ఈనాడు రాగం.. ఈడీ పల్లవి!

హైదరాబాద్, 20 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఈనాడు రాగం అందుకుంటే, సీబీఐ తాళం వేస్తోందని, ఈడీ పల్లవి పాడుతున్నదని పార్టీ విప్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. విచారణ సంస్థలు కూడా యెల్లో మీడియాతో కుమ్మక్కై వంతపాడుతున్నాయని ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేసే ఆరోపణలనే ఈనాడు ప్రచురిస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఈనాడు ప్రచురించిన వార్తలనే సిబిఐ, ఈడీ అధికారులు కూడా వల్లిస్తున్నాని ఆయన విమర్శించారు. వివాదాస్పద 26 జిఓలు జారీ చేసిన మంత్రులను బయటే ఉంచి, వాటితో ఎలాంటి సంబంధమూ లేని శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడమేమిటని బాలినేని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు, సిబిఐ, ఈడీ అధికారులు, ఈనాడు, ఆంధ్యజ్యోతి పత్రికల కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరిగారు. వీటిని చూస్తే అదో విష వలయంలా ఉందన్నారు. మహానేత వైయస్‌ మరణించిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ కూడా అందులో కలిసిపోయిందని దుయ్యబట్టారు.

వివాదాస్పద ఆ 26 జిఓలకు కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలని ‌బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బయ్యారం గనుల విషయంలో యెల్లో మీడియా అసత్యప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బయ్యారం గనుల్లో రూ. 14 లక్షల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని మహానేత వైయస్‌ తన అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు కట్టబెట్టారంటూ టిడిపి చేస్తున్న ప్రచారాన్ని బాలినేని తిప్పికొట్టారు. అంత విలువైన ఖనిజం ఉంటే ఖమ్మం జిల్లాకే చెందిన ఎంపి నామా నాగేశ్వరరావు రూ. 7 లక్షల కోట్లకే తీసుకోవచ్చు గదా అన్నారు. పాలేరు సుగర్సును చంద్రబాబు నాయుడు ధారాదత్తం చేసిన వైనాన్ని బాలినేని గుర్తుచేశారు.

బయ్యారం గనుల లీజును గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశానని బాలినేని చెప్పారు. ఆ గనులు వైయస్‌ కుటుంబ సభ్యులకు చెందినవైతే తానెందుకు రద్దు చేస్తానని ప్రశ్నించారు. ఓబుళాపురం గనుల పర్మిట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని వాటిని కూడా రద్దు చేశామన్నారు. దీనిపై టిడిపి, కాంగ్రెస్ అసత్య ప్రచా‌రం చేస్తున్నాయన్నారు. నిజానికి‌ శ్రీ జగన్ కాంగ్రెస్ పార్టీలో‌నే ఉంటే అరెస్టు చేసేవారా? అని ప్రశ్నించారు. సిబిఐ చార్జిషీట్‌లో ముద్దాయిగా పేర్కొన్నప్పటికీ గతంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిపై చర్యతీసుకోకపోవడానికి ఆమె కాంగ్రెస్‌లోనే ఉండడమే కారణం అన్నారు. అదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నందున తానే గనుల మంత్రిగా ఉండి ఉంటే తప్పకుండా అరెస్టు చేసి ఉండేవారన్నారు. శ్రీ జగన్‌కు, ఓఎంసి యజమాని గాలి జనార్దనరెడ్డికి సంబంధం ఉందంటూ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని బాలినేని ప్రశ్నించారు.

2009 జూన్‌ 9న ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను పట్టుకుని టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు చిన్న ప్రెస్‌మీట్‌ పెడితే దాని మీద చిలవలు పలవలు పెంచి మళ్ళీ ఈనాడు ఒక పేజీ వార్తా కథనాన్ని ప్రచురించిన తీరుపై బాలినేని ప్రశ్నించారు. ఈడీ తరఫు న్యాయవాది విపుల్ కుమార్‌ ఈనాడు పత్రికలో వచ్చిన అంశాలనే ప్రస్తావించారన్నారు. ఈనాడు శుక్రవారంనాటి పత్రికలో శ్రీ జగన్‌ను రావనాసురుడితో పోలుస్తూ కార్టూన్‌ ప్రచురించడాన్ని బాలినేని తీవ్రంగా ఖండించారు.

శ్రీ జగన్‌ను బయటకు రానివ్వకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఇండియా టుడే సర్వే ఇచ్చిందని, ఆ సర్వేను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎందుకు ప్రచురించలేదని ఆయన ప్రశ్నించారు. టైమ్సు నౌ సర్వేను మాత్రమే ఎందుకు ప్రచురించారని బాలినేని నిలదీశారు. తమతో కలిసి ఉమ్మడిగా సర్వే నిర్వహించేందుకు యెల్లో మీడియా సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సర్వేలో శ్రీ జగన్‌కు ప్రతికూలంగా ఫలితాలు వస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. అందుకు యెల్లో మీడియా సిద్ధమా అని ప్రవ్నించారు. కల్పిత కథలు అల్లి శ్రీ జగన్‌ను ఇరికించాలని యెల్లో మీడియా కుట్ర చేస్తోందని బాలినేని ఆరోపించారు.

చేతకానితనంతో మంత్రులు మాట్లాడుతున్నారని బాలినేని వ్యాఖ్యానించారు. మహానేత వైయస్‌ పెట్టమంటేనే తాము ఆ జిఓలపై సంతకాలు చేశామంటూ మంత్రులు చెబుతున్న విషయాన్ని విలేకరి ప్రస్తావించినప్పుడు బాలినేని పై విధంగా స్పందించారు. వైయస్‌ ఏది చెబితే అది చేస్తామని మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారా? అని బాలినేని ఎద్దేవా చేశారు. బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతోనే మహానేత వైయస్‌ ప్రభుత్వం ఆ గనులను రక్షణ స్టీల్సుకు కేటాయించారన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, విశాఖ స్టీల్సుకు కేటాయంచడంపై తమ పార్టీ స్పందించేది ఏమి ఉంటుందని మరో ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీ జగన్‌ ఏ రోజునా మంత్రులతో మాట్లాడింది లేదని ఆయన చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top