‌చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సిబిఐ

హైదరాబాద్, 30 మే 2013:

కాంగ్రెస్‌, టిడిపిల చేతిలో సిబిఐ కీలుబొమ్మలా మారి, తొత్తులా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న సిబిఐ తీరుకు వ్యతిరేకంగానే తమ పార్టీ నిరసన కార్యక్రమాలు రూపొందుతున్నాయన్నారు. ఒక ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఒకే చార్జిషీట్‌ వేయాల్సిన సిబిఐ పలు చార్జిషీట్లు వేయడమేమిటని మైసూరారెడ్డి ప్రశ్నించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సీబిఐ తీరును తమ పార్టీ ప్రశ్నిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. తమ పార్టీ నిరసనలు కోర్టులకు వ్యతిరేకంగా కాదని, వాటిని ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో అంతకన్నా కాదని ఆయన స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అక్క బిడ్డను తిట్టకూడదు.. గర్భిణిని కొట్టకూడదు' అనేది రాయలసీమలో సామెత. అలాగే ఎంతో పవిత్రమైన కోర్టు గురించి తమ పార్టీ ఏమీ మాట్లాడదని, కోర్టును ప్రభావితం చేయబోదని అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్‌పై ఒకే ఒక్క ఎఫ్ఐఆ‌ర్ ‌నమోదు చేసి ఇన్ని ఛార్జీషీట్లు వేయడానికి సిఆర్‌పిసిలోని ఏ సెక్షన్ అనుమతిచ్చిందని ఆయన ప్రశ్నించారు.

శ్రీ జగన్‌ను నిర్బంధించి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిబిఐ శైలికి నిరసనగానే తమ కార్యక్రమాలు రూపొందుతున్నాయన్నారు. నిజానికి కోర్టులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్‌, టిడిపిలే అని మైసూరారెడ్డి ఆరోపించారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ అన్యాయంగా ఏడాది నుంచి జైలులో నిర్బంధించి, వేధిస్తున్నందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేసే హక్కు తమకు ఉందన్నారు. శ్రీ జగన్‌ నిర్బంధానికి నిరనసగా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, దీక్షలు నిర్వహించ‌ంపై కాంగ్రెస్, టిడిపి నాయకులు విమర్శలు చేయడాన్ని ఆయన తిప్పికొట్టారు.

అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిస్సార్‌ అహ్మద్ కక్రూ‌ దగ్గర శంకర్రావు పిటిషన్‌ వేశారని, దానిని విచారణకు స్వీకరించినప్పుడు టిడిపి తరఫున ఎర్రంనాయుడు కూడా ఒక పిటిషన్‌ దాఖలు చేసిన వైనాన్ని మైసూరా గుర్తుచేశారు. ఆ రెండింటినీ వెంటనే క్లబ్‌ చేశారన్నారు. ఈ కేసులో కోర్టు విచారణకు సహకరించేందుకు గాను అమికస్‌ క్యురీగా కోర్టు నియమించి ఉంటే ఉండవచ్చని, ఆ న్యాయవాదికి నిజంగా నైతిక విలువలు ఉంటే అందుకు ఒప్పుకుని ఉండేవారు కాదన్నారు. ఎందుకంటే 2004వ సంవత్సరంలో ఆయన టిడిపి తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారని, ఆ పార్టీలో చేరినట్లు కూడా ఆయన ఫొటోతో సహా కొన్ని ఆంగ్ల దినపత్రికలలో వచ్చిందన్నారు. కర్షక పరిషత్‌ మీద కోర్టులో పిటిషన్‌ దాఖలైనప్పుడు అదే న్యాయవాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడి తరఫున వాదించిన వైనాన్ని కూడా మైసూరా గుర్తుచేశారు. ఇరు పక్షాలకూ సమంగా వ్యవహరించేవారే అమికస్‌ క్యురీ అవుతారన్నారు. చంద్రబాబుతో సంబంధ బాంధవ్యాలు బాగా ఉన్న ఆ న్యాయవాది తాను ఆ బాధ్యత తీసుకోనని చెప్పి ఉండాల్సిందని ఆయన అన్నారు. రాజకీయంగా  శ్రీ జగన్‌ను ఇబ్బంది పెట్టాలని ఆ రోజే అంకురార్పణ జరిగిందని మైసూరా ఆరోపించారు.

