దమ్ముంటే ములాఖ‌త్‌లపై విచారణ చేయించండి

హైదరాబాద్, 16 ఏప్రిల్‌ 2013: శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలులో ములాఖత్‌లపై ఆరోపణలు చేస్తున్న ‌కాంగ్రెస్‌ నాయకులకు దమ్ముంటే విచారణ చేయించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌చేసింది. కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ కుమ్మక్కై, కుట్ర చేసి శ్రీ జగన్‌ను జైలులో నిర్బంధించాయని దుయ్యబట్టింది. శ్రీ జగన్‌ను జైలులో పెడితే పార్టీ తమ గడుస్తుందనుకున్న ‌ఆ రెండు పార్టీలకూ ప్రజలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దని గుర్తుచేసింది. శ్రీ జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకునే వారినే ప్రజలు శాశ్వతంగా దూరం చేస్తారని హెచ్చరించింది. శ్రీ జగన్‌పై చాలా పెద్ద కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. జైలులో ములాఖత్‌లు చేస్తున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై పార్టీ శానసన సభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శోభా నాగిరెడ్డి మాట్లాడారు.

ఎదుర్కొనే దమ్ము లేకే కుట్రలు :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్‌, టిడిపిలు కలిసి పెద్ద కుట్రే చేస్తున్నాయని ప్రజలకు, మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి‌ని అభిమానించే వారందరికీ అనుమానం కలుగుతోందని శోభా నాగిరెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం టిడిపి గత వారం రోజులుగా శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు, సుప్రీంకోర్టులో బెయిల్‌ నెంబర్ వచ్చిన తరువాత చేసిన ఆరోపణలు, ములాఖత్‌లపై చేసిన ఆరోపణలు ఈ అనుమానాన్ని దృఢ పరుస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌, టిడిపి నాయకులు ఒకే మాటలు మాట్లాడుతున్నారని, వాటినే ఆ పార్టీల అనుకూల పత్రికలు మొదటి పేజీలో ప్రచురిస్తున్నాయని, చానళ్ళలో వేస్తున్నారని శోభా నాగిరెడ్డి విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఎన్ని కుట్రలు చేస్తున్నారో తెలుస్తూనే ఉందన్నారు.

కుటుంబ సభ్యులు కలిసినా సహించలేకపోతున్నారు :
శ్రీ జగన్‌ జైలు ములాఖత్‌లపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎం.పి. హనుమంతరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్‌ చేయడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. అధికారం తమ చేతుల్లోనే ఉంది కదా.. దమ్ముంటే విచారణ చేయించాలని సవాల్‌ చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు కలుసుకున్నా సహించలేని నీచమైన స్థితికి కాంగ్రెస్‌, టిడిపి నాయకులు దిగజారిపోయారని ఆమె దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ను జైలులో పెట్టిన తరువాత ప్రజల నుంచి మరింతగా మద్దతు పెరిగిందని ఆమె అన్నారు. తమకు వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు ఓటు వేస్తున్నారో తెలుసుకునే ఇంగితజ్ఞానాన్ని కూడా ఆ పార్టీల నాయకులకు కోల్పోయారని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు నేతృత్వంలోని టిడిపిని వదిలేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి ఎందుకు వస్తున్నారో తెలియడం లేదా అన్నారు. శ్రీ జగన్‌ జైలులో ఉన్నా కట్టడి చేయలేకపోతున్నామనే వారు ములాఖత్‌లను కూడా రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు.

శ్రీ జగన్‌ గాలి పీల్చుకున్నా రాజకీయమేనా? :
ములాఖత్‌లపై జైళ్ళ శాఖ డిజి కృష్ణరాజు వివరణ ఇచ్చారని, నిబంధనలను ఉల్లంఘించినట్లు నిరూపించాలంటూ ఆయన చేసిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఆరోపణలు చేస్తున్న వారికి ఉందా? అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. శ్రీ జగన్‌ గాలి పీల్చుకోవడాన్ని కూడా విమర్శించే స్థాయికి కాంగ్రెస్‌, టిడిపి నాయకులు దిగిపోయారని దుయ్యబట్టారు. నిజానికి శ్రీ జగన్‌ శిక్ష పడిన ఖైదీ కాదని, కేవలం విచారణ కోసమే ఆయన అక్కడ ఉన్నారన్నారు. సిబిఐని అడ్డుపెట్టుకుని దేశంలో మరెక్కడా లేని విధంగా విచారణ నెపంతో 11 నెలలుగా ఆయనను జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత నిర్దాక్షిణ్యమైన సంఘటన దేశంలో ఇదే తొలిసారి అన్నారు. శ్రీ జగన్‌ కేసు విషయంలో కేంద్రం నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సిబిఐ డైరెక్టరే చెప్పిన వైనాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. యుపిఎకు మద్దతు ఉపసంహరిస్తామన్న గంటలోనే కరుణానిధి కుమారుడి ఇంటిపైన, ఆస్తుల పైన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడులు చేయించిందని, కర్నాటకలో గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిందని ఆమె విమర్శించారు. ఆ విధంగానే సిబిఐని బూచిగా చూపించి చంద్రబాబును కూడా కాంగ్రెస్‌వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.

