అవినీతి, అక్రమాలకు ఆద్యుడు చంద్రబాబే

హైదరాబాద్, 27 జనవరి 2013: రాష్ట్రంలో అవినీతి, అక్రమ పాలనకు అంకురార్పణ చేసింది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నీతి, న్యాయం, సుపరిపాలన గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు ఒక్కసారి వెనక్కి తిరిగి తన గతాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడినందుకే‌ కోర్టులు బెయిల్ ఇవ్వడంలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తూర్పారపట్టారు. అంటే బెయిల్‌ వచ్చిన వారంతా నీతిమంతులే అని చంద్రబాబు మాటల అర్థమా? అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు.

న్యాయమూర్తులను నియమించే అధికారం సిఎంకు ఉందా?:
తొమ్మిదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడి వ్యవహరిస్తున్న ఈ మాజీ ముఖ్యమంత్రి వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తానని, నిజాయితీ గల న్యాయమూర్తులను నియమిస్తానని చెబుతున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. న్యాయమూర్తులను నియమించే అధికారం ముఖ్యమంత్రికి ఉండదన్న విషయం ఈ మాజీ సిఎంకు తెలియదా? అన్నారు. లేదా తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే, న్యాయమూర్తులను నియమించే అధికారం వచ్చేస్తుందని కలలు కంటున్నారా? అని ప్రశ్నించారు.

భ్రమల్లో చంద్రబాబు!: 
తొమ్మిదేళ్ళు రాష్ట్రంలో అధికారం వెలగబెట్టిన సమయంలో తాను అనేక కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ప్రజలు మరచిపోయారని చంద్రబాబు భ్రమిస్తున్నారా? అని అంబటి అన్నారు. 'బాబు జమానా.. అవినీతి ఖజానా' అంటూ సిపిఐఎం ప్రచురించిన పుస్తకంలో ఉన్న చంద్రబాబు అవినీతి అంశాల గురించి రాంబాబు ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలోనే ఐదు వేల కోట్ల విలువైన నకిలీ స్టాంపుల కుంభకోణం జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మద్యం ముడుపులు, స్కాలర్‌షిప్‌ల కుంభకోణం, ఏలేరు స్కాం, సోమశిల కుంభకోణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ... ఇవన్నీ జరిగింది చంద్రబాబు పాలనలో కాదా? అని అంబటి నిలదీశారు. చివరకు పేద ప్రజలు చికిత్స చేయించుకునే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరులో కూడా అవకతవకలు జరిగాయన్నారు. తన పాలన నీతివంతంగా సాగిందని బాబు భ్రమిస్తున్నారా? అని రాంబాబు అన్నారు. ఆదాయానికి మించి అస్తులున్నాయంటూ కోర్టులో కేసు నమోదైతే దాని మీద విచారణ కొనసాగకుండా స్టే తెచ్చుకున్న చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే పొసగదన్నారు. రాష్ట్ర రాజధానిలోని అత్యంత విలువైన భూములను తన బినామీ బిల్లీరావు నిర్వహిస్తున్న ఐఎంజి సంస్థకు ఎకరం కేవలం రూ.50 వేలకే కట్టబెట్టింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు. మూడు రోజుల్లో పుట్టుకొచ్చిన ఈ బినామీ సంస్థకు కారుచౌకగా భూములు కట్టబెట్టిన వ్యక్తి చంద్రబాబే అని అంబటి ఆరోపించారు.

నీతి, నిజాయితీ అసలే లేని రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడే అని అంబటి విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏ గడ్డి అయినా కరుస్తారని రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసమే ఆయన ఎన్టీ రామారావుపైకి హరికృష్ణ, బాలకృష్ణలను ఉసిగొల్పిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అధికారం కోసమే భార్యా భర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు. చుట్టాలు, బంధువులు, రక్త సంబంధీకులను కూడా చంద్రబాబు అదే అధికారం కోసం వేధించిన విషయం అందరికీ తెలుసన్నారు.

ఇంత కోటీశ్వరుడివి ఎలా అయ్యావు బాబూ?:
కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న ఈ వ్యక్తి, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఉపకార వేతనంతో చంద్రబాబు చదువుకున్న వైనాన్ని అంబటి గుర్తు చేశారు. చివరికి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి ధనవంతుల నుంచి ఐదు వందల నుంచి ఐదు వేల వరకూ చదువు కోసం పాకెట్‌ మనీ తీసుకుని చదువుకున్న చంద్రబాబు ఇప్పుడు ఇంత కోటీశ్వరుడివి ఎలా అయ్యావని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఎన్ని కుంభకోణాలకు పాల్పడి, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా కోటాను కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. తాజాగా రాజ్యసభ సీట్లు అమ్ముకుని ఇప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.

నిలువెల్లా అవినీతిమయమైన చంద్రబాబు ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉరుకోరని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Back to Top