సమస్యలతో సతమతం

కాకినాడ సిటీ...పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో తమ ప్రాంతం మురికికూపంగా మారిందని కాకినాడ 8వ డివిజన్‌లోని సాంబమూర్తినగర్‌ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం వైయస్‌ఆర్‌సీపీ నగర కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ సాంబమూర్తినగర 2,3,4వీధుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. సొంతింటి కల నెరవేరుస్తారని ఆశతో అధికారులకు సొమ్ములు చెల్లించినా ఫలితం లేకపోయిందని పలువురు వాపోయారు. డివిజన్‌లో ప్రధానంగా ముంపు సమస్య అధికంగా ఉందని, వర్షం కురిస్తే రోడ్లన్నీ మునిగిపోతున్నాయంటూ వైయస్‌ఆర్‌సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దొమలు పెరిగి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీకి ఎంపికైందని ప్రకటనలు గుప్పిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిథులు ఈ ప్రాంతంలోని సమస్యలకు ఏం సమాధానం చెబుతారోనని ప్రశ్నించారు.  

ముమ్మిడివరం...చంద్రబాబు ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గోడు పట్టించుకోవడం లేదంటూ మహిళలు వాపోయారు. నగరపంచాయతీ పరిధి 5వ వార్డులో బుధవారం జరిగిన గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాబు రెండేళ్ల పాలనపై మార్కులు వేయాలని ప్రజా బ్యాలెట్‌ అందించారు. గ్రామంలో ముఖ్యంగా పింఛన్లు రావడం లేదని, గృహ నిర్మాణ పథకం నీరుగారి పోయిందన్నారు. ఉపాధి హామీ పథకంలో తమకు పనులు కల్పించడం లేదని వాపోయారు. రోడ్లు ఛిద్రమయ్యాయమని, తాగునీరు దొరకడం లేదని ఏకరువు పెట్టారు. డెబ్బై ఏళ్లు పైబడినా తనకు పింఛన్‌ మంజూరు కాలేదని బొమ్మి ధనలక్ష్మి అనే మహిళ నాయకుల ఎదుట వాపోయింది.

Back to Top