అన్నదాతను ఆదుకోకపోతే అధోగతే!

హైదరాబాద్‌, 10 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని వైయస్ఆ‌ర్ ‌కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని రైతన్నల దుస్థితిని వివరిస్తూ.. రైతు సమస్యల పరిష్కారానికి వైయస్‌ఆర్‌ సిపి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్‌ ఎంవిఎస్ నాగిరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ఎరువుల కొరత, బ్లాక్ మార్కె‌ట్‌ను నివారించి రైతులను ఆదుకోవాలని ఆ లేఖలో ఆయన సీఎంను కోరారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజ‌న్‌ ప్రారంభంలోనే అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోనందువల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని నాగిరెడ్డి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు బాగా నష్టపోయారని, రైతాంగం సంక్షోభంలో పడిందని, వర్షాలు లేక విద్యుత్ కొరతతో దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని లేఖలో ప్రస్తావించారు. సకాలంలో సరైన విత్తనాలు లభ్యం కాకపోవడంతో రైతులు బ్లాక్‌ మార్కెట్‌ వాటిని కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించిదన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నదే గాని క్షేత్ర స్థాయిలో అది అమలు కావడం లేదని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదనుకు వర్షాలు సరిగా లేక, వ్యవసా‌యానికి విద్యుత్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఈ ఏడాది సాగు ఆలస్యమైపోయిందని గుర్తుచేశారు. తద్వారా పంట దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.

ఎంతో శ్రమకు ఓర్చి అన్నదాత పంట సాగు చేస్తే ఇప్పుడు ఎరువులు బ్లాక్‌మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎంకు రాసిన లేఖలో నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతపై వై‌యస్‌ఆర్ సీపీ ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వైయస్‌ఆర్ సిపి ముందస్తు హెచ్చరికను పట్టించుకోకపోవడమే కాకుండా ఎరువుల కొరత రాదని, ఈ సీజన్‌లో మన రాష్ట్రానికి కేంద్రం 41.55 లక్షల టన్నులు కేటాయించిందని, మార్క్‌ఫెడ్‌, ఎరువుల కంపెనీల వద్ద 6.48 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గొప్పగా ప్రకటించారన్నారు. అయితే, ఆగస్టు నుంచే రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రారంభమైన విషయాన్న తన లేఖలో నాగిరెడ్డి సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 

నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని నాగిరెడ్డి పేర్కొన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడం రైతన్నకు సంతోషం కలిగించినా, ఎరువుల కొరత వారిని కుంగదీస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం అన్నదాత ఆందోళనకు దిగితే పోలీసులు వారి వీపుల మీద లాఠీలు ఝళిపిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళుగా రసాయనిక ఎరువుల ధరలను విపరీతంగా పెంచినా రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై వత్తిడి చేయలేదని, సబ్సిడీని భరించి ఎరువుల ధరలు నియంత్రించే ప్రయత్నం చేయలేదని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం అత్యధికంగా భూగర్భ జలాల మీద, విద్యుత్‌ మోటార్లపైనే ఆధారపడి సాగవుతున్నదని, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విద్యుత్‌ 7 నుంచి 8 రూపాయలకు కొనుగోలు చేసి మరీ అన్నదాతకు అందించారని స్పష్టంచేశారు. వ్యవసాయానికి వైయస్‌ నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్‌ సరఫరా చేశారని పేర్కొన్నారు. అయితే, నేటి ప్రభుత్వం బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదని నాగిరెడ్డి తన లేఖలో తెలిపారు. వర్షాలు విస్తారంగా కురిసిన ఆగస్టు నెలలో కూడా 3 గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేయని విషయాన్ని ఆయన ఎత్తి చూపారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో అందించలేకపోయిందని సీఎంకు రాసిన లేఖలో వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం కన్వీనర్‌ నాగిరెడ్డి నిలదీశారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు కుప్పకూలిపోయి, రైతన్నకు తాను పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. అలాంటి సందర్భంలో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం కింద రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయకపోవడం సరికాదని తెలిపారు.

'వ్యవసాయ సంక్షోభం రాజకీయ సమస్య కాదని, అది అన్నదాత జీవన్మరణ సమస్య' అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పలు మార్లు దీక్షలు, ధర్నాలు చేసి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని ఆ లేఖలో నాగిరెడ్డి గుర్తుచేశారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయమని ఆయన ముందు నుంచీ చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం వద్ద ఉన్న యూరియా బఫర్‌ స్టాక్‌ మొత్తాన్ని విడుదల చేయాలని, కాకినాడ, విశాఖపట్నం ఓడలరేవుల్లో నిల్వ ఉన్న యూరియాను వెంటనే మార్కెట్‌కు తరలించాలని నాగిరెడ్డి తన లేఖలో కోరారు. కేంద్రం నుంచి మరింతగా యూరియాను రాష్ట్రానికి తీసుకువచ్చి, బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించాలని వైయస్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, చర్యలు తీసుకోకపోతే రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతారని, ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడి తగ్గిపోయి, ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉందని నాగిరెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
Back to Top