చెంద్రసామి... 'పచ్చ' జపం!

అడ్వి. గందం చెట్లు, టేకు చెట్లు కొట్టేయంగ నామ్‌కె వాస్తె ఉన్న అడ్విగాదు. పెద్దడ్వి. గాదాంట్ల సివ్వాలున్నయి. పులులున్నయి. ఏన్గలున్నయి. గుడ్డేల్గున్నయి. ఒక్క మాటల జెప్పాలంటె మనకెర్కున్నయి అన్ని ఉన్నయి. గా అడ్విల ఒక మర్రి చెట్టుకింద చెంద్రసామి తపస్సు జేస్తన్నడు. చెంద్రసామికి పచ్చంగిలు సైకిలు అంటె శానిస్టం. గాయినను జూసి పులులు గూడ దూరం బోతున్నయి. పాము లు ఒక్కతీర్గ బయపడ్తున్నయి. ఆకర్కి పిట్టలు గూడ గాయినను బరోస జేస్తలెవ్వు. గాయిన మన రాస్ట్రంల ఉన్న అడ్విల తప్పస్సు జేస్త లేడు. వేరె రాస్ట్రంల ఉన్న అడ్విల తప్పస్సు జేస్తున్నడు. గాయిన లాపతా అని ఎర్కగాం గనే మన సర్కారే గాకుంట టిడిపి పరేశా నైంది.

పేపర్లల్లనే గాకుంట టివిలల్ల గూడ ‘చెంద్రసామి లాపతా’ అనేటి వార్త వొచ్చింది. ఇగ దాంతోని జెనం గూడ గా దాని మీదనే మాట్లాడుకోబట్టిండ్రు. కిరన్ సర్కార్ ఒక్క తీర్గ చెంద్రసామి గురించి లెంకబట్టింది. టిడిపి బంద్‌లు, దర్నలు, బూకర్తాల్లు జెయ్య బట్టింది. చెంద్రసామి యాడున్నడో ఎర్క జేస్కోని జెప్పకుంటె సస్తమని పెయ్యి మీద పిట్రోలు బోస్కొని అగ్గిపెట్టె బట్టుకొని కొందరు బెదిరియ్య బట్టిండ్రు. సెల్ టవర్లు ఎక్కి గీడికెల్లి దుంకి సస్తమని ఇంకొందరు బెదిరియ్య బట్టిండ్రు. గని ఒక్కడు గూడ పానం దీస్కోలేదు. చెంద్రసామి అందర్ని ఇడ్సిపెట్టి తప్పస్సు జేసెతంద్కు అడ్వికి బోంగనే మన రాస్ట్రంల ఆనలు బడ్డయి. గాని అడ్విల ఆనలు బంద్ అయినయి.

మంచిగ ఎసి అర్రల ఉండుకుంట మోటర్ల దిర్గేటి చెంద్రసామి అడ్వికి ఎందుకు బోయిండు? ఒక్క బాద దప్పిడ్సి గాయినకు ఎసువంటి బాదలు లెవ్వు. గాయిన యాడ్కి బోయినా పచ్చంగిలు జిందాబాద్ అంటయి. గాయిన ఇషార మీద నడుస్తయి. గాయినకు ఎసువంటి కస్టాలు లెవ్వు. గని జెనం కస్టాలు జూస్తె గాయిన మనసు కలకలమంటది. జెనం బాదనే గాయిన బాద. జెనం కోసం గాయిన ఒక్కతీర్గ తన్లాడుతుంటడు. గని ఎం దుకో ఏమో జెనమే గాయినను బరోస జేస్త లేరు. రాస్ట్రంల కరెంటు ఎమర్జన్సి బెట్టిండ్రు.

కరెంటు కోతలు సితమెక్వైనయి. కార్కానలకు మూడు దినాలు కరెంటిచ్చిండ్రు...బంద్ జేసిండ్రు. దాంతోని దినం కూలి మీద పని జేసెటోల్లకు బువ్వ లేకుంటబోయింది. నేత పనోల్ల బత్కులు ఆగమైనయి. రైతులు ఎవుసం బంద్ బెట్టిండ్రు. ‘కరెంటు కోతలు లేకుంట జెయ్యాలె. నడ్మల రుకాయించకుంట రైతులకు ఏడు గంటలు కరెంటు ఇయ్యాలె’ అని అన్కుంట ముందుగాల్ల టిడిపి దర్నలు జేసింది. హర్తాల్లు జేసింది. బంద్‌లు జేసింది. బూకర్తాల్లు గూడ జేసింది. గని ఎన్ని జేసినా బూడ్దెల పన్నీరు బోసినట్లు అయ్యింది.. ముక్యమంత్రి కిరన్‌కుమార్ మంత్రుల మాటనే ఇనడు. ఇగ టిడిపి లీడర్ల మాట ఎందుకింటడు. అర్గీజ్ ఇనడు.

