ఉన్న జాబులు పీకేస్తున్నారు
శ్రీశైలం(గాజులపల్లె): అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉన్న జాబులను పీకేస్తున్నారని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆరోపించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన గాజులపల్లెలో పర్యటించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించకుండా ప్రచార ఆర్భాటం కోసం వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు.
పక్కా ఇళ్లు మంజూరు చేయించండి
నెల్లూరు(సూళ్లూరుపేట))పక్కాఇళ్లు మంజూరు చేయించాలని కుప్పాల మత్స్యకారులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను వేడుకున్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన తడ, పెరియవట్టు పంచాయతీల్లో పర్యటించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త గృహాలను మంజూరు చేయిస్తానని ఆయన హామీనిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలను పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తుందని ఆయన మండిపడ్డారు.
బాబు హామీలకు మోసపోయాం
పత్తికొండ(వెల్దుర్తి): డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేస్తామని బాబు చెప్పిన హామీలను నమ్మి మోసపోయామని పొదుపు మహిళలు వైయస్సార్‌సీపీ నియోజవకర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన రామళ్లకోట గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందించి చంద్రబాబు మోసపూరిత హామీలపై మార్కులు వేయించారు.