చిలుకూరుకు ఐటి విభాగం పాదయాత్ర

హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ ఐటి విభాగం ఆదివారం (23-9-12) రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వరకూ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్సులోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటి విభాగం కన్వీనర్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి కళంకమూ లూకుండా నిర్దోషిగా త్వరగా విడుదల కావాలని చిలుకూరు బాలాజీ స్వామిని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి వివరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు.

నేరాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ చూపించకుండానే సిబిఐ కుట్ర చేసి మరీ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిందని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై 90 రోజులు దాటిపోయినప్పటికీ ఆయనకు బెయిల్‌ రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. చార్జిషీట్లను సాకుగా చూపిస్తూ రాజ్యాంగ హక్కులను సిబిఐ కాలరాస్తున్నదని, ఇబ్బందులకు గురిచేస్తున్నదని నిప్పులు చెరిగారు.

ఐటి రంగానికి చేయూతనిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథంలో నడిపించిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచే జననేత జగన్మోహన్‌రెడ్డి మాత్రమే మళ్ళీ స్వర్ణయుగాన్ని తీసుకురాగలరని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి విడుదల కోసం ఐటి ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ పాదయాత్రలో పార్టీ ఐటి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు హైదరాబాద్‌ నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఐటి ఉద్యోగులు, వైయస్‌ఆర్‌ అభిమానులు సుమారు 1000 మంది పాల్గొంటున్నారని ప్రకటనలో వివరించారు.


Back to Top