దమ్ముంటే రుజువు చేయండి

విజయవాడ, 9 ఫిబ్రవరి 2013: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై టిడిపి, బిజెపిలు చేస్తున్న ఆరోపణలను వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు.‌ మహానేత తనయ శ్రీమతి షర్మిల, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌పై ఆ పార్టీలు చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని ఆయన సవాల్‌ చేశారు. బ్రదర్‌ అనిల్‌కుమార్‌పై అసత్య ఆరోపణలు చేయడం ద్వారా క్రిస్టియన్ల మనోభావాలను బిజెపి దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడవద్దని ఆయన బిజెపి రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు హితవు పలికారు. పెద్దవాళ్ళ మీద ఆరోపణలు చేస్తే మీ లాంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళయిపోతారనుకోవడం శుద్ధ భ్రమే అన్నారు. వైయస్‌ కుటుంబంపై అసత్య వ్యాఖ్యలు చేస్తున్న బిజెపి, టిడిపి తీరును జూపూడి శనివారం సాయంత్రం విజయవాడలో మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని బిజెపి జాతీయ నాయకురాలు ఒక రకంగా మాట్లాడితే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంటారని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమ్మకుండా ఉంటారని, అయితే బిజెపి అధికార ప్రతినిధి పేరుతో ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌ వక్ర విన్యాసాలు చేస్తున్నారని జూపూడి దుయ్యబట్టారు. మహానేత మరణించిన మూడేళ్ళ తరువాత టిడిపి వాళ్ళు దులిపేసుకున్న అంశంపైన భుజానికెత్తుకుని బిజెపి ప్రభాకర్‌ చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించారు. బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ మణికొండలో చాలా తక్కువ ధరకు 4 ఎకరాల స్థలం తీసుకుని, 500 మంది పిల్లలకు హాస్టల్‌ పెడతానని చెప్పి చర్చి కట్టించుకున్నారని ఆరోపించడాన్ని తప్పుపట్టారు. అక్కడ వృద్ధాశ్రమం పెడతానని అన్నారని అదీ పెట్టలేదని అంటూ ఇంతకాలమూ కుంభకర్ణుడిలా నిద్రపోయిన ప్రభాకర్‌ గగ్గోలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ఇచ్చిన తృణాన్నో, ఫలాన్నో తీసుకుని ప్రభాకర్ శ్రీమతి షర్మిల చేస్తున్న రెండవ విడత పాదయాత్రకు సిద్ధమవుతున్న సందర్భంగా చేసిన అసందర్భ ప్రేలాపన‌లు చేశారని దుమ్మెత్తిపోశారు. బిజెపి ప్రభాకర్‌ ప్రేలాపనలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. క్రిస్టియానిటీ ఒక మతం అనుకుంటే పొరపాటు అన్నారు. బైబిల్‌ మతం కాదన్నారు. అది ఒక జీవనమార్గం అన్నారు. దీన్ని బ్రదర్‌ అనిల్‌ ప్రజలకు తెలియజెప్పే మార్గంలో ఉన్నారన్నారు. అయితే, ప్రభాకర్‌ వ్యాఖ్యలు క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి నాయకులు చంద్రబాబు పలుకులను వంటబట్టించుకుని వైయస్‌ కుటుంబంపై చేస్తున్న విమర్శలను ఈ రాష్ట్ర ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని జూపూడి విజ్ఞప్తి చేశారు.