అశోక్‌ భాన్‌ను తన న్యాయవాదిగా పెట్టుకోవడంతో ద్వారా సిబిఐ ఎంత అనైతికంగా దిగజారిపోయిందో అర్థమవుతోందన్నారు. ఒక కేసులో వాది తరఫున ఉన్న న్యాయవాది ప్రతివాది వైపు వెళ్లడం ఎంతవరకు సమంజసమని మద్రాస్ హైకోర్టు, పంజా‌బ్ కోర్టులు తీర్పులిచ్చాయని ఆయన గుర్తుచేశారు. సిబిఐ ఎంత పతనస్థాయికి దిగజారిందో ఇదే ఉదాహరణ అని మైసూరా అన్నారు. అశోక్‌ భాన్‌ అంతకు ముందు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున వాదించారని, అలా ఆయన తరఫున వాదించిన అశోక్‌ భాన్‌ ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా వాదించడం కూడా సబబు కాదన్నారు. ఒకే కేసులో వాది, ప్రతివాది తరఫున ఒకే న్యాయవాది వాదించడం ఏ నైతిక విలువలకు నిదర్శనమో అని ఆయన ఎద్దేవా చేశారు. అశోక్‌ భాన్‌కు ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయో తనకు తెలియడం లేదన్నారు.ర ముందు శ్రీ జగన్‌ తరఫున కోర్టుకు హాజరై తరువాత ఆయనకు వ్యతిరేకంగా సిబిఐ తరఫున వాదించడం వృత్తిపరమైన దుర్వినియోగం కిందకే వస్తుందని కోర్టు తీర్పు చెబుతోందని మైసూరారెడ్డి తెలిపారు. న్యాయవాదుల చట్టంలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. సిబిఐకి న్యాయవాదుల ప్యానల్‌ లేదా? లేక వారి న్యాయవాదులు అసమర్థులా? అని మైసూరా నిలదీశారు. సిబిఐ ఎంత అనైతికంగా వ్యవహరిస్తోందో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అన్నారు.

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ కాల్‌ డేటా బహిర్గతమైందని, దానిలో కూడా చాలా సమాచారం ఉందన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ నాయకులతో జెడి లక్ష్మీనారాయణ మాట్లాడింది వాస్తవం కాదా? అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. శ్రీ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడల్లా ముందుగా ఆ విషయం పత్రికలకు లీక్‌ చేసి రాయించడం లాంటివి సిబిఐ కుట్రపూరితంగా చేస్తున్నదే అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కోర్టులను ప్రభావితం చేయడమే కదా అని ప్రశ్నించారు. శ్రీ జగన్‌ మీద నమోదు చేసింది ఒకే ఒక్క ఎఫ్‌‌ఐఆర్ కనుక ఒకే చార్జిషీట్‌ వేయాలన్నారు. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని సిబిఐని మైసూరా సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టిడిపిల ఒత్తిడి మేరకే సిబిఐ ఇలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏ ప్రయోజనం కోసం ఇన్ని చార్జిషీట్లు వేస్తున్నారని ఆయన సిబిఐపై నిప్పులు కక్కారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఎన్ని చార్జిషీట్లు వేస్తారని ఆయన సిబిఐపై నిప్పులు చెరిగారు.

ఉప ఎన్నికలకైనా, సాధారణ ఎన్నికలకైనా సిద్ధమా అని కాంగ్రెస్‌, టిడిపిలకు ఎం.వి. మైసూరారెడ్డి 'బస్తీమే సవాల్‌' చేశారు. అందుకు తమ పార్టీ సంసిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజా కోర్టులో తేల్చుకుందాం అని ఆయన సవాల్‌ చేశారు. ప్రజా తీర్పుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, ఆ సవాల్‌ను స్వీకరించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌, టిడిపిలకు ఉన్నాయా అని మైసూరారెడ్డి ప్రశ్నించారు.

Back to Top