చంద్రబాబుపై తక్షణమే రౌడీషీట్‌ తెరవాలి

హైదరాబాద్, 12 ఫిబ్రవరి 2013: పత్రికా కార్యాలయంపై రాళ్ళ దాడికి టిడిపి మూకలను ఉసిగొల్పిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై పోలీసులు తక్షణమే రౌడీషీట్‌ తెరవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి, మరో తొమ్మిదేళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిగా చంద్రబాబు ఇలాంటి నీచమైన సంస్కృతిని ప్రోత్సహించడమేమిటని తూర్పారపట్టింది. వీధి రౌడీల స్థాయికి దిగజారిపోయిన చంద్రబాబు నాయుడిని చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో టిడిపి నాయకులు, కార్యకర్తల విజ్ఞతకే వదిలిపెడుతున్నామని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారంనాడు మీడియా సమావేశంలో మట్లాడుతూ... చంద్రబాబు తీరును తప్పుపట్టారు. టిడిపి మూకలు సోమవారంనాడు సాక్షి కార్యాలయంపై రాళ్ళతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు గడచిన ఐదు రోజులుగా తన పాదయాత్రలో సాక్షి పత్రిక, టివి పైన తమ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా అనేక ఆరోపణలు చేయడాన్ని అంబటి ఖండించారు. చంద్రబాబు సమక్షంలోనే సాక్షి కార్యాలయంపై దాడి జరిగిన వైనాన్ని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ఈ విధంగా వ్యవహరించడం తగదని హితవు చెప్పారు. విజయవాడలో 1987లో వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు ఈనాడుపై అల్లరిమూకలు దాడి చేసినప్పుడ చంద్రబాబు ఏ విధంగా ప్రతిస్పందించారో గుర్తు చేసుకోవాలన్నారు. మార్గదర్శిలో సోదాలు జరితే దాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా చంద్రబాబు అభివర్ణించిన వైనాన్ని గుర్తుచేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు నేరుగా ఒక పత్రికా కార్యాలయంపైనే దగ్గర ఉండి రాళ్ళతో దాడులు చేయించడమేమిటని ఆయన నిలదీశారు. బజారు మూకలకు, రౌడీలకు నాయకత్వం వహించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అంబటి నిప్పులు చెరిగారు.

రెండు సార్లు అధికారానికి దూరమైపోయి, మూడవ సారి అయినా అది దక్కుతుందన్న ఆశలు ఉడిగిపోయిన అసహనంతో చంద్రబాబు ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతున్న చంద్రబాబు నాయుడిపై పోలీసులు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చంద్రబాబుకు వంతపాడే పత్రికలు తప్ప అర్థవంతంగా విమర్శించే పత్రికలు అసలే ఉండకూడదన్నది చంద్రబాబు ఉద్దేశమా? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్రగా వెళుతున్న గుంపు నుంచే సాక్షి కార్యాలయంపైకి రాళ్ళు వచ్చింది నిజమా కాదా అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడికి శ్రీమతి షర్మిల చేసిన సవాల̴్ సరైనదే అని తాము భావిస్తున్నామన్నారు. తనకు శస్త్ర చికిత్స జరగలేదని నిరూపిస్తే ఆయన కాళ్ళు పట్టుకుని తాను క్షమాపణ చెబుతానని, నిరూపించలేకపోతే తన కాళ్ళు పట్టుకుంటారా? అన్న శ్రీమతి షర్మిల సవాల్‌ను ఆయన సమర్థించారు. శ్రీమతి షర్మిలకు శస్త్ర చికిత్స జరగలేదనే వారంతా తమ బుర్రలకు చికిత్స చేయించుకోవాలని అంబటి సలహా ఇచ్చారు. అపోలో ఆస్పత్రిలో ఏ శస్త్ర చికిత్స జరిగినా కెమెరాలో చిత్రీకరిస్తారని, దాన్ని అసత్య ప్రచారం చేసేవారు పరిశీలించుకోవచ్చని సూచించారు.

ఎన్నో పత్రికలు చంద్రబాబుకు తాళం వేస్తుండగా ఇంకా ఆయనకు సొంతంగా పత్రిక పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉందని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నకు అంబటి రాంబాబు సమాధానం చెప్పారు. అయినా, చంద్రబాబు కొడుకు లోకేష్ బినామీ పేరుతో ‌ఒక మీడియా సంస్థను నిర్వహించిన విషయం ఈ రాష్ట్రంలోని పెద్దలకు, మీడియా ప్రతినిధులు అందరికీ తెలుసన్నారు. వారిలా బినామీ పేర్లతో సంస్థలు నిర్వహించే అగత్యం తమకు లేదన్నారు. వ్యతిరేక వార్తలు రాసే మీడియాపై దాడులు చేస్తామని చంద్రబాబు తీర్మానం చేస్తే మంచిదని అంబటి సలహా ఇచ్చారు. చంద్రబాబు వెళ్ళే దారిలో అసలు కార్యాలయాలే ఉండకూడదా? ఉంటే రాళ్ళేసేస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు. తన పాదయాత్రలో జరిగిన దాడిని చంద్రబాబు ఎందుకు ఖండించలేదని అంబటి నిలదీశారు. తన ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది కనుకే ఆయన ఖండించలేదని రాంబాబు వ్యాఖ్యానించారు.
Back to Top