సీఎం కిరణ్‌ ద్వంద్వ విధానాలు

హైదరాబాద్, 2 నవంబర్ 2013:

రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బేల మాటలు, జాలి మాటలు మాట్లాడారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఆయన పనిచేస్తున్నది సోనియాగాంధీ ఆదేశాల మేరకు అని, జాలి చూపెట్టేది ప్రజల మీద అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సోనియా విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. మెజారిటీ ప్రజల అభిమతమైన సమైక్యవాదానికి నాయకుడిగా చెప్పుకుంటూ.. విభజనకు అనుకూలంగా పనులు చేస్తున్నారని విమర్శించారు. ఆచరణకు వచ్చేసరికి విభజించడానికి తొందరపడుతున్నారని, మాటలేమో తాను సమైక్యాంధ్ర కోసం ఉన్నానంటున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గట్టు మాట్లాడారు.

సమైక్యవాదినని చెప్పుకుంటూనే సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తూ, తూట్లు పొడుస్తూ, బలహీనపరుస్తూ విభజనకు తీవ్రంగా కృషి చేస్తున్న వ్యక్తి కిరణ్‌కుమార్‌రెడ్డి అని గట్టు ఆక్షేపించారు. సోనియా ఆదేశాల మేరకు విభజన ప్రక్రియను సులువుతరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సమైక్యవాది అయితే.. సోనియా గాంధీ విభజనవాది అయితే.. తెలంగాణ వారు సోనియాకు కృతజ్ఞతలు చెప్పడమంటే.. ఇందిరాగాంధీని అవమానించడమేనా? అని గట్టు ప్రశ్నించారు. జై ఆంధ్ర, జై తెలంగాణ పేరుతో గతంలో 80 శాతం మంది విభజనను కోరుకున్నా సమైక్యవాదిగా నిక్కచ్చిగా తిరస్కరించిన వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు. ఇందిరాగాంధీ వారసులైతే.. సోనియా నిర్ణయాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్‌ నాయకులకు గట్టు సూచించారు.

టిడిపి, కాంగ్రెస్‌ల మధ్య మన రాష్ట్రంలో దోబూచులాట జరుగుతోందని గట్టు ఆరోపించారు. ఆ రెండు పార్టీలూ కూడా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామర్శించడానికి సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ రాజకీయాలకు అతీతంగా వెళితే.. ప్రజలు ఆదరిస్తుంటే.. పోలీసులను పెట్టి కిరణ్‌కుమార్ అరెస్టు చేసి తీసుకువ‌చ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న శ్రీమతి విజయమ్మను అరెస్టు చేసి తీసుకువస్తారా? అసలు సమైక్యవాదో, విభజనవాదో తెలియకుండా వెళ్ళిన చంద్రబాబుకేమో 300 మంది పోలీసులతో, ప్రత్యేకమైన భద్రతతో, రెడ్‌కార్పెట్‌ వేసి మరీ తీసుకువెళతారా? అని నిలదీశారు. శ్రీమతి విజయమ్మను రావద్దని చెప్పి అరెస్టు చేసి తీసుకువచ్చిన ప్రాంతానికే చంద్రబాబును తీసుకువెళ్ళారని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు మీద కాంగ్రెస్‌కు ఎందుకింత ప్రేమో ప్రజలందరికీ తెలుసని గట్టు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, టీడీపీల డ్రామాల కోసం రాష్ట్రాన్ని బలిపెడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కొక్క కమిటీని ఒక్కో కత్తిలా చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు నరుకుదామా? అనే పరిస్థితే కనిపిస్తోందన్నారు. సోనియా ఇంటి ముందు చంద్రబాబు చేసిన ధర్నా దేనికోసమో సీఎం కిరణ్‌ అయినా చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదా చంద్రబాబు నాయుడితో అయినా చెప్పించాలన్నారు. విభజనవాదో, సమైక్యవాదో చెప్పని చంద్రబాబు మాత్రం స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరుగుతున్నారని అన్నారు.

