రాష్ట్ర విభజనకు బాబే బాధ్యుడు

హైదరాబాద్, 11 ఆగస్టు 2013 :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే బాధ్యుడని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆరోపించింది. చంద్రబాబు ఇచ్చిన పదునైన కత్తిలాంటి లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నరుకుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ విభజనే అనివార్యం అయితే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ ‌చేసింది. అధికార దాహంతోనే చంద్రబాబు బస్సు యాత్ర చేయాలని అనుకుంటున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‌అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తెలుగుజాతికి సమాధానం చెప్పిన తర్వాతే యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన ఇన్ని రోజుల తరువాత చంద్రబాబు ఇప్పుడు మేల్కోన్నారని ఎద్దేవా చేశారు.

తెలుగువాడి జాతి పెంపొందించిన ఎన్టీఆ‌ర్‌నే వెన్నుపోటు పొడిచి ఆయన గద్దెను లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు బస్సుయాత్ర పేరిట ప్రజల దగ్గరకు ఎలా వెళ్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ఉన్నప్పుడే తెలంగాణకు బీజం పడిందని దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కొందరు మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానించడం బాధకరమని అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సిడబ్ల్యుసి ప్రకటించినప్పటి నుంచీ కాంగ్రెస్‌ నాయకులు వైయస్‌ లక్ష్యంగా  ఇలాంటి నీచమైన రాజకీయ ఎత్తుగడలతో మాట్లాడుతున్నారని అంబటి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో రాజశేఖరరెడ్డి గారి కల సాకారం కాబోతున్నదని, ఈ విభజన కోసం ఆయన తపించిపోయార‌ంటూ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే తీరును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కనుకే కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి నీచమైన రాజకీలు చేస్తున్నదని అంబటి ఆరోపించారు. వైయస్ఆర్‌ అభిమతానికి వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు.

నిజానికి తెలంగాణకు రాజశేఖరరెడ్డే అడ్డంకి అని అసెంబ్లీలోనూ బయటా కూడా టిఆర్ఎస్‌ నాయకులు అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను అంబటి ప్రస్తావించారు. రాజశేఖరరెడ్డే తెలంగాణ ఫోరం ప్రారంభించి, ఆ ఫోరంతో సోనియా గాంధీకి లేఖ ఇప్పించారని కూడా కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ప్రారంభించినప్పుడు తెలంగాణకు రాజశేఖరరెడ్డిగారు అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టంచేసి తెలంగాణలో ప్రవేశించాలంటూ తెలంగాణ ఫోరం సభ్యుడు చిన్నారెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వైనాన్ని అంబటి గుర్తుచేశారు. తెలంగాణకు రాజశేఖరరెడ్డి వ్యతిరేకి అని, సమైక్యవాది అని, వైయస్‌ఆర్‌ గో బ్యాక్‌ అంటూ ఆ ఫోరం సభ్యులు నినాదాలు చేశారని గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి ప్రత్యేక వాదా లేక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారా అనేది ఇప్పుడు ఆయన మీద మాట్లాడుతున్న వారికంటే.. తన కంటే తెలుగు ప్రజలకే బాగా తెలుసన్నారు. వైయస్ఆర్‌పై బురదజల్లడాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

రాజశేఖరరెడ్డి మీద బురద జల్లి, మసి పూసి మారేడుకాయ చేసి శ్రీ జగన్మోహన్‌రెడ్డి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద రుద్దటం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. వారి మాటలు వింటే రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా కాంగ్రెస్‌ పార్టీ మాటలను చెప్పకుండానే అర్థమవుతోందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కోసం రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోందని వైయస్ఆర్‌ ఉన్నప్పుడే 2004లో  ఎన్నికలకు వెళ్ళే ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని రాంబాబు ప్రస్తావించారు. రెండవ ఎస్సార్సీ ఏమైందని, చర్చలు ఏమయ్యాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో లబ్ధి పొందాలన్న రాజకీయ లక్ష్యంతో విభజనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయం తీసుకుందని అంబటి నిప్పులు చెరిగారు.

చంద్రబాబు నాయుడు చేయ తలపెట్టిన 'తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర'ను అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిచెప్పింది నందమూరి తారకరామారావే అని అన్నారు. అలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, గద్దెనెక్కిన చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రకు బయలుదేరుతున్నారంటే.. నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడంలేదని విమర్శించారు. రాష్ట్రం రెండుగా విడిపోయినందుకు తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావిస్తే.. ఈ పది రోజులూ చంద్రబాబు ఎందుకు నిద్రపోయారని అంబటి నిలదీశారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన 12 గంటలకు మీడియాలో మాట్లాడుతూ జాతి రెండుగా చీలిపోయినా ఐక్యంగా ఉండాలంటూ చంద్రబాబు చెప్పిన వైనాన్ని ప్రస్తావించారు. తెలుగుజాతిని నిలువునా చీల్చిన నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుకు 4, 5 లక్షల కోట్లు కావాలని అడిగిన చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ఏ ముఖంతో చేస్తారని ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మంటగలిపిన వ్యక్తం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top