మూడేళ్లలో ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు

వైయస్ఆర్ కడపః చంద్రబాబు ఎన్నికల సమయంలో వందలాది హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని వైయస్సార్సీపీ కడప ఎమ్మెల్యే అంజాద్ బాష మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గౌస్ నగర్ 27వ డివిజన్ లో పర్యటించారు.  రైతు రుణమాఫీ, బంగారు రుణాల మాఫీ, డ్వాక్రామహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, నిరుపేదలకు ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి బాబు మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు వేలకోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో వైయస్ఆర్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడ కేటాయించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

పేదలు నివసించే లోతట్టు ప్రాంతమైన గౌస్ నగర్ లో ఎలాంటి మౌళిక సదుపాయాలు లేవని అన్నారు. కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు వస్తున్న నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఒక్కరికైనా పెన్షన్లు గానీ, రేషన్, ఇళ్లు గానీ మంజూరు చేశారా ..? ఏం ఘనకార్యం చేశారని జన్మభూమి కార్యక్రమాలు చేస్తున్నారని పాలకులను నిలదీశారు. మీరు గతంలో తీసుకున్న అప్లికేషన్లు ఎన్ని పరిష్కరించారో ప్రజలకు చెప్పాలన్నారు. అధికార పార్టీ దోచుకోవడమే పనిగా పెట్టుకుందని,  ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడా లేదని అంజాద్ బాషా ఫైర్ అయ్యారు. వైయస్సార్సీపీ నిత్యం ప్రజల కోసం అహర్నిషలు  కృషి చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. 
Back to Top