దమ్ముంటే వేటు వేయండి

హైదరాబాద్, 17 మార్చి 2013: దమ్ము, ధైర్యం ఉంటే శాసనసభలో మొన్నటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన తమ పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని‌ కాంగ్రెస్‌ పార్టీని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ చేసింది. ఆ పార్టీకి సత్తా ఉంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేసింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసమర్థ, అప్రజాస్వామిక, ప్రజా కంటక ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి శాసనసభలోనే ఉరివేసుకుందని దుయ్యబట్టింది. భవిష్యత్‌ లేకపోయినా, తనకు వద్దు అని పాలకపక్షాన్ని నిలబెట్టడమే తన లక్ష్యం అంటూ టిడిపి తన మరణ శాసనాన్ని తానే రాసుకుందని దుయ్యబట్టింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌, టిడిపిల నిజస్వరూపం తేటతెల్లం : 
శాసనసభలో ‌గురువారంనాటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌, టిడిపిల నిజస్వరూపం తేటతెల్లమైందని, బహిర్గమైందని భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఎండగట్టి, అడుగడుగునా అధిక్షేపించి, ప్రభుత్వం తీరును నిలదీసి, అవిశ్వాసం ప్రకటించాల్సిన ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించిందని ఆరోపించారు. ప్రజలకు ద్రోహం చేస్తున్న పాలకపక్షానికి బాసటగా నిలిచి యావత్‌ ప్రపంచాన్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ఏమాత్రమూ నెరవేర్చడంలేదు కాబట్టి, ప్రజల ప్రయోజనాలను తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కనుక తాము ఇప్పటికైనా గొంతు ఎత్తకపోతే ద్రోహం అవుతుందని భావించి పాలకపక్షం నుంచే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారని భూమన తెలిపారు. అయినప్పటికీ టిడిపి నిస్సిగ్గుగా పాలకపక్షానికి వత్తాసు పలికిందని ఆయన విమర్శించారు.

ప్రజా కోర్టులో గెలుపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే :
అవిశ్వాసంలో తాము ఓడిపోయి ఉండవచ్చేమో గానీ ప్రజా కోర్టులో గెలుపు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అని భూమన ధీమాగా చెప్పారు. ఉప ఎన్నికలకు మేం భయపడం అని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన ఇచ్చారని, కానీ ఉప ఎన్నికలను ఏ విధంగా వాయిదా వేయాలని చూస్తున్నట్లు పత్రికలు చాలా స్పష్టంగా వార్తలు రాశాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే.. ప్రభుత్వం అసమర్థమైనదని విప్‌ను ధిక్కరించిన వారిని శాసనసభకు అనర్హులుగా ప్రకటించి, వెంటనే ఉప ఎన్నికలు జరిపిస్తే కాంగ్రెస్‌ నాయకులు ఉత్తరకుమారులు కాదన్నారు. ఉప ఎన్నికలకు భయపడి వాయిదా వేస్తే.. కాంగ్రెస్‌ నాయకులు ఉత్త రాకుమారులే.. ఉత్తరకుమారులే.. అని అన్నారు.


ఉప ఎన్నికలంటే వాటికి భయం :
కాంగ్రెస్‌, టిడిపిలకు  ఉప ఎన్నికలంటే భయమని, ఉప ఎన్నికలను ఎదుర్కొనే శక్తి వాటికి ఏ మాత్రమూ లేదని భూమన ఎద్దేవా చేశారు. ఎలాగోలా ఉప ఎన్నికలను వాయిదా వేసి సంవత్సరం గడువుండే సమయం లోపల అనర్హత వేటు వేయించడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అని చట్టాలను పరిశీలిస్తోందన్నారు. శాసనసభలోని లుకలుకలను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తొమ్మిది కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీలో మీ విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుని వెంటనే ఎన్నికలు జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలి :
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీల ప్రాతిపదికన నిర్వహించాలని కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. 'ముందుగా ఎంపిటిసి, జెడ్‌టిసి ఎన్నికలను జరపండి', 'మీ సత్తా ఏమిటో చాటుకోండి' అని భూమన సవాల్‌ చేశారు. అవిశ్వాసం సందర్భంగా ప్రజలందరూ చూస్తుండగా, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌, టిడిపిలు నిస్సిగ్గుగా ఒక్కటైపోయినట్టుగానే ఎన్నికల్లో కూడా మిళితమై, ఒక్కటిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై పోటీకి దిగాలని సవాల్‌ చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా సరే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద, ఆయన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం ఏమిటో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరూపిస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికలను పార్టీ రహితంగా జరుపుతాం.. ఆ తరువాతి ఎన్నికల గురించి ఆలోచిస్తాం అంటూ మీనమేషాలు లెక్కించవద్దని సూచించారు. ప్రభుత్వానికి దమ్మూ, సత్తా ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భూమన డిమాండ్‌ చేశారు.

ఎంతసేపూ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి, దాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయమే కాంగ్రెస్‌, టిడిపిల్లో ఉందని భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. సహకార ఎన్నికల్లో గెలిచినట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడిందో ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. ఒక్కొక్క ఓటుకు రూ. 5 వేలు ఇచ్చి, పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని గెలుస్తారనుకున్న వారిని ఆ ఎన్నికల నుంచి దూరం చేసి, కొత్త ఓటర్లకు అవకాశం ఇవ్వని వైనాన్ని భూమన గుర్తుచేశారు. సహకార ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ మరింతగా పలుచనైంది, చులకన అయిందని ఆయన ఎద్దేవా చేశారు. కప్పదాట్ల వేసి ఎన్నికలు నిర్వహించకూడదనే కుటిలనీతిని ఉపయోగించవద్దని కిరణ్‌కుమార్‌రెడ్డికి భూమన సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాక్షేత్రంలో విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌, టిడిపి తోడు దొంగలు కాబట్టి, సభ్యుల బలం ఉంది కనుక అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా మహానేత వైయస్‌ఆర్‌ను, ఆయన కుటుంబాన్ని అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా మాట్లాడాయని భూమన నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలూ మంది బలంతో ఆనందపడవచ్చేమో, ఆలింగనాలు చేసుకోవచ్చేమో గాని రాష్ట్రంలోని 9 కోట్ల మంది ప్రజలు వాటి తీరును నిశితంగా గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. మహానేత నాటి సువర్ణ యుగాన్నితీసుకువచ్చేది శ్రీ జగన్‌ ఒక్కరే అన్న విశ్వాసంతో ప్రజలు ఉన్నారన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వల్లే అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయని వారంతా నమ్ముతున్నారన్నారు.

'ప్రజా క్షేత్రంలోకి రండి, ప్రజా కోర్టులో తేల్చుకుందాం కాంగ్రెస్‌, టిడిపిలు కలసి రండి, కదిలి రండి అని భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ చేశారు.
Back to Top