నాలుగు ఎకరాల భూమి విషయంలో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ వచ్చి సమాధానం చెప్పాలని ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్‌ డిమాండ్‌ చేయడాన్ని ‌తీవ్రంగా తిప్పికొట్టారు. కోన్‌ కిస్కా, గొట్టంగాళ్ళు ఒక చెత్తపేపర్‌ను, డస్టుబిన్‌లో ఉన్న పేపర్‌ను తీసుకొచ్చి సమాధానం చెప్పాలని అడుగుతున్నారని నిప్పులు చెరిగారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైయస్‌ కుటుంబం తరఫున తాను చెబుతున్నానని, ఐటి విభాగానికి వైయస్‌ కుటుంబ సభ్యులే సంతకాలు పెట్టి ఇచ్చిన పత్రాలను ఇప్పుడు తీసుకువచ్చి ప్రజలకు చెప్పేదేమి ఉందో అని ఎద్దేవా చేశారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో కొత్తదనమేముందని నిలదీశారు. వైయస్‌ కుటుంబం అక్కడక్కడ ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేయవచ్చేమో అని, వ్యాపారాలు చేయకూడదని రాజ్జాంగంలో ఎక్కడైనా రాసి ఉందా? అని జూపూడి ప్రశ్నించారు. గడ్కరీ వ్యాపారాలు చేసుకోవచ్చు, వెంకయ్యనాయుడు మాత్రమే ఆస్తులు సంపాదించుకోవచ్చనుకుంటున్నారా? అని నిలదీశారు.‌ మతప్రచారకుడిగా ఉన్న బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ వ్యాపారాలు చేయకూడదని ఎవ్వరు చెప్పారని ఆయన కస్సుమన్నారు. అనిల్‌ కుమార్‌ బైబిల్‌ను ప్రచారం చేసినంతమాత్రాన, ఒక సత్యాన్ని దేశానికి చెప్పినంతమాత్రాన ఎక్కడా వ్యాపారం చేయకూడదని ఏమీ లేదే అన్నారు.

నాలుగు ఎకరాల భూమిని బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ 33 ఏళ్ళకు లీజుకు తీసుకుని మానవతా దృక్పథంలో ఒక చారిటీని, ఒక చర్చిని, ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారని జూపూడి వివరించారు. ఒక వేళ బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే, మీకు ఈ పేపర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఆఫీసులో ఆ మొత్తాలకు సంబంధించిన వివరాలూ దొరుకుతాయని అన్నారు. వేల కోట్లు అని గాలిలో ఆరోపణలు చేస్తున్నారన్నారు. ట్రక్కులో ఎంత డబ్బు పడుతుందని, కారులో ఎంత పడుతుంది, సుజనా చౌదరి తండ్రి సింగపూర్‌లో ఎంత పెట్టారు, లేకపోతే చంద్రబాబు బినామీలు ఏ బ్యాంకులో ఎంతుంది, వాళ్ళ స్కార్పియో పోతే ఎన్ని డబ్బులు పడతాయి, లారీలో అయితే ఎన్ని పడతాయనే విషయంలో చంద్రబాబు డాక్టరేట్‌ చేశారని దుయ్యబట్టారు.

'ఛీ' మీరు మాకు అవసరం లేదని పొమ్మంటే, 2004 నుంచి 2009 వరకూ జరిగిన 41 ఎన్నికల్లో, ప్రత్యేకించి వైయస్‌ఆర్‌ మరణించిన తరువాత ఒక్క ఎన్నికలో కూడా గెలవకుండా, ఈ రాష్ట్రానికి మీరు పనికిరారంటే సిగ్గు లేకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తూ తప్పులు మాట్లాడుతున్నారని జూపూడి ఎద్దేవా చేశారు. బైబిల్ పట్టుకుని శ్రీమతి విజయమ్మ ప్రసంగిస్తున్నారని వ్యాఖ్యానించే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నాంచారు. చంద్రబాబు మాటలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మకపోవడంతో దొంగ మార్గాన్ని ఎంచుకుని బిజెపి వారి చేత ఆరోపణలు చేయిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. దమ్ముంటే ఈ ఆరోపణలపై చేతనైతే నిరూపించాలని జూపూడి ప్రభాకర్‌ సవాల్‌ చేశారు.

కిరణ్‌ కుమార్‌రెడ్డి చేయకపోతే తాను రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు చెబుతుండడాన్ని జూపూడి నిలదీశారు. ఈ రాష్ట్రానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. వైయస్‌ కుటుంబం పట్ల వెల్లువెత్తుతున్న అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వక్రమార్గలో టిడిపి, బిజెపిలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Back to Top