ప్రజల సొమ్ము స్వాహా చేస్తున్నారు

బాబుది మోస‌పూరిత పాల‌న‌
నెల్లూరు: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిది మోస‌పూరిత పాల‌న అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్రమంలో భాగంగా ఆయ‌న చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేయ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న వంద ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు.

ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్ట‌ని ప్రభుత్వం
కావ‌లి:  బోగోలు మండ‌లం ముంగ‌మూరు వ‌ద్ద గ‌తంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు వంతెన కొట్టుకుపోయింది... హైవే నుంచి రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. మంత్రులు, అధికార పార్టీ నాయ‌కులు వంతెన‌ను ప‌రిశీలించి రూ. కోటి మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంత్రులు హామీ ఇచ్చి రెండున్నరేళ్లవుతున్నానేటికీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయ‌లేద‌ని ముంగ‌మూరు వాసులు కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ముంగ‌మూరులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం ఆయ‌న అధ్య‌క్షుత‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...  ప్రజ‌ల సొమ్ము స్వాహా చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా మారింద‌న్నారు. గ్రామాల్లో క‌నీస అభివృద్ధి కూడా జ‌ర‌గ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీల‌తో అధికారంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేసింద‌న్నారు. 

అర్హుల‌కు అంద‌ని సంక్షేమ ప‌థ‌కాలు
విశాఖపట్నం(మ‌ర్రిపాలెం):  రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అర్హుల‌కు అంద‌డం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచ‌రులు సిఫార్సు చేసిన పేర్లు మాత్ర‌మే అర్హుల జాబితాలో ఉంటున్నాయి. అర్హ‌త ఉన్నా తమ ద‌ర‌ఖాస్తులు ప‌రిశీలించ‌డం లేదు. ఇళ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, మంజూరు విష‌యంలో స‌ర్వేలు నామ‌మాత్రంగా జ‌రిగాయంటూ వైయ‌స్సార్‌సీపీ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తైనాల విజ‌యకుమార్ ఎదుట ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విజ‌య‌కుమార్ ఆధ్వ‌ర్యంలో స్థానిక 41వ వార్డు ప‌రిధి పాత ఐటీఐ జంక్ష‌న్‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 

Back to Top