‘‘ఎట్లన్న జేసి జెనంకు కరెంటు ఇయ్యుం డ్రి’’ అని టిడిపి లీడర్లు అంటె - ‘‘యాడికెల్లి ఇయ్యుమంటరు? యాడున్నదని ఇయ్యుమం టరు? కరెంటు కోసం నేను ఎన్ని తీర్లనో తిప్పలుబడ్తున్న. గ్యాస్ ఇయ్యుమని సెంటర్ నడ్గిన. బొగ్గుతోని కరెంటు బుట్టిపిద్దామంటె గది బంగారమైంది. ఆనలు సరింగ కుర్వక బట్కె నీల్లతోని కరెంటు బుట్టియ్యొస్తలేదు. గ్యాస్ తక్వ ఉండబట్కె గాదానితోని గూడ పాయిదలేదు. గాలి గిర్నిలతోని కరెంట్ బుట్టి ద్దామంటె అయితలేదు. సెంటర్ తాన్కెల్లి కరెంట్ గొందామంటె పిరమున్నది.

కడ్మ రాష్ట్రాలకు బొగ్గు ఇచ్చి కరెంట్ ఇయ్యుమం టున్న. కరెంట్ తక్వ ఉంటె కోతలు ఉంటయి గదా. గందుకే అందరు కిర్కిలు, తల్పులు దెర్సుకోని గూసోవాలె. గట్ల జేస్తె మంచిగ గాలి, ఎల్గు వొస్తదని విలేకర్లకు జెప్పిన. గాల్లు పేపర్లల్ల రాసిండ్రు. గా దానిమీద గాయి గాయి జేస్తరేంది? మీరు నాతోని మాట్లాడెతం దుకు వొచ్చి సెక్రెటేరియట్ల దర్న జేసుడు ఏం బాగలేదు’’ అని ముక్యమంత్రి అన్నడు.

రొండు దినాలైనంక కరెంట్ కోతల మీదనే టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లిల ఉన్న టిడిపి ఎల్‌పి బంగ్ల ముంగట దర్న జేసిండ్రు. రాజకుమారి బంగ్ల ఎక్కి గూసున్నది. కరెంట్ బాదలేకుంట జేస్తనని మీడియకు ముక్యమం త్రి జెప్తె బంగ్ల దిగుతనన్నది. ‘దిగుదిగు కుమారి దిల్‌దార్ కుమారి’ అని పాడుకుంట పోలీసోల్లు ఆమెకు మస్కగొట్టిండ్రు. రాజకు మారి ఏమన్న తక్వదిన్నదా ‘దిగుదిగుమన్న నేదిగలేనన్న’ అన్కుంట పాడింది. ఆకర్కి ఆమెంతట ఆమెనే బంగ్ల దిగింది.

గియన్ని జూసి మనసు కలకలమనె బట్కె చెంద్రసామి శివుని కోసరం తప్పస్సు జేసిండు. గాయిన తప్పస్సుకు కుషై శివుడు గండ్లబడి -

‘‘ఏంగావాలె’’ అని అడిగిండు.

‘‘మీ పాశుపతాస్త్రం గావాలె’’ అని చెంద్రసామి అన్నడు.

‘‘నీ తాన అన్ని అస్త్రాలకన్న పవర్‌పుల్ అస్త్రమున్నది. గదే ‘వెన్నుపోటు అస్త్రం’ ఏరే అస్త్రమెందుకు’’ అన్కుంట శివుడు మాయ మైండు.

తోక: నా చిన్నప్పుడు మావూర్లె పురానం జెప్పుకుంట ఉల్లిగడ్డ దినొద్దని పంతులు జెప్పిండు. గని గాయిన ఇంట్ల గాయినే గాకుంట అందరు ఉల్లిగడ్డ దింటరు. గిదేంది పంతులూ? అని అడిగితె ఉల్లిగడ్డ దినొద్దని మీకు జెప్పిన గని నాగ్గాదు అని అన్నడు. గా పురానం పంతులసుంటోడే మన ముక్య మంత్రి. తల్పులు, కిట్కిలు దెర్సుకోవాలని జెనంకు జెప్పిండు. గని నెలకు గాయినకు వొచ్చేటి కరెంటు బిల్లు లచ్చ రూపాలు.

-తెలిదేవర భానుమూర్తి

Back to Top