వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు వైయస్సార్సీపీ శ్రేణులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈసందర్భంగా తమ ఇంటికి వచ్చిన నాయకులకు సమస్యలు చెప్పుకొని వాపోతున్నారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రజలను నట్టేటా ముంచారు
ఇందిరమ్మ ఇంటి పథకంలో ఇళ్లు నిర్మించుకున్న తమకు ఇంతవరకు బిల్లులు రాలేదని, దీంతో అప్పుల పాలై.. తిరిగి అవే ఇళ్లను తనాఖా పెట్టాల్సిన దుస్థితి నెలకొందని కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం సింగనపల్లె ప్రజలు వైయస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జీ కాటసారి రామిరెడ్డి ఎదుట ఆవేదనను వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో రామిరెడ్డి ఆధ్వర్యంలో సింగనపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నట్టేటా ముంచారని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వానికి బుద్ది చెబుదాం
ఎన్నికల హామీలను మరిచిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని వైయస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా పోలాకి మండలం బొద్దాం గ్రామంలో ఆయన పర్యటించి ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందించారు. అనంతరం టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతమేర అమలు అయ్యాయో మార్కులు వేయాలని వారికి తెలియజేశారు.
ఇది వైఫల్యాల ప్రభుత్వం
సొంత ఇల్లు లేదని, డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు వైయస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఎదుట తమ గోడును తెలిపారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం జీవీఎంసీ 41వ వార్డులో విజయప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.