తాను  వేసిన కొన్ని ప్రశ్నలకు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేసిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ మంత్రులకు మరోసారి ప్రశ్నిస్తున్నానన్నారు. నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమా‌ర్‌రెడ్డి రాష్ట్ర మంత్రులా? లేక జిల్లాకు మాత్రమే మంత్రులా? అని గట్టు ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు తీసుకుంటూ, ఫైళ్ళ మీద సంతకాలు చేస్తూ.. తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలా చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమా? కాదా? అన్నారు. మీరసలు మంత్రులుగా పనికొస్తారా? మిమ్మల్ని ఎందుకు బర్తరఫ్‌ చేయకూడదన్నారు. సీఎం ఎందుకు బర్తరఫ్‌ చేయరని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఎందుకు డిమాండ్‌ చేయరన్నారు.

రాజ్యాంగాన్ని రక్షిస్తానంటూ ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులు దానిని ఉల్లంఘించి, మానవ హక్కులను కాలరాచి, పౌరహక్కుల మీద దాడి చేసి ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలినే అడుగుపెట్టనివ్వవద్దంటూ పిలుపునివ్వడం ఏమిటని గట్టు నిప్పులు చెరిగారు. తుపాను కారణంగా బాధపడుతున్న వారికి మేలుచేయమని శ్రీమతి విజయమ్మ కోరడం హుంకరించడం అవుతుందా? అని జానారెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చీల్చకూడదని చెప్పడం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ జానా ప్రతినిధి కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారిలో ఒక్కరు మాత్రమే కానీ, సమైక్యంగా ఉంచాలనుకునే వారికి జానా ప్రతినిధి కాదన్నారు. దొంగ విభజనవాది జానారెడ్డి అని గ‌ట్టు రామచంద్రరావు విమర్శించారు. ఇంతకు ముందు తెలంగాణ ఫ్రంటు పెట్టి, దానికి కన్వీనర్‌గా ఉండి మంత్రి పదవి రాగానే ఫ్రంటును గంగలో ముంచిన జానా మంత్రి పదవిని అనుభవించి, తెలంగాణ వాదాన్నే వదిలిపెట్టారని విమర్శించారు.

విభజన, సమైక్యం అనేవి రెండు వాదాల మధ్య ఘర్షణే తప్ప రెండు ప్రాంతాల మధ్య కాదని గట్టు అన్నారు. తుపాను వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పరామర్శించమని తెలంగాణ ప్రాంతంవారిగా శ్రీమతి విజయమ్మను తాము ఆహ్వానించామన్నారు. జానారెడ్డికి దమ్ముంటే.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాను ముంపు ప్రాంతాలకు తీసుకురావాలని, సహాయం చేయించాలని గట్టు సవాల్‌ చేశారు. తెలంగాణావాదినని చెప్పుకుంటున్న జానారెడ్డి మరణించిన వెయ్యి మందిలో ఎంతమంది ఇళ్ళకు వెళ్ళి పరామర్శించారో చెప్పాలని నిలదీశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక, దుగ్ధతో శ్రీమతి విజయమ్మ పర్యటనను అడ్డుకున్నారని తూర్పారపట్టారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావానికి సీమాంధ్ర నుంచి లక్షలాది మంది వచ్చారని, తెలంగాణ నుంచి కూడా వేలాది మంది హాజరయ్యారని గుర్తుచేశారు. తెలంగాణలో వైయస్ఆర్‌సిపి లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఆ సభకు హాజరైన జనం చెంపపెట్టు అన్నారు. ఖమ్మంలో శ్రీమతి విజయమ్మ పర్యటనకు విశేష ఆదరణ రావడం, నల్గొండలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చిన తీరు చూసి ఆమెను పోలీసులతో అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకురావడాన్ని పిరికిపంద చర్య అని గట్టు అభివర్ణించారు.

