అర్హులకు అన్యాయం చేయడమేనా సంక్షేమం ?

  • ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు
  • జి.వెంకటాపురంలో గడపగడపకు వైయస్ఆర్సీపీ 
విశాఖపట్నం(మాకవరపాలెం) : అర్హులకు అన్యాయం చేయడమేనా సంక్షేమమని ప్రజలు  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని జి.వెంకటాపురం పంచాయతీలో గురువారం గడపగడపకూ వైయస్సార్‌ సీపీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వైయస్సార్‌సీపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పాల్గొని గడపగడపలో పర్యటించి ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా గణేష్‌కు స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు పట్టారు. అర్హులైన వారికి జన్మభూమి కమిటీ సభ్యులు కావాలనే పింఛన్లు తొలగించారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ప్రభుత్వం వచ్చి సుమారు మూడేళ్లవుతున్నా ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 

అనంతరం గణేష్‌  మాట్లాడుతూ... ఎందరో అర్హులను ఇబ్బందులకు గురి చేస్తూ, సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారన్నారు. వీరంతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆర్‌.సత్యన్నారాయణ, నర్సీపట్నం, గొలుగొండ అధ్యక్షులు సుర్ల సత్యన్నారాయణ, రాయపురెడ్డి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చిటికెల రమణ, పార్టీ నేతలు పెట్ల భద్రాచలం, వ్రరి పాత్రుడు,  లక్కరాజు రాజారావు, బండారు గాంధీ, సబ్బవరపు గోవింద, దాట్ల నర్సింహరాజు, పెంటకోట శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 
Back to Top