ప్రజలను వంచించిన టీడీపీ

నెల్లూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి టీడీపీ ప్రజలను మోసం చేసిందని  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. రూరల్‌ మండలంలోని మాదరాజు గూడూరు, కాకుపల్లి, ఆకుతోట ప్రాంతాల్లో గడపగడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 900కు పైగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు ఆ హామీలను నెరవేర్చడం లేదన్నారు.ఈ హామీలపై ప్రజాబ్యాలెట్‌ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గడపగడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 

ప్రతి పక్ష ఎమ్మెల్యేగా తాను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానన్నారు. తనకు ఇచ్చే గ్రాంటు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అయినా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తున్నానని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కోటంరెడ్డికి అండాగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Back to Top