హైదరాబాద్, 9 మార్చి 2013: చంద్రబాబుకు మళ్లీ అధికారం అందడం కల్ల అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప విరుచుకుపడ్డారు. వరుసగా 2004, 2009లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. 2014లో జరిగే ఎన్నికల్లో కూడా ఆయనకు గుణపాఠం చెప్పడం తథ్యం అన్నారు. అధికారంలోకి రావాలన్న కోరికతో విశ్వసనీయతకు, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి మహానేత వైయస్ కుటుంబంపైన గోబెల్సు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రదర్ అనిల్ కుమార్ గురించి టిడిపిలోని పైరవీకారుల బృందం అసత్య ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.

చంద్రబాబు బతుకంతా హత్యా రాజకీయాలు, వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలేనని మారెప్ప విమర్శించారు. మామ ఎన్టీ రామారావును స్లో పాయిజన్ ద్వారా అంతం చేశారని తీవ్రమైన ఆరోపణ చేశారు. నిత్యం మహానేత వైయస్‌ఆర్ కుటుంబాన్ని నిందించడం, ఆడిపోసుకోవడం తప్ప ప్రజల కోసం ఏనాడైనా ఒక్క మంచిపని చేశావా అని ప్రశ్నించారు. చెప్పుకోవటానికి ఏమీలేక నిత్యం వైయస్‌ఆర్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు కొడుకు లోకేష్ చదువుకు సత్యం రామలింగరాజు రూ. 85 కోట్లు వెచ్చించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.రెండెకరాల పొలం నుంచి వచ్చిన చంద్రబాబుకు దేశవిదేశాల్లో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో బహిరంగ చర్చకు సిద్ధపడాలని మారెప్ప సవాలు విసిరారు.

పాదయాత్రకు అర్థం చెప్పింది మహానేత :మండుటెండలో నడిచిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు అర్ధం చెప్పిన మహావ్యక్తి అని మూలింటి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల బాగు కోసం ఆయన నిరంతరం శ్రమించారన్నారు. అందుకే ఆ మహానేత మరణించి మూడున్నరేళ్ళవుతున్నా కోట్లాది మంది దేవుడిగా కొలుస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమని మారెప్ప తెలిపారు. మహానేత వైయస్ జనబాంధవుడని, కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ విధానంలో పరిపాలన సాగించారన్నారు. కేవలం 60 ఏళ్ళ వయస్సుకే 13 మంది సిఎంలు చేయలేని జనరంజకమైన పనులు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచార్నారు.
ప్యాకేజ్ కుదిరినందుకే అవిశ్వాసం పెట్టడం లేదా? :ప్యాకేజ్ కుదుర్చుకున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు జీవిత చరిత్ర తెలియనిది కాదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పని అయినా చేశారా? అని మారెప్ప ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండు మాల మాదిగలను చంద్రబాబు విడదీశారని దుయ్యబట్టారు. బి.సి. డిక్లరేషన్, ఎస్.సి. డిక్లరేషన్ ఇలా రకరకాల పేర్లతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి ఒక్కటైపోయి టిసిఎఫ్‌గా మారిపోయాయని మారెప్ప ఎద్దేవా చేశారు. కృష్ణా - గోదావరి బేసిన్‌లోని రూ. 46 వేల కోట్ల విలువైన సహజ వాయువును రిలయన్సు సంస్థకు ధారాదత్తం చేసింది చంద్రబాబే అని ఆయన నిప్పులు చెరిగారు. తనపై విచారణ జరగకుండా దర్యాప్తు సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని సుప్రీంకోర్టును కూడా చంద్రబాబు మేనేజ్ చేశారని ఆరోపించారు.
సువార్తికుడు వ్యాపారం చేయకూడదా? :సువార్త బోధకుడు బ్రదర్ అనిల్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న 63 ఏళ్ళ చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదా అని మారెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సువార్త బోధకుడు వ్యాపారం చేయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన బావమరిది, తన బినామీల సంపాదనలలో ఏ ఒక్కరితో అయినా సమానంగా బ్రదర్ అనిల్ సంపాదన ఉందా? అని మూలింటి ప్రశ్నించారు. తప్పు చేయలేదని బ్రదర్ అనిల్ తన పిల్లల మీద ప్రమాణం చేసినా బిజెపి ప్రభాకర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబు కొడుకు లోకేష్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. టిడిపిలో పనీ పాటా లేని వారి కోసం 'పనికి ఆహారం పథకా'న్ని చంద్రబాబు పెట్టారని ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన చరిత్ర గల చంద్రబాబు అవినీతిపై ఎఫ్‌బిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని మారెప్ప డిమాండ్ చేశారు.
దమ్మున్న మగాడు జగన్ :వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి దమ్మున్న మగాడు అని మారెప్ప అభివర్ణించారు. అతి చిన్న వయస్సులోనే మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. పార్టీ జెండాలోనే అజెండాను శ్రీ జగన్ స్పష్టంగా ప్రకటించిన వ్యక్తి అన్నారు. పేదల సమస్యలు శ్రీ జగన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియవని మూలింటి తెలిపారు. క్విడ్ ప్రో కో లేదని, 26 జి.ఓ.లు సక్రమం అంటారని అలాంటప్పుడు శ్రీ జగన్ చేసిన నేరం ఏమిటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి 190 సీట్లు రావడం ఖాయమన్నారు. శ్రీ జగన్ అధికారంలోకి రావాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటున్నదని అన్నారు. శ్రీ జగన్ బయటికి వస్తే కాంగ్రెస్, టిడిపిలు కూలిపోతాయనే జైలు నుంచి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారని విమర్శించారు. చంద్రబాబు ఖూరీకోరు అని కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయాన్ని మారెప్ప ప్రస్తావించారు.
ప్రజా నాయకురాలు శ్రీమతి షర్మిల :శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఆణిముత్యం లాంటి బ్రదర్ అనిల్ కుమార్ మత బోధకుడు కాదని, సువార్త ప్రచారకుడు మాత్రమే అన్నది విమర్శించేవారు తెలుసుకోవాలని మారెప్ప హితవు పలికారు. శ్రీ జగన్ సోదరి శ్రీమతి షర్మిల ప్రజా నాయకురాలు అని ఆయన అభివర్ణించారు. తండ్రిని పోగొట్టుకున్నప్పటికీ ఆమె ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.
బాబు రాజకీయ కుట్రలకు దళితుడైన మల్లెల బాబ్జీ, ఎలిమినేటి మాధవరెడ్డి, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డి ఇలా ఎంతో మంది నేతలు, ఐఎఎస్ అధికారులు బలయ్యారన్నారు. కుళ్లు, కుట్రల వల్లే చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఈడ్చి కొడితే రోడ్డున పడ్డారని విమర్శించారు. అతిగా మాట్లాడే రేవంత్‌రెడ్డి చరిత్రేమిటని ప్రశ్నించారు. భూముల దొంగ రిజిస్ట్రేషన్లు చేయించడం మొదలు ఎన్నో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘వర్లువోతు రామయ్య చరిత్ర ఎంత చెప్పినా తరగనిది. పోలీస్ అధికారిగా ఉంటూ ఆ వ్యవస్థను కలుషితం చేశారు. గాలి మాటలు మాట్లాడటంలో ముద్దు కృష్ణమ అంతటివారు మరొకరుండరు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన రోజుల్లో స్కూళ్లలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన మాట వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి చరిత్ర కలిగిన వారికి మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ కుటుంబం పేరెత్తే అర్హతే లేదని మారెప్ప అన్నారు.