తెర వెనుక బాగోతానికి తావేదీ? :
దేశంలో మరెక్కడా చేయనంత వేగంగా, ఆగమేఘాల మీద సిబివ అనేక బృందాలతో శ్రీ జగన్‌ ఆస్తులపై దాడులు, తనిఖీలు చేసిన వైనాన్ని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. కాంగ్రెస్‌, సిబిఐ కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. దివంగత మహానే వైయస్‌ ఒత్తిడి చేసి వివాదాస్పద జిఓలపై సంతకాలు చేయించారని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఎఎస్‌ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాము ఒత్తిడితో చేసినట్లు ఒక్క ముక్క కూడా చెప్పని వైనాన్ని ఆమె ప్రస్తావించారు. నిబంధనలకు అనుగుణంగానే తాము ఆ జిఓలు చేశామన్న విషయం గుర్తుచేశారు. ఇక 'తెర వెనుక బాగోతం' జరిగే అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌, టిడిపి పునాదులు కూలడం ఖాయం :
ఈ సారైనా అధికారంలోకి రాకపోతే టిడిపి ఆఫీస్‌ మూసేసుకోవాలని చంద్రబాబే చెబుతున్నారని శోభా నాగిరెడ్డి ఉటంకించారు. తమకు జరగకపోయినా పరవాలేదు కానీ శ్రీ జగన్‌కు మేలు జరగకూడదన్న పరిస్థితికి కాంగ్రెస్‌ నాయకులు వచ్చారని శోభా నాగిరెడ్డి విమర్శించారు. వందేళ్ళు పైబడిన కాంగ్రెస్‌ను, ముప్పై ఏళ్ళ టిడిపి పునాదులు కూడా లేకుండా చేసే శక్తి శ్రీ వైయస్‌ జగన్‌కు ఉందని ఆమె పేర్కొన్నారు. జైలులో ఉన్నా‌శ్రీ జగన్ అంటే ఆ పార్టీల నాయకులకు హడల్‌ అన్నారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కంటే ఇప్పుడు పిసిసి, ఎఐసిసి సూత్రాలనే ఐపిసిగా అమలు కాంగ్రెస్‌వారు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్న చంద్రబాబును కాంగ్రెస్‌ నాయకులు మహా అయితే మరో ఆరు నెలల పాటు కాపాడగలరని ఆమె అన్నారు. ప్రజా క్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఆ పత్రికలు, చానళ్ళలో వచ్చిందే మాట్లాడుతున్నారు :
ఇలా ఉండగా, పది రోజులుగా శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పెద్ద కుట్రే జరుగుతోందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. శ్రీ జగన్‌తో కలిసి రావాలనుకుంటున్న వారితో సిఎం కిరణ్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వారిని బుజ్జగిస్తున్నారని తెలిపారు. టిడిపిలో కూడా చంద్రబాబు అదే మాదిరిగా చేస్తున్నారన్నారు. ఆ మాటల సందర్భంగా శ్రీ జగన్‌ను ఈ రాష్ట్రం నుంచే తరలిస్తున్నామని కిరణ్‌ చెబుతున్నారన్న సమాచారం వస్తోందన్నారు. 'జగన్‌కు బీహారా?.. తీహారా?..' అంటూ కిరణ్‌ తన పత్రికలో రాయించుకున్నారని, చానళ్ళలో చెప్పించుకున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. పత్రిక, చానల్‌లో వచ్చిన కథనాలనే కాంగ్రెస్‌, టిడిసి నాయకులు మాట్లాడుతున్న వైనాన్ని ఆమె తప్పుపట్టారు.

శ్రీ జగన్‌ కేసు విషయంలో ఒక్కటే చార్జిషీట్‌ వేస్తామని చెప్పిన సిబిఐ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తోందని శోభా నాగిరెడ్డి ఒక విలేకరి ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇన్ని అనుబంధ చార్జీ షీట్లు వేసిన సందర్భం దేశంలో కేవలం శ్రీ జగన్ కేసులోనే అన్నారు. ఎన్ని చార్జిషీట్లు వేయాలి, ఎంత ఆలస్యం చేయాలన్న విషయాలు కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు ముందే తెలుస్తోందని మరో ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.
Back to Top