రుణమాపీ లేదు.. పావలా వడ్డీ లేదు..

గన్నవరం

: రుణమాఫీ, పావలావడ్డీ అంటూ సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను మోసం చేశాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గోపవరపుపాడు హరిజన వాడ మహిళలు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డ్వాక్రా రుణమాఫీ, పావలా వడ్డీ అంటున్నారు.. కానీ ఇప్పటి వరకు తమకు అందలేదని, రూ. 10 వేలు తీసుకుంటే పదికి పది బ్యాంక్‌లకు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపులంటేనే విరక్తి చెంది ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే విధంగా 70 సంవత్సరాలు వచ్చినా పెన్షన్‌ ఇవ్వడం లేదని, ఇంకా వయస్సు పెరగాలని అంటున్నారన్నారు. గోపవరపుపాడులో మంచినీటి చెరువును బాగు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు.

Back to Top