ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలోనే లైట్ల ఆర్పివేత
చిలకలూరిపేటలో అధికార పార్టీ కుట్రలు
గడపగడపకూ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించే యత్నం
చిలకలూరిపేట టౌన్ : గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగటం అధికారపార్టీకి కంటగింపుగా మారింది. కార్యక్రమానికి లభిస్తున్న విశేష ఆదరణ, ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఏదో రకంగా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారం చేతిలో ఉందికదా అని అహంకారంతో అధికార దుర్వినియోగానికి తెరతీసింది. గత నెల 8వ తేదీన నియోజకవర్గంలో ప్రారంభమైన గడపగడపకూ కార్యక్రమానికి రోజురోజుకు పెరుగుతున్నప్రజాధారణ గురించి సమాచారం సేకరిస్తున్న అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి సమస్యలు సృష్టిస్తున్నారు.
ప్రతిరోజు సాయంత్రం ప్రారంభమై రాత్రి వరకు ఈ తంతు కొనసాగుతోంది. ఏ వీధిలో కార్యక్రమం జరుగుతుందో ఆ వీధి దీపాలు వెలగకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయిస్తున్నారు. వైయస్సార్ సీపీ నాయకులు వీధిలోని ఒక లైను దాటి మరో లైనుకు వెళ్లాక కార్యక్రమం ముగిసిన లైనులో వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొత్తగా ప్రవేశించినలైనులో వీధిలైట్లు ఆరిపోతున్నాయి. ఈ రకంగా అవాంతరాలు సృష్టిస్తుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చార్జింగ్ లైట్లను తెచ్చి ఆ వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న ఈ అనైతిక చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్నారు.