దిగజారిపోతున్న చంద్రబాబు: కొణతాల

హైదరాబాద్, 23 మార్చి 2013: వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన చంద్రబాబు నాయుడు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు.‌ యూనిట్‌ను  18 రూపాయలకైనా కొని వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసినా ప్రజలపై ఒక్క పైసా కూడా భారం వేయని మహనీయుడి పట్ల చంద్రబాబు స్థాయి దిగజారిపోయి ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. మహానేత వైయస్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటు సంస్థల నుంచి ఎక్కువ రేటుకు విద్యుత్‌ కొనుగోలు చేయడమే ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా రావడానికి కారణం అంటూ చంద్రబాబు పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలపై కొణతాల తీవ్రంగా స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

భవిష్యత్‌ అంధకారమైపోయి, మళ్ళీ అధికారం అందుతుందనే ఆశలు గల్లంతైపోవడంతోనూ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పోటీ పడలేక, ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయిన స్థితిలో చంద్రబాబు సహనం నశించి నీచంగా మాట్లాడుతున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. అనాలోచిన చర్యలు, అసమర్థ నిర్ణయాలతో నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రజలపై రూ. 32 వేల కోట్ల అదనపు ఆర్థిక భారం మోపిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయకుండా దివంగత మహానేతపై వ్యాఖ్యలు చేయడమేమిటని ఆయన నిలదీశారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు నిజం తెలియదనుకోవాలా? అన్నీ తెలిసే అబద్ధాలు చెబుతున్నారని అనుకోవాలా? అని కొణతాల ప్రశ్నించారు.

ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‌చంద్రబాబు కాపాడుతున్నారని కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ఒక పక్కన ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు దాన్ని దించేసే సమయం వచ్చినప్పుడు మాత్రం దానికి నిస్సిగ్గుగా మద్దతుగా నిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబులా మహనేత వైయస్‌ ఏనాడూ మాట తప్పలేదన్నారు. ఎంత ఖరీదైనా పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి కొని విద్యుత్‌ సరఫరా చేశారన్నారు. సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు కాబట్టే మహానేత వైయస్‌ తన హయాంలో 2009 వచ్చేసరికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 207 లక్షల టన్నులకు తీసుకువెళ్ళిన ఘనత పొందారన్నారు. చంద్రబాబు హయాంలో తన నిర్ణయాలతో 160 వేల టన్నుల నుంచి 104 లక్షల టన్నులకు దిగజార్చారని విమర్శించారు. మహానేత కాలంలో ఆహార ఉత్పత్తులు 6.87 శాతంగా ఉండగా ప్రస్తుతం 2.7 శాతానికి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పటి చంద్రబాబు పాలనకు ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు తేడా ఏమీ లేదని కొణతాల ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్న రైతులకు వడ్డీలు, రుణాల మాఫీ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. ఒక పక్కన రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా కష్టాలు పడుతుంటే చార్జీలు పెంచి నడ్డి విరుస్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరు ఎవరి పాలనను కాపీ కొడుతున్నారో తెలియడంలేదన్నారు. ఈ ప్రభుత్వం తీరు కారణంగా లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని 20 లక్షల మంది కార్మికులు వీధినపడ్డారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వేలాది మంది పొట్ట చేతపట్టుకుని వలస పోయారని అన్నారు. అన్నదాతలు కడ్నీలు అమ్ముకోవాల్సిన దుస్థితికి వెళ్ళారన్నారు.

మహానేత వైయస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  క్రిసిల్‌ రేటింగ్‌ ప్రకారం విద్యుత్‌ బోర్డు ఉత్తమ బోర్డుగా నమోదైన విషయాన్ని కొణతాల గుర్తుచేశారు. గెయిల్‌ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తామని చెప్పి, అలా చేయలేని పక్షంలో నష్టాన్ని ప్రభుత్వంమే భరిస్తుందని చంద్రబాబు విద్యుత్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. అయితే, మహానేత వైయస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్‌ కేంద్రం నుంచి సరఫరా చేయించుకునేలా కృషి చేశారన్నారు. బొగ్గు ఉత్పత్తి పెరగనందువల్ల బొగ్గుతో నడిచే కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే పరిస్థితి నేడు నెలకొన్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్త వహించకపోతే మరింత విద్యుత్‌ సంక్షోభం పెరిగిపోయే ప్రమాదం ఉందని కొణతాల హెచ్చరించారు.

ముడుపులు తీసుకుని విద్యుత్‌ ఎక్కువ ధరకు వైయస్‌ కొనుగోలు చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబుకు అంత ధైర్యం ఉంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం మీ చెప్పుచేతల్లో ఉంది, సిబిఐ కూడా మీ జేబు సంస్థగా ఉంది కనుక దర్యాప్తు చేయించుకోవాలని కోణతాల సవాల్‌ చేశారు. అలాగే చంద్రబాబు హయాంలో వచ్చిన తక్కువ కాలంలో ఉత్పత్తులు మొదలయ్యే సంస్థలతో కుదుర్చుకున్న పి.పి.ఎ.ల విషయంలో జరిగిన అవకతవకలపైన కూడా దర్యాప్తును ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం సరఫరా చేసే గ్యాస్‌ నడిచే మర్కెంటైల్‌‌ విద్యుత్ సంస్థల నుంచి యూనిట్‌ రూ. 2కు సరఫరా చేయాల్సి ఉందని, అయితే, ఈ మధ్యన రెండు సంస్థలతో రూ. 5 కు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న వైనాన్ని కొణతాల ప్రస్తావించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా, దగా చేయడం కాదా? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడడంలేదని ఆయన నిలదీశారు. వీటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలన్నారు. రాష్ట్రంలో ఏమి జరిగినా మహానేతపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాన్నారు.

ఎఫ్‌డిఐ బిల్లుకు మద్దతుగా నిలిచిందెవరో అందరికీ తెలిసిందే అని కొణతాల తెలిపారు. హెరిటేజ్‌లో విదేశీ పెట్టుబడులను తీసుకోబోమని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన సవాల్‌ చేశారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర కాంగ్రెస్‌ జెండా పట్టుకుని చేస్తున్నట్లుందన్నారు. ఎంతసేపూ కాంగ్రెస్‌ పార్టీని కాపాడాలని, భూజాన మోయాలని చంద్రబాబు చూస్తున్నారని కొణతాల ఎద్దేవా చేశారు.
Back to Top