డీజిల్‌ ధర పెంపుపై వైయస్‌ఆర్‌సిపి ఫైర్

హైదరాబాద్, 19 జనవరి 2013: డీజిల్‌ ధరలు పెంచడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. డీజిల్‌ ధరల పెంపు కారణంగా ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలపై ఆర్థిక భారాలు పెరిగిపోతున్నప్పుడు సబ్సిడీలు ఇచ్చి కొంత వరకైనా వారికి ప్రభుత్వం ఊరట కలిగించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న సబ్సిడీలను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తివేయడం అత్యంత దారుణం అని నిప్పులు చెరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి శనివారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మునిగిపోతున్న నావలాంటిది కాంగ్రెస్‌ పార్టీ అని, అలాంటి పార్టీతో వైయస్‌ఆర్‌సిపి ఎందుకు పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

డీజిల్‌ ధరల పెంపు నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచే ప్రమాదం ఉందని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ప్రభుత్వం విపరీతంగా పన్నుల భారం వేస్తోందన్నారు. ఆయిల్‌ సంస్థలు దుబారాను, అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ధరలు పెంచాల్సిన అవసరమే ఉండబోదని మైసూరారెడ్డి అన్నారు. 'అండర్‌ రికవరీస్'‌ పేరుతో నష్టాలు పూడ్చుకునేందుకు ప్రైవేటు సంస్థలు డీజిల్‌ ధరలు పెంచుతూ ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి పెట్రోల్‌ ధరలు, మరోసారి డీజిల్‌ ధరలు పెంచి ఇంకోసారి గ్యాస్‌ ధరలు ఇలా విడతలవారీగా పెంచుతోందని ఆయన ఆరోపించారు. తాను చేసే ప్రతి పెంపునకూ అంతర్జాతీయ టారిఫ్‌ అనే సాకు చూపిస్తోందని విమర్శంచారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ధరలను పెంచడంపై ప్రధాని‌ డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ ఏమి చేస్తున్నారో అర్థం కావడంలేదని మైసూరా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించుకునే క్రమంలో ధరలు పెంచడం శోచనీయమని మైసూరారెడ్డి విమర్శించారు. డీజిల్ ధర నియంత్రణ నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రజలను చమురు కంపెనీలకు ఎరగా వేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పెట్రోలు, గ్యాస్, డీజిల్ వంటి వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోతే ఎలా అని ఆయన అన్నారు. కచ్చితంగా వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలన్నారు.

మన దేశంలో తలసరి ఆదాయం పెరగలేదని, కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు లొంగిపోయి యుపిఎ ప్రభుత్వం ఇలా ధరలను విపరీతంగా పెంచేస్తోందని ఆయన ఆరోపించారు. ఐరోపా, అమెరికా వంటి దేశాలతో సమానంగా చమురు ధరలు పెంచాలనుకున్నపుడు అక్కడి ప్రజల మాదిరిగానే ఇక్కడి వారి తలసరి ఆదాయం పెరిగిందేమో చూడాల్సిన ఆవస్యకత ఉందని చెప్పారు. తలసరి ఆదాయం పెరగకుండా ధరలు పెంచితే, ద్రవ్యోల్బణం పెరిగి జనం మరిన్ని ఇబ్బందులు పడటం తప్ప ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనంగా ధరల పెంపు నిలుస్తోందని ఆయన అన్నారు. డీజిల్‌ ధరల పెంపును ఖండిస్తూ, పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మైసూరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌సిపి తరఫున డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మరో సిజిసి సభ్యుడు జ్యోతుల నెహ్రూ కూడా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top