఐ చెప్పడం సిగ్గుచేటు అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 26 ప్రభుత్వ జిఓల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పి. శంకర్రావు పిటిషన్‌ వేసిందే తడవు అన్నట్లు సిబిఐ బృందాలు ఆగమేఘాల మీద శ్రీ జగన్‌ ఆస్తులు, సంస్థలపై దాడులు చేసిందని ఆమె గుర్తు చేశారు. అంతే వేగంగా ఈ కేసు దర్యాప్తును పూర్తిచేయకుండా సిబిఐ నాటకాలు ఆడుతోందని పద్మ ఆరోపణాస్త్రాలు సంధించారు. శ్రీ జగన్‌ను ఏ ఆధారాలతో అరెస్టు చేసిందని సిబిఐని ఆమె సూటిగా ప్రశ్నించారు. కృత్రిమంగా ఆధారాలు సృష్టించేంత వరకూ శ్రీ జగన్‌ను జైలులోనే ఉంచేస్తారా? అని నిలదీశారు. అవినీతి కేసులకు సంబంధించి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రిని కాకుండా శ్రీ జగన్‌ను ఎందుకు అరెస్టు చేశారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.

దర్యాప్తు నెపంతో ఎంతకాలం జైలులో ఉంచుతారు?:
ఈ కేసుకు సంబంధించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ లిఖిత పూర్వకంగా చెప్పిన సమయం జనవరితో ముగిసిందని పద్మ గుర్తు చేశారు. అయితే, దర్యాప్తును పూర్తి చేయకుండా శ్రీ జగన్‌ను ఎంతకాలం జైలులోనే ఉంచుతారని ఆమె ప్రశ్నించారు.‌ శ్రీ జగన్ కేసుకు సంబంధించి సిబిఐ 18 నెలలుగా దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. ఈ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచీ కూడా సిబిఐ అన్యాయంగా వ్యవహరిస్తోందని పద్మ విమర్శించారు. ఆ 26 జిఓల విషయంలో శ్రీ జగన్‌ లబ్ధి పొందారా లేదా అన్నది తేల్చకుండా సిబిఐ అరాచకంగా వ్యవహరిస్తోందని ఆమె నిప్పలు చెరిగారు. మరో రెండు రోజుల్లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోనున్న సమయంలో సిబిఐ, ప్రభుత్వం ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో అర్థం అవుతోందన్నారు.

చేతులు ముడుచుకుని కూర్చుంటుందా?:
శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై టిడిపి ఆఫీసు నుంచి కోర్టుకు ఫ్యాక్సు ద్వారా ఫిర్యాదులు పంపించిందని, ఆయనను ఎక్కువ కాలం జైలులోనే ఉంచాలని కుట్రలు చేస్తోందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆడ లేక మద్దెల ఓడు అన్న రీతిలో టిడిపి శ్రీ జగన్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొందరు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లపై సిబిఐ కనీసం వ్యతిరేకించని వైనాన్ని ఆమె గుర్తుచేశారు. దర్యాప్తు నెపంతో ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్నికైన ఒక ఎంపి, ఒక పార్టీ అధ్యక్షుడైన శ్రీ జగన్‌ను కుట్ర పూరితంగా ఎంతకాలం జైలులో ఉంచుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం సహకరించడంలేదన్న చెప్పి చేతులు ముడుచుకుని కూర్చుని కూర్చుంటారా? అని సిబిఐని ఆమె నిలదీశారు. ఎమర్జెన్సీ పాలన విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పడు గట్టిగా గుణపాఠం చెబుతారని పద్మ హెచ్చరించారు.

కుమ్మక్కయితే కష్టాలెందుకు?:
కాంగ్రెస్‌ పార్టీతో ‌వైయస్‌ఆర్‌సిపి కుమ్మక్కయితే పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలులోనే కష్టాలు పడు దుస్థితి ఎందుకు వస్తుందని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పద్మ బదులిచ్చారు. గతంలోనే మైసూరారెడ్డి చెప్పిన విధంగా వంద సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్‌పార్టీతో అవగాహన కుదుర్చుకోవాల్సిన అగత్యం వైయస్‌ఆర్‌సిపికి లేదని మరో విలేకరి ప్రశ్నకు పద్మ స్పష్టత ఇచ్చారు.
Back to Top