బాబు ఏకాంత చర్చల ఆంతర్యం ఏమిటి?

 
హైదరాబాద్, ‌10 సెప్టెంబర్‌ 2012: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌తో ఏకాంతంగా జరిపిన చర్చల ఆంతర్యం ఏమిటని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నిలదీసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, వారి చర్చల వెనుక ఉన్న ఉద్దేశమేమిటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రధానితో చంద్రబాబు రహస్య భేటీతో కేంద్రంలోను, రాష్ట్రంలోను వారి మధ్య 'బయటికి చెప్పలేని అవగాహన' ఏదో కుదిరిందన్న అనుమానం బలపడుతోందని పద్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

‘పార్టీల నేతలెవరైనా ప్రధానిని కలవొచ్చు. ఆయనను కాంగ్రెస్ ‌పార్టీ నేతలు కలిస్తే ఎవరూ ప్రశ్నించే ఆస్కారం లేదు. కానీ కాంగ్రెస్‌ పార్టీతో తమకు బద్ధ వైరం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రధానితో ఏకాంతంగా భేటీ కావడమే అనుమానాలకు తావిస్తోంది. బీసీ డిక్లరేషన్ వినతిపత్రం ఇచ్చే నెపంతో ప్రధానిని కలిసి, వెంట ఉన్న వారందరినీ 'కనుసైగ'తో బయటకు పంపి ఒక్కరే ఐదు నిమిషాల పాటు మన్మోహన్‌తో చర్చించిన రహస్యాలేమిటి?’ అని పద్మ నిలదీశారు. ఇలాంటి వార్త ఒక మీడియాలో మాత్రమే వచ్చిందని టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్పడం తగదన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని పద్మ అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య అపవిత్ర సంబంధం ఇటీవలి ఉప ఎన్నికలప్పుడు, సమాచార హక్కు కమిషనర్ల నియామకం సందర్భంగా, పలు ఇతర సమయాల్లోనూ వెల్లడయిందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విలీనం అవుతుందంటూ టిడిపి చేస్తున్న ప్రచారం హాస్యాస్పదం అని పద్మ ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారంపై తమ పార్టీ స్పష్టమైన ఖండన ఇచ్చిందని, తమపై దుష్ప్రచారం చేస్తున్న శక్తులపై విజయవంతంగా పోరాటం చేస్తున్నామని ఆమె వివరించారు.

చంద్రబాబు ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత బొగ్గు కుంభకోణంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావని మీడియాకు భరోసాగా చెప్పడాన్ని బట్టి ఆయన లోపల ఏమి మాట్లాడి ఉంటారనే సందేహం వ్యక్తమవుతోందన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచీ ప్రజా పోరాటాల్లో ముందువరుసలో ఉన్నదని, తెలుగుదేశం పార్టీయే కాంగ్రెస్‌తో రహస్యంగా కలిసి పనిచేస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎవరు ఎటు వైపు ఉన్నారనే విషయం ప్రజలకు తేటతెల్లం అవుతుందని పద్మ పేర్కొన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై కొన్ని అసత్య వార్తలను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో, కేంద్రంలో తమ పార్టీ కచ్చితంగా చాలెంజింగ్ పాత్ర నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌సిపి మీడియాను వాడుకుంటున్నదంటూ టిడిపి చేస్తున్న ఆరోపణలను పద్మ తోసిపుచ్చారు. ప్రజాబలం లేని పార్టీలే వక్రీకరించి వార్తలు రాసే పక్షపాత మీడియాపై ఆధారపడతాయని ఎద్దేవా చేశారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో తమ పార్టీకి లభించిన ప్రజా తీర్పులే తమది ఎంత బలీయమైన పార్టీయో చెప్పకనే చెప్పిందని ఆమె తెలిపారు.

రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు నిధులు సమకూరుస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తపై పద్మ స్పందిస్తూ, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలే అత్యధికంగా ప్రయోజనం పొందాయని తమ అధ్యయనంలో తేలిందని అన్నారు. టిడిపికి అందిన 50 కోట్ల రూపాయలపైన, చంద్రబాబు నాయుడు ఏకైక నేతృత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ పనితీరుపైన, వస్తున్న నిధుల ప్రవాహం పైన విచారణకు ఆదేశించాలని వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌ చేస్తున్నదని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Back to Top