చంద్రబాబు అన్న పార్టీనా? అమ్మ పార్టీనా?

హైదరాబాద్, 12 నవంబర్ 2013:

చంద్రబాబు నాయుడు 'అన్న పార్టీ'లో ఉన్నారా? లేక 'అమ్మ పార్టీ'లో ఉన్నారా? వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఇదే  అనుమానం టీడీపీ కార్యకర్తలలో కూడా ఉన్నదని ఆయన అన్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారమే చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. సీబీఐ కేసులు తనపైకి రాకుండా ఉండేందుకే నాలుగేళ్ళుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన గురించి బాబుకు  ముందే తెలుసని,  అందుకే జూలై 30న రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే కీలకమైన మీడియా సమావేశం పెట్టి సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారని అంబటి ప్రస్తావించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకువెళ్ళి సోనియాకు పాదాక్రాంతులను చేశారని దుయ్యబట్టారు.‌ కేసులకు భయపడి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అయ్యారన్నారు.

జీఓఎంకు వెళ్ళి సమైక్యాని అనుకూలంగా ఉన్నామని చెబితే తన రంగు బయటపడిపోతుందని చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని అంబటి విమర్శించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆడుతున్న నాటకంలో ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పాత్రదారులు అని అంబటి ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఇప్పటికైనా తెలుగుజాతిని మోసం చేయడం మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడానికి ప్రయత్నించాలని నాటకాలు ఆడొద్దని విజ్ఞప్తిచేశారు.

సీఎం కిరణ్ సమైక్య ముసుగు వేసుకున్నారని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కొందరు సీమాంధ్ర మంత్రులు సర్వశక్తులు ఒడ్డుతామని చెప్పారని, ఇప్పుడు వారు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 104 రోజుల సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రుల ప్రకటనలను గమనించాలన్నారు. సీమాంధ్ర రాజధానికి లక్ష ఎకరాలు, 5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అడిగిన‌ సీఎం కిరణ్ సమైక్య సైన్యాధిపతి, సమైక్య సింహం ఎలా అవుతారని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్ళి సోనియా భజన, వార్‌రూమ్‌లో విభజన భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. వార్‌రూమ్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత సమైక్య సింహంలా ఫోజులు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

2014 వరకు రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే, ఆ తరువాత సమైక్యతకు మద్దతు ఇచ్చే పార్టీలే అధికారంలోకి వస్తాయని అంబటి చెప్పారు. మన రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ధీమాగా చెప్పారు.

Back to Top