కిరణ్‌ శల్య సారథ్యం :
కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే.. వచ్చిన అవకాశాలన్నింటినీ ఎందుకు వదులుకున్నారని గట్టు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి పిలిచినప్పుడే పదవికి రాజీనామా చేసి ఉంటే.. కిరణ్ నిజంగా సమైక్యవాది అని నమ్మి ఉండేవారన్నారు. విభజన నిర్ణయం జరిగిపోయిన నెల రోజుల తరువాత సమైక్యవాదాన్ని కిరణ్‌ మొదలుపెట్టడమేమిటని నిలదీశారు. ముందే అసెంబ్లీని సమావేశపరిచి, విభజనకు అనుకూలంగా లేం అని తీర్మానం చేసి కేంద్రానికి పంపించమని వైయస్ఆర్‌సీపీ చేసిన విజ్ఞప్తిని కిరణ్‌ పెడచెవిన పెట్టారని అన్నారు. సమైక్యవాదానికి ఉపయోగపడే దేనినీ చేయరని, విభజనకు ప్రయోజనం కలిగేలా చేస్తారన్నారు. యుద్ధంలో శల్యుని మాదిరిగా కిరణ్‌కుమార్‌రెడ్డి శల్య సారథ్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ.. అబద్ధాల మీద బ్రతికేస్తున్నారని గట్టు నిప్పులు చెరిగారు. ఆయన వందిమాగధుల్లోని వర్ల రామయ్య చంద్రబాబును దూషిస్తున్నారో, ప్రజల్ని తిడుతున్నారో, ఇతర పార్టీలను అంటున్నారో తనకు ఏమీ అర్థం కాలేదన్నారు. సమైక్య శంఖారావానికి అనుమతి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్‌తో శ్రీ జగన్‌ కుమ్మక్కయ్యారట.. శ్రీమతి విజయమ్మగారిని అరెస్టు చేశారు కాబట్టి మళ్ళీ కుమ్మక్కయ్యారట.. అరెస్టు చేశారు కాబట్టి కుమ్మక్కయ్యారు.. తిట్టారు కాబట్టి కుమ్మక్కయ్యారు.. తిట్టలేదు కాబట్టి కుమ్మక్కయ్యాంటూ వర్ల చేస్తున్న ఆరోపణలకు అర్థమేమైనా ఉందా? అన్నారు.

చంద్రబాబుకు రెడ్‌కార్పెట్‌ వేసి, నల్గొండ జిల్లాకు తీసుకుపోతే కుమ్మక్కు కానట్టట! చంద్రబాబు కుమ్మక్కైతే దానిని వేరే వారికి ఆపాదించడం సరికాదని వర్ల రామయ్యకు గట్టు హితవు పలికారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసుల నుంచి బయటపడింది చంద్రబాబు అన్నారు. పదహారు నెలల పాటు అకారణంగా జైలు శిక్ష అనుభవించింది శ్రీ జగన్‌ అన్నారు. విచారణను ఎదుర్కొంటున్నది శ్రీ జగన్‌ అయితే... దానిని తప్పించుకుంటున్నది చంద్రబాబు అన్నారు. వర్లకు అసలు మతి భ్రమించిందా అని గట్టు అనుమానం వ్యక్తంచేశారు. టిడిపికి జనాదరణ లేదని, ఇక రాదని పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం దాకా, ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ దాకా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వైయస్ఆర్‌సీపీలోని ఏ కార్యకర్తనడిగినా చెబుతారని గట్టు స్పష్టంచేశారు. ద్వంద్వప్రమాణాలు పాటించే గతి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు పట్టలేదన్నారు. విభజనవాదానికి కట్టుబడి ఉన్నామని ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులూ చెప్పగలరా? అని గట్టు ప్రశ్నించారు. సమైక్యానికి అనుకూలంగా పయ్యావుల కేశవ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తే.. ఎర్రబెల్లి దయాకరరావు ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని నిలదీశారు. దేనికోదానికి కట్టుబడి ఉండాలి కాని ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు గట్టు సూచించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం సరికాదని కిరణ్, చంద్రబాబు, వారి వందిమాగధులకు గట్టు స్పష్టంచేశారు.

Back to Top