దమ్ముంటే అవిశ్వాసం పెట్టండి: బాబుకు సవాల్

హైదరాబాద్‌, 8 సెప్టెంబర్‌ 2012: తెలుగుదేశం పార్టీకి దమ్మూ ధైర్యం ఉంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజునే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్‌, వాసిరెడ్డి పద్మ, హెచ్‌ఏ రెహ్మాన్‌ సవాల్‌ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జన హృదయాల్లోకి చొచ్చుకువెళుతున్న ప్రతిసారీ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏదో ఒక పార్టీతో కలిసిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని వారు దుయ్యబట్టారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో, ఎవరి మద్దతుతో ఎవరు మనుగడ సాగిస్తున్నారో తేలాలంటే ఈ నెల 17 ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వారు సవాల్‌ చేశారు. అవిశ్వాసం పెడితే తమ పార్టీ విధానం ఏమిటో, బాధ్యత ఏమిటో అప్పుడు తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్‌పార్టీలో వైయస్‌‌ఆర్‌సిపి విలీనం అయిపోతుందంటూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐలో కథనం రావడాన్ని పార్టీ అధికార ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు వారు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గురు, శుక్రవారాల్లో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన 'ఫీజు దీక్ష'కు విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని, వేలాది మంది దీక్షా స్థలికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించారని బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా బంధించి జైలులో పెట్టినా జనం మధ్యనే తాను ఉంటానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారన్నారు. జగన్‌ మాటకు కట్టుబడిన మాతృమూర్తి విజయమ్మ కూడా రాత్రీ పగలూ అనకుండా నిరంతరం జనం మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్‌ నిర్వహించే దీక్షలకు లక్షలాది మంది వచ్చి సంఘీభావం చెబుతున్నారన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభమైంది మొదలు ఎక్కడా అపజయం లేకుండా విజయవంతంగా నడుస్తున్నదని, అలాంటి పార్తీకి ఇతర పార్టీలలో విలీనం కావాల్సిన అగత్యం ఏమిటని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌, విజయమ్మ బ్రహ్మాండమైన మెజారిటీలతో విజయాలు సాధించారు. మొన్నటి ఉప ఎన్నికలలో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా 17 చోట్ల తమ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారని చెప్పారు. కడప ఉప ఎన్నికల సమయంలో కూడా తమ పార్టీ బీజేపీతో కలిసిపోతుందంటూ దుష్ప్రచారం చేశారని, ఫీజు దీక్షకు జనం బ్రహ్మరథం పట్టడంతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో విలీనం అయిపోతున్నదంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్గం చేశారు. ఇలా ఎప్పుడు తమకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించినా కొన్ని పార్టీలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని నిప్పులు చెరిగారు. ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా తమ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. జైలు నుంచి జగన్‌ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా బయటికి వస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దుశ్చర్యలను ఇకపై సాగనివ్వబోమని బాజిరెడ్డి హెచ్చరించారు.

పిఆర్‌పి దౌర్భాగ్యం మాకు పట్టలేదు :
ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి తమ వెనుక మదర్‌ థెరెస్సా, జ్యోతిరావు ఫూలె, అంబేద్కర్‌ చిత్రాలు పెట్టుకున్నారని, తమ పార్టీని కాంగ్రెస్‌ విలీనం చేసిన తరువాత వాటిని తీసేసి సోనియా, రాహుల్‌ బొమ్మలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి అలాంటి దుర్గతి పట్టలేదని అన్నారు. అలా తమ పార్టీ వేరే నీడలో ఉండాల్సిన అగత్యం లేదన్నారు.

మీడియాలోనూ కోవర్టులా ! :
మీడియాలో కూడా కోవర్టులు తయారయ్యారని బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఫీజు దీక్ష సందర్భంగా నిన్న, మొన్న పలు చానళ్ళకు, మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చారన్నారు. ఆ సందర్భంగా ఆమె పిటిఐ విలేకరి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు. 'మీరు భవిష్యత్తులో 
కాంగ్రెస్‌లో విలీనం అవుతారా?' అని ప్రశ్నించారని తెలిపారు. ఆ ప్రశ్నకు విజయమ్మ సమాధానం ఇస్తూ, తమ పార్టీ విధానాన్ని జగన్మోహన్‌రెడ్డి గతంలోనే స్పష్టం చేశారని, ఇప్పటికీ అదే స్టాండ్‌ మీద ఉన్నామని చెప్పారన్నారు. అయితే, ఆ విలేకరి విజయమ్మను పదే పదే అదే ప్రశ్న వేసినప్పుడు 'భవిష్యత్తు నిర్ణయిస్తుంద'ని చెప్పారన్నారు. దానికి ఎంతో గొప్ప పేరున్న పిటిఐ విలేకరి కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విలీనం కాబోతున్నదనే అర్థం వచ్చేలా వార్తా కథనం అల్లి రాశారని దుయ్యబట్టారు. ఆ విలేకరి తీరు కారణంగా పిటిఐలో కూడా కోవర్టులున్నారని భావించాల్సి వస్తుందన్నారు. తాను అలా చెప్పలేదని విజయమ్మ స్వయంగా ఖండన ఇచ్చినా ప్రచురించలేదని దుయ్యబట్టారు. గౌరవనీయమైన స్థానంలో ఉన్న పిటిఐ కూడా తమ పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదన్నారు.

ఫీజు దీక్ష విజయవంతం : వాసిరెడ్డి పద్మ :
తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన రెండు రోజుల ఫీజు దీక్ష విజయవంతమైందని మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. పిటిఐలో వచ్చిన వార్తా కథనం వంకతో వైయస్‌ఆర్‌సిపి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా ఎడతెరిపి లేకుండా ప్రసారాలు చేసిందని పద్మ నిప్పులు చెరిగారు. విజయమ్మ స్వయంగా ఖండన ఇచ్చినా పట్టించుకోకుండా ఎలాంటి సందర్భం వచ్చినా ఆ మీడియా దుష్ప్రచారం చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. తమ పార్టీ జనంలో ముమ్మరంగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా ఆ మీడియా సంస్థలు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని అన్నారు. ఇంతకు ముందు ఉప ఎన్నిక సందర్భంగా విజయమ్మ ముమ్మరంగా ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో కూడా వైయస్‌ఆర్‌ సిపి కాంగ్రెస్‌ విలీనం అయిపోతోందంటూ ప్రచారం జరిగిందని అన్నారు. మత తత్వ పార్టీలు తప్ప ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతామని జగన్‌ గతంలోనే చెప్పారన్న విషయాన్న ఈ సందర్భంగా పద్మ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టరని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.

టిడిపిలోనే వెయ్యి గొడవలున్నాయి : హెచ్‌ఏ రెహ్మాన్‌ :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి చిలువలు పలవలు మాట్లాడే తెలుగుదేశం పార్టీలోనే వెయ్యి గొడవలున్నాయని హెచ్‌ఏ రెహ్మాన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కలిసిపోతుందంటూ ఇష్టంవచ్చిన రీతిలో మాట్లాడుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి టిడిపి నుంచి తమ పార్టీలో ఎంత మంది చేరిపోతున్నారో తెలుసా అని ప్రశ్నించారు. టిడిపి నుంచి వలస వస్తున్న వారి జాబితాపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరోలో కూడా చర్చ జరిగిన విషయం తనకు తెలిసిందన్నారు. ఢిల్లీలోని ఏపి భవన్‌లో వైయస్‌ డైరీని ఆవిష్కరించిన కాంగ్రెస్‌ నాయకులు ఆయన విగ్రహాన్ని అక్కడ ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
Back to Top