బాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత

జన్మభూమి కమిటీల పెత్తనం
నెల్లూరు: ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ మేయర్‌ ద్వారకానాథ్‌రెడ్డితో కలిసి మేకపాటి గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు పరిపాలన తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.  ప్రజా తీర్పుతో ప్రజా ప్రతినిథులుగా ఎన్నికైన వారిని పక్కనబెట్టి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి నచ్చిన వారికి పక్కా గృహాలను మంజూరు చేయిస్తున్నారని మండిపడ్డారు.  రెండున్నర సంవత్సరాలుగా ఇళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఒక్క ఇళ్లు అయినా కట్టించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 47 లక్షల పక్కా గృహాలను కట్టించారని గుర్తు చేశారు. 

ప్రశ్నిస్తే బురదజల్లుతున్నారు
ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి అడ్డం పడుతుందని చంద్రబాబు బురదజల్లుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో 18 ఎకరాల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కనీసం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఆసరా పెన్షన్లు కూడా అరకొరగా ఇస్తున్నారని, రెండువేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కొత్త పెన్షన్‌ ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

 
Back to Top